టాటా.. బైబై...!

Published: Wed, 21 Sep 2022 00:02:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టాటా.. బైబై...!దగదర్తి మండలం దామవరం వద్ద విమానాశ్రయ నిర్మాణ ప్రదేశం (ఫైల్‌)

దగదర్తి వద్ద విమానాశ్రయం ఇక లేనట్టే!

‘ప్రకాశం’ సరిహద్దులో ఏర్పాటుకు నిర్ణయం

అసెంబ్లీలో ప్రకటించిన సీఎం జగన

ఇటీవలే తెట్టు వద్ద భూముల పరిశీలన

కొత్త ప్రతిపాదనలతో చిక్కుముడులెన్నో!

అటవీ, కేంద్రం అనుమతులు సాధ్యమయ్యేనా!?

కాలయాపన కోసమేనన్న సందేహాలు

అక్షర సత్యమైన ఆంధ్రజ్యోతి కథనాలు 


అనుకున్నదే జరిగింది.. ‘ఆంధ్రజ్యోతి’ కథనమే నిజమైంది. నెల్లూరు నగరానికి సమీపాన కృష్ణపట్నం పోర్టు, పరిశ్రమలకు అనుసంధానంగా దగదర్తి వద్ద నిర్మించతలపెట్టిన విమానాశ్రయం చేజారిపోనుంది. ప్రకాశం జిల్లా సరిహద్దులో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా అసెంబ్లీలో సీఎం జగన్మోహనరెడ్డి ప్రకటించారు. దీంతో పదిహేనేళ్ల కష్టం.. రూ.కోట్ల ఖర్చు వృథా  అవడమేగాక జిల్లావాసుల ఆశలు గల్లంతు అయ్యాయి.  ఈ తాజా ప్రతిపాదనలతో కావలి ప్రాంతం మినహా మిగిలిన అన్ని ప్రాంతాలకూ విమానాశ్రయం దూరం కానుంది. 

- నెల్లూరు(ఆంధ్రజ్యోతి)/కందుకూరు


2007లో విమానాశ్రయం నిర్మాణంపై చర్చలు మొదలవగా, 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవి కార్యరూపం దాల్చి దగదర్తి మండలం దామవరం వద్ద విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 1,379 ఎకరాల్లో నిర్మాణానికి భూసేకరణ మొదలుపెట్టారు. అప్పటి రైతుల విజ్ఞప్తి మేరకు పట్టా భూములకు రూ.18 లక్షలు, సీజేఎ్‌ఫఎస్‌, డీకేటీ భూములకు ఎకరాకు రూ.13 లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం సుమారు 1060 ఎకరాలను రైతులు ప్రభుత్వానికి అప్పగించారు. మరో 300 ఎకరాలకుపైన భూమి వివాదం హైకోర్టులో నడుస్తోంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో దగదర్తి విమానాశ్రయాన్ని నిర్మించి ఓ సంస్థకు కాంట్రాక్ట్‌ కూడా అప్పగించారు. అయితే కోర్టు కేసు ఆలస్యం అవుతుండడంతో అప్పటి వరకూ అందిన 1060 ఎకరాల భూమిని కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 2019, జనవరిలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు దామవరం వద్ద విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రనవేకు సంబంధించిన ఎర్త్‌ వర్క్‌ పనులు మొదలయ్యాయి. ఒప్పందం ప్రకారం రెండేళ్లలో విమానాశ్రయ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. 


వ్యతిరేకత వస్తుందనే..


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కాంట్రాక్టును రద్దు చేసింది. మరోసారి డీపీఆర్‌ తయారు చేయించింది. అనంతరం పనులు అప్పగించేందుకు ప్రయత్నించగా కాంట్రాక్టు సంస్థలు ముందుకు రాలేదని సమాచారం. చివరకు అదానీ సంస్థ కూడా ఫీజిబులిటీ కాదని తేల్చేయడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. జరుగుతున్న పనులను ఆపేయడం, కొత్తగా ఎవరూ ముందుకు రాకపోవడం వంటి విషయాలు ప్రజల్లోకి వెళితే వ్యతిరేకత వస్తుందని గమనించి ప్రకాశం జిల్లా సరిహద్దులో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ ఈ నెల 14వ తేదీన ‘ఎవరూ రాకనే తెరపైకి తెట్టు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ఓ కథనం ప్రచురితమైంది. అలాగే గత నెల వ తేదీన ఆంధ్రజ్యోతిలోనే మరో కథనం ప్రచురితమైంది. ఈ కథనాలన్నీ ఇప్పుడు నిజమని స్పష్టమయ్యాయి. 


