ప్రపంచ ఐటీ బ్రాండ్లలో టీసీఎస్‌@ టాప్‌ 2

ABN , First Publish Date - 2022-01-27T07:23:37+05:30 IST

ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్లలో టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్‌) రెండో స్థానంలో నిలిచింది.

ప్రపంచ ఐటీ బ్రాండ్లలో టీసీఎస్‌@ టాప్‌ 2

మూడో స్థానంలో ఇన్ఫోసిస్‌ 

టాప్‌-25లో ఆరు భారత్‌వే  

బ్రాండ్‌ ఫైనాన్స్‌ నివేదిక వెల్లడి 


న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్లలో టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్‌) రెండో స్థానంలో నిలిచింది. మరో  దేశీయ ఐటీ దిగ్గ జం ఇన్ఫోసిస్‌ మూడో స్థానాన్ని దక్కించుకుంది. మరో నాలుగు భారత ఐటీ కంపెనీలకు టాప్‌-25లో స్థానం లభించింది. విప్రో 7, హెచ్‌సీఎల్‌ 8, టెక్‌ మహీంద్రా 15, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ 22వ స్థానంలో నిలిచాయి. అంతేకాదు, ఈ ఆరు భారత కంపెనీలు 2020-22 కాలానికి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న 10 ఐటీ బ్రాండ్ల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాయి.


బ్రాండ్‌ ఫైనాన్స్‌ ‘ఐటీ సర్వీసెస్‌ 25’ నివేదిక ముఖ్యాంశాలు.. 

ప్రపంచంలో అత్యంత విలువైన, బలమైన ఐటీ సేవల బ్రాండ్‌గా యాక్సెంచర్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. యాక్సెంచర్‌ బ్రాండ్‌ విలువ 3,620 కోట్ల డాలర్లు. 

2020-22 మధ్యలో భారత ఐటీ బ్రాండ్ల విలువ సరాసరి వృద్ధి 51 శాతంగా నమోదైంది. ఇదే కాలంలో అమెరికన్‌ ఐటీ బ్రాండ్ల విలువ 7 శాతం తగ్గింది. 

గత ఏడాది మూడో స్థానంలో నిలిచిన టీసీఎస్‌ ఈసారి రెండో స్థానానికి ఎగబాకింది. గడిచిన ఏడాదికాలంలో టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ 12 శాతం పెరిగి 1,680 కోట్ల డాలర్లకు చేరుకుంది. 2020 నుంచి విలువ 24 శాతం వృద్ధి చెందింది. 

గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన అమెరికన్‌ ఐటీ దిగ్గజం ఐబీఎం.. ఈసారి నాలుగో స్థానానికి జారుకుంది.

ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ సేవల బ్రాండ్‌గా ఇన్ఫోసిస్‌ ఘనత దక్కించుకుంది. గత ఏడాది నుంచి కంపెనీ బ్రాండ్‌ విలువ 52 శాతం పుంజుకోగా.. 2020 నుంచి 80 శాతం ఎగబాకి 1,280 కోట్ల డాలర్లకు చేరుకుంది. 

ఈ ఏడాదికి విప్రో బ్రాండ్‌ విలువ 630 కోట్ల డాలర్లుగా నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే 48 శాతం పెరిగింది. 

హెచ్‌సీఎల్‌ బ్రాండ్‌ విలువ గడిచిన ఏడాది కాలంలో 10 శాతం వృద్ధి చెంది 610 కోట్ల డాలర్లకు చేరుకుంది. 

టెక్‌ మహీంద్రా బ్రాండ్‌ విలువ గడిచిన రెండేళ్లలో 45 శాతం పెరిగి 300 కోట్ల డాలర్లకు చేరుకుంది. 


ప్రపంచ టాప్‌ బ్రాండ్‌ యాపిల్‌  

ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా ఐఫోన్‌ తయారీ దిగ్గజం యాపిల్‌ తన స్థానాన్ని పదిలపర్చుకుంది. యాపిల్‌ బ్రాండ్‌ విలువ 35,500 కోట్ల డాలర్లకు పెరిగిందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ నివేదిక వెల్లడించింది. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, వాల్‌మార్ట్‌ వరుసగా టాప్‌-5లో నిలిచాయి. సామ్‌సంగ్‌, ఫేస్‌బుక్‌, ఐసీబీసీ, హువే, వెరిజాన్‌ టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా టిక్‌టాక్‌ నిలిచింది. గడిచిన ఏడాదికాలంలో టిక్‌టాక్‌ బ్రాండ్‌ విలువ 251 శాతం పెరిగింది. వీచాట్‌ వరుసగా రెండో ఏడాదీ ప్రపంచంలో అత్యంత బలమైన బ్రాండ్‌గా కొనసాగుతోంది.


అత్యుత్తమ బ్రాండ్‌ సంరక్షకుడు సత్య నాదెళ్ల 

మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌, సీఈఓ సత్య నాదెళ్ల ప్రపంచ అత్యుత్తమ బ్రాండ్‌ సంరక్షకుడిగా నిలిచారు. ‘బ్రాండ్‌ సంరక్షకుల సూచీ’ పేరుతో బ్రాండ్‌ఫైనాన్స్‌ ప్రపంచ టాప్‌ 250 సీఈఓలతో ఓ జాబితాను రూపొందించింది. వీరి సారథ్యంలో జరిగిన వ్యాపార, బ్రాండ్‌ విలువ వృద్ధి ఆధారంగా ర్యాంకింగ్‌లు కేటాయించింది. 88.3 పాయింట్ల స్కోరుతో తెలుగు వ్యక్తి నాదెళ్ల అగ్రస్థానం దక్కించుకోగా 83.3 స్కోరుతో గూగుల్‌ సారథి సుందర్‌ పిచాయ్‌ ఐదో స్థానంలో, మరో భారతీయుడు శాంతను నారాయణ్‌ (అడోబ్‌ సీఈఓ) 82.5 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ 75.5 పాయింట్లతో 25వ స్థానంలో ఉన్నారు. ఆనంద్‌ మహీంద్రా 41, ముకేశ్‌ అంబానీ 42, హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌ 90వ స్థానంలో నిలిచారు. 


ప్రపంచ టాప్‌-500లోని భారత బ్రాండ్లు

కంపెనీ ర్యాంకింగ్‌ 

టాటా 78

ఇన్ఫోసిస్‌   158

ఎల్‌ఐసీ   179

రిలయన్స్‌   236

ఎయిర్‌టెల్‌   269

ఎస్‌బీఐ   279

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 319

విప్రో 350

మహీంద్రా గ్రూప్‌ 364

హెచ్‌సీఎల్‌ 369

ఎల్‌ అండ్‌ టీ 417

ఇండియన్‌ ఆయిల్‌ 448

రిలయన్స్‌ జియో 451

Updated Date - 2022-01-27T07:23:37+05:30 IST