ఖాళీ స్థలాలపై పన్ను భారం

ABN , First Publish Date - 2022-01-29T07:52:27+05:30 IST

రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాలకు అనుమతులు పొందడం మరింత భారం కానుంది.

ఖాళీ స్థలాలపై పన్ను భారం

  • భూముల మార్కెట్‌ విలువ పెంపుతో భారీగా పెరగనున్న వీఎల్‌టీ చార్జీలు
  • ఇప్పటిదాకా నిర్మాణ అనుమతుల సమయంలో
  • 0.5 నుంచి 2శాతం వసూలు చేస్తున్న సర్కారు
  • ఇకపై ఎన్నేళ్లు ఖాళీగా ఉంచితే అంత వసూలు
  • ఏడాది చొప్పున లెక్కగట్టి వసూళ్లకు కసరత్తు?
  • 1 నుంచి మార్కెట్‌ విలువల పెంపు!
  • 50 శాతంపెరగనున్న వ్యవసాయ భూమి
  • 35 శాతం పెరగనున్న వ్యవసాయేతర భూమి
  • రిజిస్ట్రేషన్లకు ఎగబడుతున్న కొనుగోలుదారులు
  • భారీగా నమోదవుతున్న రిజిస్ట్రేషన్లు 
  • చికాకు పెడుతున్న ధరణి సర్వర్‌ డౌన్‌


హైదరాబాద్‌ /హైదరాబాద్‌ సిటీ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాలకు అనుమతులు పొందడం మరింత భారం కానుంది. ప్రభుత్వం త్వరలో భూముల మార్కెట్‌ విలువను పెంచాలని నిర్ణయించడంతో.. ఆ విలువతోపాటే నిర్మాణ అనుమతుల ఫీజులూ పెరగనున్నాయి. ముఖ్యంగా వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ (వీఎల్‌టీ)ను భూముల మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ధారిస్తుండడంతో అది అమాంతం పెరగనుంది. అంతేకాదు.. ప్రస్తుతం నిర్మాణ అనుమతుల సందర్భంలో ఒకేసారి నిర్ధారిస్తున్న వీఎల్‌టీ చార్జీలను ఇకపై సవరించనున్నట్లు, ఆస్తిపన్ను మాదిరిగానే ఏడాది చొప్పున వసూలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇంటి నిర్మాణ అనుమతులు తీవ్ర భారంగా మారే అవకాశం ఉంది. ఇప్పటిదాకా అమల్లో ఉన్న విధానం ప్రకారం.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేస్తే టీఎ్‌సబీపాస్‌ ద్వారా వీఎల్‌టీని నిర్ధారిస్తున్నారు. స్థానికంగా గల భూము ల మార్కెట్‌ విలువ, నిర్మాణ అనుమతులు పొందే ప్లాట్‌ విస్తీర్ణం ఆధారంగా దీనిని నిర్ధారిస్తారు. ఉదాహరణకు ఏదైనా మునిసిపాలిటీ పరిధిలో వంద చదరపు గజాల స్థలంలో భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే.. ప్రాసెసింగ్‌ ఫీజు, డెవల్‌పమెంట్‌ ఫీజుతోపాటు అదనంగా వీఎల్‌టీ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.అక్కడ ఉన్న మార్కెట్‌ విలువ ఆధారంగా 0.5ు వీఎల్‌టీ చార్జీలను మునిసిపాలిటీ వసూలు చేస్తోంది. ఆ ప్రాంతంలో మార్కెట్‌ విలువ ప్రస్తుతం చదరపు గజానికి రూ.10 వేలు ఉందనుకుంటే.. వంద చదరపు గజాలకు అయ్యే రూ.10 లక్షలకుగాను వీఎల్‌టీ చార్జి 0.5ు చొప్పున రూ.5 వేలు వసూలు చేస్తారు. అయితే భూముల మార్కెట్‌ విలువ 50ు పెరిగితే అందుకు తగ్గట్టుగా వీఎల్‌టీ చార్జీ  పెరుగుతుంది.   


స్థానికంగా సంస్థలకు ఆదాయంగా..

