పనులు చతికిల‘బడి’

ABN , First Publish Date - 2022-06-28T05:42:22+05:30 IST

‘కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం.. మన బడి నాడు- నేడు కార్యక్రమంలో పాఠశాలల రూపురేఖలు మార్చేస్తాం’..

పనులు చతికిల‘బడి’
పాయకరావుపేట మండలం పెదరామభద్రపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పైఅంతస్థుకు పిల్లర్లు వేసి వదిలేసిన దృశ్యం

జిల్లాలో మన బడి నాడు-నేడు కింద 463 పాఠశాలల ఎంపిక

రెండు నెలలైనా ముందుకు సాగని పనులు

అధికారుల ఒత్తిళ్లతో కొన్ని చోట్ల పునాదులు తవ్వి వదిలేసిన వైనం

ఈ విద్యా సంవత్సరంలో కూడా అరకొర వసతులతోనే చదువులు

 (అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

‘కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం.. మన బడి నాడు- నేడు కార్యక్రమంలో పాఠశాలల రూపురేఖలు మార్చేస్తాం’.. ముఖ్యమంత్రి తరచూ చెప్పే మాటలివి. అనకాపల్లి జిల్లా విషయానికి వస్తే రెండో విడత నాడు-నేడులో 463 పాఠశాలలను రెండు నెలల క్రితం ఎంపిక చేస్తే ఒక్క పాఠశాలలోనూ పనులు జరగలేదు. ఈ విద్యా సంవత్సరంలో కూడా అరకొర వసతులతోనే విద్యార్థులు ఇబ్బందులు పడడం తప్పేలా లేదు. 

జిల్లాలో రెండో విడత మన బడి నాడు-నేడు పనులు ముందుకు సాగడం లేదు. వచ్చే నెలలో పాఠశాలలు పునఃప్రారంభమవుతుండగా నిర్మాణ పనుల్లో ఎక్కడా ప్రగతి కనిపించ డం లేదు. సిమెంట్‌, ఇసుక, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి సరఫరా చేయకపోవడం వల్లే పనులు జరగడం లేదని తెలిసింది. కొద్ది రోజుల కిందట కనీసం పునాదులైనా తవ్వమని  అధికారులు ఒత్తిళ్లు తేవడంతో అక్కడక్కడా పునాదులు తీసి వదిలేశారు. జిల్లాలో రెండో విడత నాడు- నేడు కింద 463 పాఠశాలలను రెండు నెలల క్రితం ఎంపిక చేశారు. 

పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కమిటీల ఆధ్వర్యంలో జరగాల్సిన ఈ పనులకు ఒప్పందాలు (ఎంఓయూ), బ్యాంకు ఖాతాలు తెరిచి ప్రభుత్వ యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. అయితే జిల్లాలో 22 మండలాలు, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల పరిధిలో ఒక్క భవన నిర్మాణం కూడా ఇంకా ప్రారంభించలేదు. రెండు నెలల క్రితమే ఈ పనులకు పరిపాలన ఆమోద ముద్ర వేసినా పనులు జరగడం లేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో అదనపు గదులు, మరుగుదొడ్లు, ప్రహరీ, వంటశాలల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. తాగునీరు, విద్యుత్‌ సదుపాయం, బెంచీలు, గ్రీన్‌ బోర్డుల ఏర్పాటు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. వేసవి సెలవుల్లో పనులు మొదలుపెట్టి జూలై 4న పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాలి. 

పాయకరావుపేట మండలంలో రెండో విడతలో 31 పాఠశాలల్లో అదనపు భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే పాయకరావుపేట మండలం పెదరామభద్రపురం జడ్పీ ఉన్నత పాఠశాల పైఅంతస్థుకు పిల్లర్లు వేసి వదిలేశారు. అనకాపల్లి, మునగపాక, కశింకోట మండలాల్లో అధికారుల ఒత్తిళ్ల వల్ల ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులు చేపడుతున్నారు. 

అయితే తరగతులు నిర్వహించే సమయంలో పనులు చేపడితే చదువులకు ఆటంకం కలుగుతుందని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-06-28T05:42:22+05:30 IST