గ్రానైట్‌కు పన్నుపోటు

ABN , First Publish Date - 2021-06-12T04:20:54+05:30 IST

గ్రానైట్‌ క్వారీలపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను భారం పెంచింది. క్వారీలపై లెవీ ఆఫ్‌ కన్సడరైజేషన్‌ కింద 50శాతం పన్నులు పెంచుతూ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ గోపాలక్రిష్ణ దివేది ఈ నెల7న జీవోనెం.42ను జారీ చేశారు.

గ్రానైట్‌కు పన్నుపోటు
గ్రానైట్‌ బ్లాకులు

- 50 శాతం పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు

- తలలు పట్టుకుంటున్న క్వారీ యాజమాన్యాలు

(టెక్కలి)

గ్రానైట్‌ క్వారీలపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను భారం పెంచింది. క్వారీలపై లెవీ ఆఫ్‌ కన్సడరైజేషన్‌ కింద 50శాతం పన్నులు పెంచుతూ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ గోపాలక్రిష్ణ దివేది ఈ నెల7న జీవోనెం.42ను జారీ చేశారు. ప్రస్తుతం క్వారీ యాజమాన్యాలు ఒక క్యూబిక్‌మీటర్‌ గ్రానైట్‌ బ్లాక్‌కు రూ.3,450 సీనరీస్‌ చార్జీలు, డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌కు రూ.430, రెండు శాతం మెరిట్‌ఫీజు కింద రూ.70 చొప్పున మొత్తంగా రూ.3,950 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా 50 శాతం మేర పన్ను పెంచడంతో ఇకపై మొత్తంగా ఒక క్యూబిక్‌ మీటర్‌ గ్రానైట్‌ బ్లాక్‌కు  రూ.5,695 చెల్లించాల్సి ఉంది. క్వారీ యాజమాన్యాలపై రూ.1,540 చొప్పున అదనపు భారం పడనుంది. గ్రానైట్‌బ్లాక్‌ల అలవెన్స్‌ల మూలంగా అదనపు చెల్లింపులు క్వారీ యాజమాన్యాలకు తడిసిమోపెడు కానున్నాయి. ఔట్‌సోర్సింగ్‌ ద్వారా టన్నేజ్‌ భారం 20శాతం పెంపు కూడా అదనపు భారం కానుంది. పన్నుపోటు వల్ల ప్రస్తుతం జిల్లాలోని గ్రానైట్‌ క్వారీలపై ఏటా సుమారు రూ.26కోట్లు అదనపు భారం పడనుంది. గత ఏడాది ఈ ప్రభుత్వం 15శాతం సీనరీస్‌ చార్జీలు పెంచి, తాజాగా లెవీ ఆఫ్‌ కన్సడరైజేషన్‌ కింద పన్నులు పెంచడం పరిశ్రమకు గుదిబండగా మారిందని క్వారీ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పన్నుల పెంపు విషయమై మైన్స్‌ ఏడీ పి.రాజేష్‌కుమార్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం మేర అదనపు పన్నులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.   

 

Updated Date - 2021-06-12T04:20:54+05:30 IST