గుదిబండగా పన్నుల బకాయిలు

ABN , First Publish Date - 2020-12-04T03:46:46+05:30 IST

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో పన్ను బకాయిలు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

గుదిబండగా పన్నుల బకాయిలు
పన్ను వసూలు చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది(ఫైల్‌)

-వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌

-కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు  

-బడా బకాయిలపై ప్రత్యేక నివేదిక

కాగజ్‌నగర్‌, డిసెంబరు3: కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో పన్ను బకాయిలు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీఎం మిల్లు నుంచి రూ.15.02 కోట్లు, సర్‌సిల్క్‌ నుంచి రూ.5కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటితో పాటు ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను వసూలుపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఈమేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు డిమాండ్‌ నోటీసులను పంపించారు. వాస్తవంగా రూ.1.46కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇందులో ఇప్పటికే రూ.70లక్షల వసూలైంది. ఇక బడా బకాయిల విష యంలో దృష్టి సారిస్తున్నారు. 


ఎస్పీఎం, సర్‌సిల్క్‌ బకాయిలపై నజర్‌

పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌మిల్లు, సర్‌సిల్క్‌ మిల్లు నుంచి రావాల్సిన ఆస్తి పన్ను వసూలు విషయంలో వాకబు చేస్తున్నారు. ఈ బకాయిల కోసం మున్సిపల్‌ అధికారులు సమగ్ర స్థాయిలో లెక్కలు తీసి అధికారికంగా సంబంధిత మిల్లు సంబందీకులకు నోటీసులను జారీ చేశారు. ప్రధానంగా మిల్లు నడుస్తున్న సమయంలో మిల్లు క్వార్టర్లు, పరిసర ప్రాంతాలను తమ కార్మికులతోనే పరిశుభ్రం చేయించుకుంటున్నామని మున్సిపల్‌ కార్యాలయంతో ఎలాంటి పనులు తీసుకోవడం లేదనే సాకుతో ఆస్తి పన్ను బకాయిలు నిలుపుదల చేసింది. అయితే ఈ బకాయిల విషయంలో 2000 సంవత్సరంలో అప్పటి కమిషనర్‌ లింబాద్రితో పాటు పలువురు అధికారులు నేరుగా ఎస్పీఎం  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీటుతో పాటు వివిధ పరికరాలను జప్తు చేశారు. తిరిగి బకాయిల విషయంలో చెల్లింపులు చేయాలని మళ్లీ మున్సిపల్‌ అధికారులు రిమైండ్‌ నోటీసులను పంపించారు. దీంతో యాజ మాన్యం రూ.10లక్షలను కట్టింది. అంతేకాకుండా మిగతా బకాయిల విషయంలో తదుపరి నోటీసులను మున్సిపల్‌ అధికారులు జారీ చేశారు. ఈ నోటీసుల ఆధారంగా ఎస్పీఎం బిర్లా యాజమాన్యం నేరుగా హైకోర్టులో కేసు వేసింది. దీంతో కోర్టు పరిఽధిలోకి పోవడంతో బకాయిల చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా పెండింగ్‌లోకి వచ్చింది. 

1999 నుంచి 2019 వరకు కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి రూ.15.02 కోట్లు మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. బకాయిలు వసూలు విషయంలో మున్సిపల్‌ అధికారులు గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎస్పీఎం బిర్లా యాజమాన్యం స్పందించ లేదు. ఈ నోటీసుల ఆధారంగా హైకోర్టులో 2002లో  మున్సిపల్‌ కార్యాలయంపై కేసు కూడా వేసింది. ప్రస్తుతం మిల్లు ఆస్తులన్నీ కూడా ఐడీబీఐ బ్యాంకు పరిఽధిలోకి వెళ్లటంతో ప్రత్యామ్నాయంగా మున్సిపల్‌ అధికారులు ఆస్తిపన్ను వివరాలతో కూడిన జాబితాను ఐడీబీఐ అధికారులకు సమగ్ర స్థాయిలో వివరాలను పంపించారు. కాగా నూతనంగా వచ్చిన జెకె యాజమాన్యం తమకు బిల్లులో రాయితీ కల్పిం చాలని హైకోర్టులో కేసు వేసింది. ఈ విషయంలో మున్సిపల్‌ అధికారులు కూడా స్వయంగా ప్రత్యేక కౌంటర్‌ వేశారు. మున్సిపాలిటీకి నాలుగు దఫాలుగా రూ.19లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. దీంతో మూడు దఫాలు చెల్లించింది. ఇంకా కేవలం రూ.19లక్షలు చెల్లింపులు చేయాల్సి ఉంది.  


సర్‌సిల్క్‌ మిల్లు బకాయిలు రూ.5కోట్లు

అలాగే సర్‌సిల్క్‌ మిల్లు నుంచి కూడా రూ.5 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఈ ప్రక్రియలో అధికారులు సర్‌సిల్క్‌ మిల్లు లిక్విడేటర్‌కు కలిసి సమస్యను వివరించారు. ఆస్తుల అమ్మకాల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో సర్‌సిల్క్‌ మిల్లు డబ్బు వసూలు ప్రక్రియ తాత్కాలికంగా పెండింగ్‌లో పడినట్లయింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు డిమాండు నోటీసు పంపించారు. ఇవీ కూడా రూ.5 లక్షల మేర ఉన్నాయి. వీటి విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

బకాయిలపై నివేదిక రూపొందించాం

-శ్రీనివాస్‌, కమిషనర్‌, కాగజ్‌నగర్‌

బడా బకాయిల విషయంలో ప్రత్యేక నివేదికలను రూపొందిస్తున్నాం. సర్‌సిల్క్‌ మిల్లు రూ.5కోట్లు, ఎస్పీఎం మిల్లు నుంచి రూ.15.02 కోట్ల బకాయిలు ఉన్నట్టు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. తదుపరి చర్యల కోసం వేచి చూస్తున్నాం.


Updated Date - 2020-12-04T03:46:46+05:30 IST