అలా అయితే పెట్రోలుపై పన్నులు మరింత తగ్గుతాయి : నితిన్ గడ్కరీ

ABN , First Publish Date - 2021-11-11T21:11:29+05:30 IST

దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి

అలా అయితే పెట్రోలుపై పన్నులు మరింత తగ్గుతాయి : నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి పెట్రోలు, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొస్తే, వాటిపై పన్నులు మరింత తగ్గుతాయని, కేంద్ర, రాష్ట్రాలు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని పొందుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తారని తెలిపారు. ఓ జాతీయ మీడియా ఛానల్ గురువారం నిర్వహించిన వర్చువల్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


జీఎస్‌టీ కౌన్సిల్‌లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులని నితిన్ గడ్కరీ చెప్పారు. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే, వీటిపై పన్నులు తగ్గుతాయని, కేంద్ర, రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. 


సెప్టెంబరులో జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కేరళ హైకోర్టు సూచనల మేరకు పెట్రోలు, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తేవడంపై చర్చించారు. కానీ కొన్ని రాష్ట్రాలు దీనికి వ్యతిరేకత వ్యక్తం చేయడంతో, వీటిని ఈ పన్ను పరిధిలోకి తీసుకురాకూడదని నిర్ణయించారు. కేరళ హైకోర్టు కోరినందువల్లే ఈ అంశంపై చర్చించామని నిర్మల సీతారామన్ తెలిపారు. జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావడానికి ఇది సరైన సమయం కాదని భావించినట్లు తెలిపారు. 


Updated Date - 2021-11-11T21:11:29+05:30 IST