పరిశ్రమలపై పన్నుల కొరడా..

ABN , First Publish Date - 2021-06-20T05:51:27+05:30 IST

రామగుండం నగరపాలక సంస్థ మొదటిసారిగా పరిశ్రమలపై పన్ను కొరడగా ఝుళిపించింది.

పరిశ్రమలపై పన్నుల కొరడా..
రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం

- రూ.4కోట్ల ఆస్తి పన్ను పెంచిన రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌

- సెక్షన్‌ 103 ప్రయోగం.. ఐదున్నరేళ్ల బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు

- దారికి వచ్చిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్‌టీపీసీ.. రూ.3.47కోట్ల చెల్లింపులు

- పేచీ పెడుతున్న సింగరేణి.. భూములు ఇస్తున్నామంటూ కుంటి సాకులు

కోల్‌సిటీ, జూన్‌ 19: రామగుండం నగరపాలక సంస్థ మొదటిసారిగా పరిశ్రమలపై పన్ను కొరడగా ఝుళిపించింది. కార్పొరేషన్‌ అనుమతులు లేకుండానే ఇన్నాళ్లు జబర్దస్తీగా నిర్మాణాలు చేసిన పరిశ్రమపై నూతన మున్సిపల్‌ చట్టాన్ని ప్రయోగించింది. పన్నులు సవరించి రెట్టింపు పన్నులు వేసింది. సవరించిన పన్నులు ఐదున్నరేళ్ల బకాయిలు చెల్లించాలంటూ తాకీదులిచ్చింది. ప్రతి విషయంలో మెలికలు పెట్టే ఎన్‌టీపీసీ, మరో ప్రభుత్వరంగ సంస్థ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ దారికొచ్చాయి. పెరిగిన పన్నులను ఎర్లిబర్డ్‌ ఆఫర్‌లో 5శాతం తగ్గింపుతో రూ.3.47కోట్లు చెల్లించాయి. నగరపాలక సంస్థలో సగభాగం ఉన్న సింగరేణి మాత్రం సవరించిన పన్నులు చెల్లించకుండా కుంటి సాకులు చెబుతోంది. తమకు మినహాయింపులు కావాలంటూ లేఖలపై లేఖలు పెడుతోంది. పరిశ్రమల నుంచి రామగుండం నగరపాలక సంస్థ జబర్దస్తీగా పన్నులు వసూలు చేస్తుండడంతో కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్‌కు రూ.4కోట్లు పెరగనున్నాయి.

నాలుగు సంస్థలపై రూ.4కోట్ల అదనపు పన్ను

రామగుండం నగరపాలక సంస్థలో సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, జెన్‌కో సంస్థలు ఉన్నాయి. రామగుండం పట్టణం మొదలు యైుటింక్లయికాలనీ వరకు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల నివాసాలకు సంబంధించిన క్వార్టర్లు ఉన్నాయి. సింగరేణికి సంబంధించి ఆర్‌జీ-1లో 6367, ఆర్‌జీ-2లో 2453, ఆర్‌జీ-3లో 26, ఎన్‌టీపీసీ 2731, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ 231, జెన్‌కో 740క్వార్టర్లు ఉన్నాయి. మొత్తంగా 12548క్వార్టర్లు ఉన్నాయి. ఇందులో సింగరేణికి సంబంధించి 8846క్వార్టర్లకు ఇప్పటివరకు ఏటా రూ.1.25కోట్ల ఆస్తిపన్ను విధిస్తున్నారు. ఎన్‌టీపీసీ రూ.99.98లక్షలు, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ రూ.9.88లక్షలు, జెన్‌కో రూ.24.52లక్షలు పన్నులు చెల్లిస్తూ వస్తున్నాయి. ఈ పరిశ్రమలు ఇప్పటివరకు టౌన్‌షిప్‌ల మెయింటనెన్స్‌ పేర 30 శాతం నుంచి 50శాతం మేర రాయితీలు పొందాయి. పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాల నిర్వహణ, తాగునీరు కింద ఈ మినహాయింపు లభించింది. పరిశ్రమలు, టౌన్‌షిప్‌లలో కార్పొరేషన్‌ అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా పరిశ్రమ నిర్మాణాలు చేశాయి. ఈ నిర్మాణాలు కార్పొరేషన్‌ రికార్డుల్లోకి రాలేదు. మొత్తంగా ఇప్పటివరకు ప్రతి ఏటా రూ.2.59కోట్లు పరిశ్రమలు ఆస్తి పన్నులు చెల్లిస్తున్నాయి. కమిషనర్‌ ఉదయ్‌ కుమార్‌ పరిశ్రమల ఆస్తి పన్నుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆస్తి పన్నులో మినహాయింపులు అవసరం లేదని, తాము సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని, పూర్తిస్థాయి పన్నులు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. రూ.2.59కోట్లు ఉన్న డిమాండ్‌ను రూ.6.79కోట్లకు పెంచారు. రూ.4కోట్లు అదనంగా చెల్లించాలంటూ కార్పొరేషన్‌ నోటీసులు ఇచ్చింది.

