డబుల్‌ చార్జ్‌!

ABN , First Publish Date - 2020-12-03T06:18:40+05:30 IST

జనరల్‌ లాక్‌ ఎత్తివేయకుండా స్పెషల్స్‌ పేరుతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న రైల్వే శాఖ.. ఇప్పుడు పండగల పేరుతో డబుల్‌ చార్జ్‌కు తెగపడుతోంది!

డబుల్‌ చార్జ్‌!

ఫఫెస్టివల్‌ స్పెషల్స్‌... ‘తత్కాల్‌’ బాదుడు! 

ఫక్రిస్మస్‌, సంక్రాంతి దందాకు తెర! 

పండగ పేరుతో డబుల్‌ చార్జి

లబోదిబోమంటున్న రైల్వే ప్రయాణికులు 

(ఆంధ్రఽజ్యోతి, విజయవాడ)

 జనరల్‌ లాక్‌ ఎత్తివేయకుండా స్పెషల్స్‌ పేరుతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న రైల్వే శాఖ.. ఇప్పుడు పండగల పేరుతో డబుల్‌ చార్జ్‌కు తెగపడుతోంది! ఫెస్టివల్‌ స్పెషల్స్‌ పేరుతో రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ తత్కాల్‌ చార్జీతో సమానంగా వాటిలో చార్జీలను వసూలు చేస్తోంది. పండగల వేళ ఇదేమి దోపిడీ అని ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురి అవుతున్నారు. ఈ నెల చివరి వారంలో క్రిస్మస్‌, వచ్చే నెలలో సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఇప్పటి నుంచే ఫెస్టివల్‌ స్పెషల్‌ రైళ్లను నడుపుతోంది. ఇంత ముందుగా ఫెస్టివల్‌ రైళ్లను ప్రవేశపెట్టడం ఒక విచిత్రం అయితే.. ఈ రైళ్లలో తత్కాల్‌ ఛార్జీ వసూలు చేయటం గమనార్హం. ఒక ట్రైన్‌లో సీట్లన్నీ బుకింగ్‌ అయిపోతే వెయిటింగ్‌ లిస్ట్‌ ఫుల్‌గా ఉంటుంది. టిక్కెట్‌ క్యాన్సిలేషన్‌ జరిగితే వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న వారికి ప్రాధాన్యతా క్రమంలో దక్కుతుంది. కానీ అత్యవసర పనుల మీద ప్రయాణించే వారికి తత్కాల్‌ కోటా కొంత ఉంటుంది. ఈ కోటాలో సాధారణ చార్జీ కంటే రెట్టింపు ధరతో టిక్కెట్లను జారీ చేస్తారు. ఇది కూడా పరిమితంగానే ఉంటుంది. ఇలాంటి తత్కాల్‌  విధానాన్ని ఫెస్టివల్‌ స్పెషల్‌ రైళ్లలో రైల్వేశాఖ ప్రవేశపెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. విజయవాడ డివిజన్‌ మీదుగా పాతిక పైగా ఫెస్టివల్‌ స్పెషల్‌ రైళ్లు నడుస్తున్నాయి. వాస్తవానికి పండుగలకు ఒక వారం, రెండు వారాల ముందు నుంచి సహజంగా డిమాండ్‌ ఉంటుంది. సాధారణ రూట్లలో ఉన్న డిమాండ్‌ను ఎన్‌‘క్యాష్‌’ చేసుకునేందుకు రైల్వేశాఖ ఇలా ఫెస్టివల్‌ స్పెషల్స్‌ నడుపుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఫెస్టివల్‌ స్పెషల్స్‌ పేరుతో తత్కాల్‌ చార్జీ వసూలు చేయటానికే రహస్య ప్రణాళికలను అమలు చేశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సాధారణంగా ఫెస్టివల్‌ స్పెషల్‌ రైళ్లలో ప్రయాణ చార్జీలో 50 శాతం అధికంగా వసూలు చేస్తుంటారు. దీనికి భిన్నంగా ఫెస్టివల్‌ స్పెషల్‌ రైళ్లలో తత్కాల్‌ చార్జీలను వసూలు చేయటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.   

 ఫెస్టివల్‌ స్పెషల్‌ రైళ్లలో బాదుడు ఇలా : 

   ఫెస్టివల్‌ స్పెషల్‌ ట్రైన్‌లో విజయవాడ నుంచి నర్సాపూర్‌ వెళ్ళాలంటే.. స్లీపర్‌ క్లాస్‌కు రూ.375 ఛార్జీ చెల్లించాల్సి వస్తోంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు కూడా ఇదే విధంగా రూ. 375 చెల్లించాల్సి వస్తోంది. ఇదే సాధారణంగా వెళ్లే రైళ్లలో అయితే రూ.175 మాత్రమే చార్జీగా ఉంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళేవారి నుంచి రూ.415 వసూలు చేస్తున్నారు. అదే సాధారణ రైలులో అయితే రూ.255గా ఉంది.   


Updated Date - 2020-12-03T06:18:40+05:30 IST