పన్ను పరిధిలోకి క్రిప్టోలు!

ABN , First Publish Date - 2021-12-05T08:18:58+05:30 IST

బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీలను పన్ను పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. భారత్‌ లేదా విదేశీ క్రిప్టో ఎక్స్ఛేంజీల ....

పన్ను పరిధిలోకి క్రిప్టోలు!

 క్రిప్టో కరెన్సీల్లో ట్రేడింగ్‌ లేదా పెట్టుబడులపై పన్ను !!

ఐటీ చట్ట సవరణ యోచనలో కేంద్రం జూ వచ్చే బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశం  

బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీలను పన్ను పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. భారత్‌ లేదా విదేశీ క్రిప్టో ఎక్స్ఛేంజీల ద్వారా వీటిలో పెట్టుబడులపై ప్రభుత్వం పన్ను వసూలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం వచ్చే బడ్జెట్లో ఆదాయం పన్ను (ఐటీ) చట్టంలోని ‘సెక్షన్‌ 26ఏ’తోపాటు పన్ను చెల్లింపుదారుల అన్ని పెట్టుబడుల సమాచారానికి సంబంధించిన యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ రెగ్యులేషన్‌ (ఏఐఆర్‌)ను సవరించనున్నట్లు సమాచారం. అంతేకాదు, ఐటీ చట్టంలో అవసరమైన అన్ని సెక్షన్లలో క్రిప్టో కరెన్సీ, క్రిప్టో ఆస్తులు, డిజిటల్‌ కరెన్సీ వంటి పదాల్ని సైతం జోడించాలన్న ప్రతిపాదన కూడా ఉందని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. అంటే, పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు క్రిప్టో ల్లో ట్రేడింగ్‌ లేదా పెట్టుబడులపై ఆదాయాన్ని ప్రత్యేకంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, రికరింగ్‌ డిపాజిట్లు, ఆభరణాల్లో రూ.2 లక్షలు, అంతకుపైగా పెట్టుబడులకు ఏఐఆర్‌ నియమావళి వర్తిస్తుంది. 


బ్యాంక్‌ల నుంచీ సమాచార సేకరణ: ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ అన్న పదమే ఐటీ చట్టంలో లేదు. దాంతో ఐటీ డిపార్ట్‌మెంట్‌ బ్యాంక్‌లను కస్టమర్ల క్రిప్టో లావాదేవీలపై సమాచారం ఇవ్వాలని అధికారికంగా కోరలేకపోతున్నాయి. పన్ను చట్టం సవరణ ద్వారా ఈ డిపార్ట్‌మెంట్‌కు  బ్యాంక్‌ల నుంచి క్రిప్టో లావాదేవీల వివరాలు కోరేందుకు అవకాశం అధికారం లభిస్తుంది. అంతేకాదు, ప్రభుత్వం విదేశీ ఆస్తుల వెల్లడి నిబంధనలను సైతం సవరించనున్నట్లు తెలిసింది. తద్వారా పన్ను చెల్లింపుదారులు విదేశా ల్లో కలిగి ఉన్న క్రిప్టో ఆస్తుల వివరాలను సైతం వెల్లడించాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, భారతీయులు విదేశాల్లో కలిగి ఉన్న స్థిర,చరాస్తులు సహా ఆ ఏ డాదిలో రియల్‌ ఎస్టేట్‌ లేదా విదేశీ ట్రస్ట్‌ల ద్వారా రాబడిని వెల్లడించడం తప్పనిసరి. 


క్రిప్టోలకు ప్రత్యేక చట్టం: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ‘క్రిప్టో కరెన్సీ, అఽధికారిక డిజిటల్‌ కరెన్సీ నియంత్రణ బిల్లు-2021’ను ప్రవేశపెట్టనుంది. ఆర్‌బీఐ అధికారిక డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్రం ప్రైవేట్‌ క్రిప్టోలను పూర్తిగా నిషేధించనుందన్న అంచనాలున్నాయి. 


ప్రపంచవ్యాప్తమైన ఈ ప్రైవేట్‌ క్రిప్టోలను నిషేధించకుండా వాటిని ఆస్తిగా గుర్తించి నియంత్రించవచ్చన్న  వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాక ప్రభుత్వ వైఖరిపై స్పష్టత రానుంది. అయితే, వాటి నియంత్రణకు క్రిప్టో చట్టం తీసుకురావడంతో పాటు వాటి లావాదేవీలను పన్ను పరిధిలోకి తెచ్చేందుకు ఐటీ చట్టాలనూ సవరించాలనుకుంటోంది. 


క్రిప్టోలపై అతిగా ఊహాగానాలు మంచిది కాదు: నిర్మల 

ప్రస్తుతం దేశంలో క్రిప్టో కరెన్సీలపై చాలా ఊహాగానాలు నెలకొన్నాయని, ఇది ఏమాత్రం మంచిది కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. హిందుస్థాన్‌ టైమ్స్‌ ఆధ్వర్యంలో జరిగిన నాయకత్వ సదస్సులో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌ ఆమోదం తీసుకున్నాక పార్లమెంట్‌లో క్రిప్టో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆమె చెప్పారు. ఈ ఏడాది జీడీపీ వృద్ధి అత్యంత ప్రోత్సాహకరంగా ఉండనుందని, భారత్‌ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా అవతరించనుందన్నారు. ఆహార ధరల గురించి మాట్లాడుతూ.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వరదల వల్ల ఏర్పడిన సరఫరా అవరోధాల కారణంగానే ధరలు ఒక్కసారిగా పెరిగాయన్నారు. వచ్చేనెలలో మళ్లీ తగ్గుముఖం పట్టవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 


బిట్‌కాయిన్‌ భారీ పతనం 

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌.. క్రిప్టో మార్కెట్‌నూ వణికించింది. అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ శనివారం ఒక దశలో 20 శాతం మేర పతనమై 42,000 డాలర్ల స్థాయికి పడిపోయింది. రెండో అతిపెద్ద క్రిప్టో ఈథర్‌ సైతం 17.5 శాతం మేర  క్షీణించింది. అయితే, ఈ కరెన్సీలు మళ్లీ కాస్త కోలుకున్నాయి. రాత్రి 11.45 గంటల సమయానికి బిట్‌కాయిన్‌ 9.5 శాతం మేర నష్టంతో 48,200 డాలర్ల స్థాయిలో ట్రేడవగా.. ఈథర్‌ 4 శాతం నష్టంతో 4,500 డాలర్ల స్థాయి వద్ద కదలాడింది. 

Updated Date - 2021-12-05T08:18:58+05:30 IST