భవన నిర్మాణ అనుమతుల ఫీజులతోపాటు వీఎల్‌టీ చార్జీలు స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఈ చార్జీలను 0.5 నుంచి 2ు వరకు వసూలు చేస్తున్నారు. ప్లాట్లను కొనుగోలు చేసినవారు చాలావరకు సత్వరమే వాటిని వినియోగంలోకి తీసుకురావడం లేదు. దీంతో స్థల యజమాని నిర్మాణ అనుమతులకు వచ్చిన సందర్భంలోనే అక్కడి భూముల మార్కెట్‌ విలువ ఆధారంగా ఒకేసారి వీఎల్‌టీ చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే ఇకపై ఇలా కాకుండా. ఆస్తిపన్ను మాదిరిగా ఏడాదికేడాది చార్జీ విధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఓ వ్యక్తి వంద గజాల స్థలాన్ని కొనుగోలు చేస్తే రిజిస్ట్రే షన్‌ జరిగిన నాటి నుంచి ఎన్నేళ్లు ఆ స్థలం ఖాళీగా ఉన్నది లెక్కించి అన్నేళ్లకు వీఎల్‌టీ విధించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇలా చేయడం వల్ల వెంటనే నిర్మాణాలు జరుగుతాయని, ఆ వెంటనే ఆస్తిపన్ను వసూలవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ ఆ స్థలం అలాగే ఖాళీగా ఉన్నా.. వీఎల్‌టీ చార్జీ ద్వారా ఆదాయం వస్తుందని ప్రభు త్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వీఎల్‌టీ విధింపునకు సంబంధించి వివిధ ప్రాంతాల వారీగా విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇక మునిపాలిటీలు, కార్పొరేషన్లలో కేవలం వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ మాత్రమే వసూలు చేస్తుండగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో అదనంగా లైబ్రరీ సెస్‌ కూడా వసూలు చేస్తారు. దీనిని కూడా భూముల మార్కెట్‌ విలువ ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇవన్నీ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం వీఎల్‌టీ చార్జీల సవరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. 


1 నుంచి మార్కెట్‌ విలువల పెంపు!

స్థిరాస్తుల మార్కెట్‌ కొత్త విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం. వ్యవసాయ భూమి విలువను 50శాతానికి, ఖాళీ స్థలాల (వ్యవసాయేతర భూముల) విలువను 35శాతానికి సవరించినట్లు తెలిసింది. 2021 జూలైలో వీటి విలువలను పెంచిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మరోసారి పెంపునకు కసరత్తు పూర్తి చేసింది. ప్రస్తుతం అమల్లోఉన్న మార్కెట్‌ విలువలపై 35-50ు వరకు పెంచినట్లు ఈ శాఖ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. దీని ప్రకారం.. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2.25 లక్షలకు, పట్టణ ప్రాంత (మునిసిపాలిటీల) పరిధిలోని భూముల విలువను ఎకరానికి రూ.11 లక్షల నుంచి రూ.16,50 లక్షల వరకు సవరించినట్లు సమాచారం. ఇక సాధారణ ప్రాంతాల్లో వ్యవసాయేతర భూమి విలువను గజానికి రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెంచినట్లు తెలిసింది. జిల్లా, మండల కేంద్రాల్లోని ప్రధాన రహదారులకు గజం ధర రూ.7 వేల నుంచి రూ.10,500 వరకు ఖరారు చేసినట్లు సమాచారం. వ్యాపార సముదాయాల్లో చదరపు అడుగు విలువ రూ.3,250 వరకు, గృహ అవసరాలకు (అపార్ట్‌మెంట్‌) కొనుగోలు చేసే చదరపు అడుగు విలువ రూ.1,350 వరకు నిర్ణయించినట్లు సమచారం. విలువల ముదింపులో భాగంగా శనివారం పూర్వ జిల్లా కేంద్రాల్లో సబ్‌రిజిస్ట్రార్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం జిల్లా కమిటీలు కొత్త మార్కెట్‌ విలువలకు ఆమోదం తెలుపనున్నాయి. ఆదివారం నుంచి పెంచిన మార్కెట్‌ విలువలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. 


భారీగా రిజిస్ట్రేషన్లు..

స్థిరాస్తుల కొత్త మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీల బాదుడు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌లు భారీగా జరుగుతున్నాయి. గడువు దగ్గర పడుతుండటంతో స్లాట్‌ బుక్‌ చేసుకున్న కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్‌ల కోసం ఎగబడుతున్నారు. దీంతో జిల్లాల్లోని సబ్‌రిజిస్ట్రార్‌, తహశీల్దారు కార్యాలయాల్లో లక్ష్యానికి మించిన రిజిస్ట్రేషన్‌లు నమోదవుతున్నాయి. డాక్యుమెంట్ల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఆయా కార్యాలయాల్లో వీటి లావాదేవీలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. సాధారణ రోజుల్లో నమోదయ్యే రిజిస్ట్రేషన్లతో పోలిస్తే నాలుగైదు రోజుల నుంచి నమోదవుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య 50-55 శాతానికి పెరిగినుట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ధరణి సర్వర్‌ డౌన్‌ సమస్య రెండో రోజు కూడా కొనసాగింది. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు చికాకుపడ్డారు. రిజిస్ట్రేషన్‌ల కోసం స్లాట్ల బుకింగ్‌ పెరగడంతో సర్వర్‌ డౌన్‌ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ సర్వర్‌ సమస్య మరింత ఎక్కువైందన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, వరంగల్‌, యాదాద్రి జిల్లా పరిధిలోని ప్రాంతాల్లోనే ఈ సమస్య ఎక్కువగా తలెత్తిందని ఇంటర్‌నెట్‌  కేంద్రాల నిర్వాహకులు, ఐటీ బృందం సభ్యులు తెలిపారు.

Updated Date - 2022-01-29T07:52:27+05:30 IST