నూతన మున్సిపల్‌ చట్టం 103ప్రయోగం...

తెలంగాణ మున్సిపల్‌ చట్టం 2019 సెక్షన్‌ 103ను పరిశ్రమలపై నగరపాలక సంస్థ ప్రయోగించింది. పవర్‌ టు కరెక్ట్‌ ది అసెస్‌మెంట్‌ రెవెన్యూ నిబంధనలను అమలుచేసింది. ఈ నిబంధనల ప్రకారం అసెస్‌మెంట్‌, రీఅసెస్‌మెంట్‌, కరెక్షన్స్‌ కమిషనర్‌ దృష్టికి వచ్చిన వాటిని ఐదున్నరేళ్లకు ఎక్కువ కాకుండా పెంపు కానీ, తగ్గింపునకు గానీ అవకాశం ఉంటుంది. దీనినే రామగుండంలో ఈ నాలుగు పరిశ్రమలపై ప్రయోగించారు. ఏటా పన్నులు రూ.4కోట్లు అదనంగా పెంచారు. బకాయిలతో రూ.13.24కోట్లు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. 

చెత్త సేకరణ యూజర్‌ చార్జీలే రూ.60.23లక్షలు

రామగుండం నగరపాలక సంస్థ పరిశ్రమలకు సంబంధించి క్వార్టర్ల నుంచి ఇంటింటా చెత్త సేకరణఖు రూ.60.23లక్షల యూజర్‌ చార్జీలు వేసింది. ఒక్కో క్వార్టర్‌కు నెలకు రూ.40చోప్పున ఏటా రూ.480 చెల్లించాలంటూ పేర్కొంది.

తిరకాసు పెడుతున్న సింగరేణి

పెంచిన పన్నులు చెల్లించే విషయంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్‌టీపీసీలు దారికి వచ్చాయి. మూతపడిన ఎఫ్‌సీఐ స్థానంలో పునరుద్ధరించబడిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు రెండేళ్ల బకాయిలు మాత్రమే వేశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఆస్తి పన్ను డిమాండ్‌ రూ.9.8లక్షక్షల నుంచి రూ.1.3కోట్లకు పెరిగింది. రెండేళ్ల బకాయిలతో రూ.2.5కోట్లు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సంస్థ ఇందుకు సానుకూలత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ముందస్తు పన్ను చెల్లింపునకు 5శాతం రాయితీ(ఎర్లి బర్డ్‌ ఆఫర్‌) వినియోగించుకుంది. రూ.1.26కోట్లు చెల్లించింది. ఎన్‌టీపీసీ సంస్థ రూ.99.98లక్షల ఆస్తి పన్ను డిమాండ్‌ను రూ.2.32కోట్లకు పెంచింది. బకాయిలతో రూ.6.8కోట్లు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థ కూడా ఎర్లి బర్డ్‌ ఆఫర్‌లో 5శాతం రాయితీతో రూ.2.21కోట్లు చెల్లించింది. ఇక సింగరేణి మాత్రం పెరిగిన పన్నులు చెల్లించకుండా తిరకాసు పెడుతోంది. సింగరేణి సంస్థ ఆస్తి పన్ను డిమాండ్‌ రూ.1.25కోట్ల నుంచి రూ.2.55కోట్లకు పెంచారు. ఏరియర్స్‌తో రూ.6.83కోట్లు చెల్లించాల్సి ఉంది. తాము కార్పొరేషన్‌ కార్యాలయానికి, జూనియర్‌ డిగ్రీ కళాశాలలకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు భూములు ఇచ్చామని, ఫైవింక్లయిన్‌ సెంటర్‌ డెవలప్‌ చేశామని, తమ కాలనీల్లో తామే పారిశుధ్యం, వీధి దీపాలు, ఇతర నిర్వహణ చేస్తున్నందున తమ పన్నులు పెంచవద్దంటూ లేఖలు పెడుతోంది. కార్పొరేషన్‌ మాత్రం ప్రభుత్వ నిర్వహణలోని సింగరేణి సంస్థ ప్రభుత్వానికి భూములు ఇస్తుందని, సీఎస్‌ఆర్‌ కింద పెద్దగా నిధులు వెచ్చించడం లేదని, కార్పొరేషన్‌కు పెంచిన పన్నులు చెల్లించాలంటూ తెగేసి చెబుతోంది. 

వేతనాల భారంలో రిలీఫ్‌

కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ పరిశ్రమలపై పన్నులు పెంచి అదనపు పన్ను రాబట్టడం కార్పొరేషన్‌ ఖజానాకు కొంత దన్నుగా ఉంది. పీఆర్‌సీతో ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనం 30శాతం పెరగడం, రిక్షా కార్మికులకు ఔట్‌సోర్సింగ్‌లో అవకాశం ఇవ్వడంతో వేతనాల భారం పెరిగింది. ఈ పరిస్థితుల్లో అదనపు పన్నులతో పరిశ్రమల నుంచి రూ.4కోట్లు వచ్చే అవకాశం ఉండడం రిలీఫ్‌గా మారింది. 

Updated Date - 2021-06-20T05:51:27+05:30 IST