కాలయాపన కోసమేనా?


తెట్టు పరిసరాల్లో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదన కాలయాపన కోసమేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి  ఇటీవల జరిగిన రామాయపట్నం పోర్టు భూమిపూజ సందర్భంగా ఈ అంశం తెరమీదకు వచ్చాక రెండురోజులకే జాయింట్‌ కలెక్టరు కూర్మనాథ్‌ ఇతర అధికారులు తెట్టు, ఉలవపాడు మండలం రాజుపాలెం పరిసర ప్రాంతాలలో ఉన్న భూములను పరిశీలించి వెళ్లారు. అయితే జేసీ పరిశీలించిన భూములన్నీ అటవీ శాఖవే. తెట్టు పరిసరాల్లో 2వేల ఎకరాలు, రాజుపాలెం పరిసరాల్లో 1500 ఎకరాలు ఫారెస్టు భూములున్నాయి. ఈ భూములు జాతీయ రహదారికి సమీపంలో ఉండటం, రామాయపట్నం పోర్టు నిర్మాణ ప్రదేశానికి కూడా అతి సమీపంలో ఉండటం అనుకూలతలు అయినా అనేక సాంకేతిక సమస్యలు ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్న తెట్టు వద్ద ఉన్న ఫారెస్టు భూముల మధ్యలో రెండు మూడు ఇరిగేషన చెరువులకు ప్రధాన నీటివనరులుగా ఉన్న సప్లై ఛానల్స్‌ ఉన్నాయి. అలాగే పలు గ్రామాలకు సంబంధించిన భూములకు వెళ్లే రహదారులు ఉన్నాయి. ఇక్కడున్న 2 వేల ఎకరాలను విమానాశ్రయానికి కేటాయించారంటే ఇక ఆ మూడు చెరువుల కింద ఉన్న మాగాణి ఒట్టిపోవటమే. అలా కాకుండా చెరువుల పారుదలకు ఇబ్బంది లేకుండా విమానాశ్రయం నిర్మించడం సాధ్యమా అంటే కష్టమేనని  అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వీటిన్నింటికంటే ముఖ్యంగా ఫారెస్టు భూములను తీసుకోవటం అంటే అంత తేలికగా అయ్యేపనికాదనేది జగమెరిగిన సత్యం. ఒక ఎకరం ఫారెస్టు భూమిని ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవాలంటే ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలోని మరో ప్రాంతంలో అంతకు రెట్టింపు భూమిని అటవీ శాఖకు బదలాయించాల్సి ఉండటమేగాక ఆ ప్రతిపాదనలకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. ఇది అంత సులువుగా అయ్యేపని కాదు. అవన్నీ తెలిసి కూడా అందుకు సంబంధించిన ఎలాంటి ప్రక్రియ ప్రారంభించకుండానే  ముఖ్యమంత్రి జగన హడావిడిగా కందుకూరుకు సమీపంలో విమానాశ్రయం అని అసెంబ్లీలో ప్రకటించటం అంటే ఇది కచ్చితంగా కాలయాపన తంతేనన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.


నెల్లూరు వాసులకు దూరం


దామవరం వద్ద ఎయిర్‌పోర్టు నిర్మిస్తే జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉండేది. అయితే, తెట్టు వద్ద నిర్మాణ ప్రతిపాదన నెల్లూరు వాసులకు దాదాపు వంద కిలోమీటర్ల దూరం కానుంది. తెట్టుకు, తిరుపతి ఎయిర్‌పోర్టుకు దాదాపు సమాన దూరం ఉండటం గమనార్హం. మరోవైపు దగదర్తి వద్ద రైతుల నుంచి సేకరించిన భూమి, పెట్టిన ఖర్చు వృథా అయ్యాయి. ఇక్కడ భూములు సిద్ధంగా ఉన్నా ఈ ప్రాంతాన్ని కాదని కొత్తగా భూములు వెతుక్కోవడమేమిటో ప్రభుత్వమే చెప్పాలి. 

టాటా.. బైబై...!గుడ్లూరు మండలం తెట్టు వద్ద విమానాశ్రయం కోసం పరిశీలించిన అటవీ భూముల్లో జామాయిల్‌ చెట్లు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.