అధినేత నిర్బంధంపై ఆగ్రహం

ABN , First Publish Date - 2021-03-02T06:04:38+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలను పాతిపెట్టే విధంగా ఉందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.

అధినేత నిర్బంధంపై ఆగ్రహం
నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు

రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు

చంద్రబాబుపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళలు

రేణిగుంట ఘటనపై నిరసన వెల్లువ

 

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, మార్చి 1: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలను పాతిపెట్టే విధంగా ఉందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిని పోలీసులు నిర్బంధించిన ఘటనకు నిరసనగా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్‌, గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌, పశ్చిమ ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్రల నేతృత్వంలో నిరసన ప్రదర్మన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గల్లా మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబును చూసి ప్రభుత్వం భయపడుతోందని తెనాలి శ్రావణ్‌ కుమార్‌ అన్నారు.  చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ శ్రేణులు జాతీయ పట్టణంలోని రహదారిపై ఇండియన్‌ బ్యాంకు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరాటంతో పాలకుల అసమర్ధత ఎక్కడ బయటపడుతోందనే భయంతోనే నిర్బంధించారని నేతలు ఆరోపించారు. వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. 40ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర చంద్రబాబునాయుడుకు ఉందని, ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న ఆయన పర్యటనను ఏ విధంగా అడ్డుకుంటారని జీవీ ప్రశ్నించారు. తుళ్ళూరు లైబ్రరీ సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుందని, ఓటమి భయంతోనే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనను అడ్డుకుంటుందని తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్‌సర్కిల్‌లో పార్టీశ్రేణులతో కలిసి తెలుగుదేశంపార్టీ ఇన్‌చార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడుపై పోలీసులు జులుం ప్రదర్శించి అక్రమ నిర్బంధం చేయటం అప్రజాస్వామికమన్నారు.  

Updated Date - 2021-03-02T06:04:38+05:30 IST