రాజమహేంద్రవరంలో పన్నులు కట్టాలని, లేదంటే అత్యవసర సర్వీసులు నిలిపివేస్తామంటూ హెచ్చరిక బోర్డులు
పట్టణ ప్రజలకు ‘పన్ను’ బాధ
గతేడాది కంటే 15 శాతం అధికం
వసూళ్ల కోసం తీవ్ర ఒత్తిడి
నెలాఖరు వరకే తుది గడువు
వడ్డీ సహా కట్టకపోతే జప్తు, లేదంటే కనెక్షన్లు కట్ చేస్తామని హెచ్చరిక
జిల్లాలో మున్సిపల్ పన్నులు మొత్తం రూ. 255.76 కోట్లు
వసూలైంది రూ.105.57 కోట్లు
జప్తు వాహనాలతో హడావుడి
అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇప్పుడు అందరిదీ ఒకే పని. ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఒకటే పరుగులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూరు శాతం పన్నుల వసూళ్ల లక్ష్యాలను చేరుకోవడమే వారి ముందున్న కర్తవ్యం. పాత బకాయిలను వడ్డీతో సహా వసూలు చేయడం, ప్రస్తుత టార్గెట్లను పూర్తిగా చేరుకోవడం కోసం అన్ని రకాలుగా ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. పన్నులు కట్టకపోతే మీ ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. లేదంటే ప్రభుత్వ పథకాలన్నీ నిలిపివేస్తామని, కుళాయి.. కరెంటు కనెక్షన్లను కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వసూళ్లకు దిగడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో నగర, పట్టణ ప్రజలకు పన్ను బాధ పీడిస్తోంది. గతేడాదికంటే 15 శాతం అధి కంగా పన్ను విధించిన అధికారులు ఈ నెలాఖరులోపు మొత్తం చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. నోటీసులు ఇవ్వడంతోపాటు ఇంటింటికీ తిరిగి పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని, కుళాయి తదితర అత్యవసర సర్వీసుల కనెక్షన్లను ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు. గతేడాది ఆస్తిపన్ను, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించినవారు, వాటికి అదనంగా పెరిగిన పన్ను చెల్లించాలని కూడా ఒత్తిడి చేస్తున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచే 15 శాతం అదనంగా పెరిగిన పన్నులు అమలులోకి వచ్చినట్టు చెబుతున్నారు. కాకినాడ, పిఠాపురం తదితర ప్రాంతాల్లో పన్నుల వసూళ్ల కోసం జప్తు చేస్తామని బెదిరించడం, ఇళ్లకు తాళాలు వేయడం చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరంలో పన్నుల వసూళ్ల కోసం తొమ్మిది బృందాలను ఏర్పాటుచేయగా, ప్రతీ బృందంలో ఏఈ, ఆర్ఐలతో కూడిన 8 మంది అధికారులు ఉంటారు. వీరుకాకుండా 95 మంది వార్డు సెక్రటరీలు కూడా పన్నులు వసూలు చేసే పనిలోనే ఉంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ సెక్షన్ అంతా ఖాళీగా ఉంటోంది. అధికారులంతా పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. హెచ్చరిక బోర్డులు పెట్టడంతోపాటు ఒక జప్తు వాహనం కూడా సిటీలో తిప్పుతున్నారు. ప్రజలపై అన్ని విధాలా ఒత్తిడులు పెంచుతూ, భయపెడుతూ లక్ష్యాన్ని చేరుకునే పనిలో ఉన్నారు.
గొల్లప్రోలు టాప్.. రామచంద్రపురం డల్..
వసూళ్లపరంగా చూస్తే ఇప్పటివరకు గొల్లప్రోలు నగర పంచాయతీ 81.40 శాతం లక్ష్యం సాధించగా, చివరిన రామచంద్రపురం మునిసిపాలిటీ 33.10 శాతంతో వెనకబడి ఉంది. జిల్లాలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలన్నీ కలుపుకుని 41.28 శాతం పన్నులు వసూలయ్యాయి.
డిమాండ్ ఘనం.. వసూళ్లు సగం...
జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు అమలాపురం, మండపేట, తుని, రామచంద్రపురం, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం మున్సిపాల్టీలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో 2021-22 ఆస్తి డిమాండు రూ.255 కోట్ల 76 లక్షల 22 వేలు ఉండగా, అందులో మార్చి 24వ తేదీ వరకూ రూ.105 కోట్ల 57 లక్షల 22 వేలు వసూలు చేశారు. అయినా ఇది 41.28 శాతం మాత్రమే. వారం రోజులు కూడా లేకపోవడంతో అన్ని వైపుల నుంచి ప్రజలపై ఒత్తిడిలు పెంచారు.