‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంపై చంద్రబాబు రివ్యూ

ABN , First Publish Date - 2022-04-09T17:46:48+05:30 IST

తెలుగు దేశం పిలుపునిచ్చిన ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రివ్యూ చేపట్టారు.

‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంపై చంద్రబాబు రివ్యూ

అమరావతి: తెలుగు దేశం పిలుపునిచ్చిన ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంపై  ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రివ్యూ చేపట్టారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం జరుగుతున్న తీరుపై శనివారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి క్యాండిల్, అగ్గిపెట్టె, బాదుడే బాదుడు కరపత్రాలను  క్యాడర్ పంపిణీ చేస్తోంది. ప్రతి కార్యకర్త, ప్రతి నేతా కార్యక్రమంలో పాల్గొనాలని అధిష్టానం ఆదేశించింది.  అలాగే పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు  పాల్గొననున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రతి ఇంచార్జ్ సీరియస్‌గా తీసుకోవాలని... ఎవరికీ మినహాయింపులు లేవని టీడీపీ అధినేత స్పష్టం చేశారు.


క్షేత్ర స్థాయికి వెళ్లని నేతలను మార్చేందుకు కూడా వెనుకాడేది లేదని తెలిపారు. ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని కార్యక్రమంపై జరిపిన సమీక్షలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. విద్యుత్ కోతలు, పెరిగిన కరెంట్ చార్జీలపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బాబు తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలతో కార్మికుల ఉపాధి పోతోందన్నారు. పంటలకు నీరందక రైతులు మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతారని అన్నారు. గ్రామాల్లో కరెంట్ పీకుతున్న జగన్‌ను... సీఎం పదవి నుంచి పీకేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-04-09T17:46:48+05:30 IST