టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షులు ఎవరు..?

ABN , First Publish Date - 2020-09-26T18:58:17+05:30 IST

టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షులు ఎవరు..?

టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షులు ఎవరు..?

రాజంపేటకు జిల్లా అధ్యక్షుడు వాసు

కడపకు పరిశీలనలో ఇద్దరి పేర్లు

సీనియర్లతో జిల్లా సమన్వయ కమిటీ

కసరత్తు చేస్తున్న అధినేత చంద్రబాబు నాయుడు

రేపు అధికారిక ప్రకటన


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో టీడీపీ బలోపేతానికి అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందినా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ విధానాలపై తెలుగుదేశం పోరాటం చేస్తూనే ఉంది. అదే క్రమంలో పార్టీతో పాటుగా అనుబంధ విభాగాలను ప్రక్షాళన చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. పార్టీ శ్రేణులకు చేరువగా ఉంటూ పోరుబాట పట్టించే లక్ష్యంగా కమిటీ కూర్పు చేస్తున్నారు. తొలిసారిగా పార్లమెంట్‌ నియోజకర్గం స్థాయి అధ్యక్షుడిని, సీనియర్లతో జిల్లా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ  జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్లమెంట్‌ స్థాయి అధ్యక్షులు, జిల్లా సమన్వయ కమిటీ, అనుబంధ సంఘాల కూర్పు ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.


కడప పార్లమెంట్‌ అధ్యక్ష రేసులో ఇద్దరు

కడప పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తున్నాయి. పార్టీ సీనియర్‌ నాయకులు మెజార్టీగా ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నారు. ముఖ్యంగా సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం ఈ లోక్‌సభ స్థానం పరిధిలో వస్తుంది. సీనియర్లను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ విధానాలపై పోరాటం, పార్టీ శ్రేణులకు అండగా ఉండే నాయకుడిని ఎన్నుకునే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కమలాపురం ఇన్‌చారి,్జ మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, మైదుకూరు ఇన్‌చార్జి, టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నా.. వారు అనాసక్తి చూపినట్లు సమాచారం. ఎమ్మెల్సీ బీటెక్‌ ఆశించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర నాయకత్వం బీటెక్‌ రవితో చర్చించినట్లు సమాచారం. సీఎం వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో పార్టీ బలోపేతం కావాలంటే అక్కడ బీటెక్‌ రవిని ఇన్‌చార్జిగా నియమించి కడప పార్లమెంట్‌ అధ్యక్షుడిగా మరొకరికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో అధినేత ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డిని నియమించే అవకాశాలు లేకపోలేదు. ప్రొద్దుటూరు ఇన్‌చార్జిగా లింగారెడ్డిని తప్పించి జీవీ ప్రవీణ్‌రెడ్డిని ఇప్పటికే నియమించారు. దీంతో లింగారెడ్డిని పార్లమెంట్‌ అధ్యక్షుడిగా చేస్తే అక్కడ సమస్య ఉండదని, గతంలో జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేసిన అనుభవం ఉండడంతో సీనియర్లను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తాడని అధిష్టానం లింగారెడ్డి వైపు మొగ్గు చూపినట్లు విశ్వసనీయ సమాచారం.


రాజంపేట అధ్యక్షుడిగా వాసు

రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో కడప జిల్లాకు చెందిన రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి అసెంబ్లీ స్థానాలు, చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. మెజార్టీగా నాలుగు అసెంబ్లీ స్థానాలు చిత్తూరు జిల్లావే. దీంతో రెండు జిల్లాలకు చెందిన నాయకులు పార్లమెంట్‌ స్థాయి పార్టీ అధ్యక్ష పీఠం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుత కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి (వాసు)ని దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. 2014 ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఆయనే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎన్నికల తరువాత అధినేత చంద్రబాబు మూడు రోజుల జిల్లా పర్యటనకు వస్తే దగ్గరుండి విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన రాష్ట్ర పార్టీలో స్థానం ఆశించినట్లు తెలిసింది. ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం రాయచోటి రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఉండడం, రాబోయే 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంగా వాసును ఖరారు చేసినట్లు తెలిసింది. అదే విధంగా చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లె నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌, పీలేరు ఇన్‌చార్జి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి (మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడు) కూడా పార్టీ అధ్యక్ష పీఠం ఆశించినట్లు సమాచారం. అయినప్పటికీ వాసువైపు చంద్రబాబు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అదే క్రమంలో కడప, రాజంపేట లోక్‌సభ స్థానాల పరిధిలోని సీనియర్‌ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, బద్వేలు మాజీ ఎమ్మెల్యే కె.విజయమ్మ, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయుడు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమే్‌షరెడ్డి, కడప ఇన్‌చార్జి అమీర్‌బాబు తదితర నాయకులతో జిల్లా సమన్వయ కమిటీని నియమించే అవకాశం ఉందని సమాచారం. రేపు పార్లమెంట్‌ అధ్యక్షులు, జిల్లా సమన్వయ కమిటీని అధినేత ప్రకటించనుండడంతో వారెవరనే చర్చ పార్టీ కార్యకర్తల్లో ఆసక్తి రేపుతోంది..


Updated Date - 2020-09-26T18:58:17+05:30 IST