85 శాతం వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఖరారు

ABN , First Publish Date - 2021-03-01T06:03:56+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల సోమవారానికి వాయిదా పడింది.

85 శాతం వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఖరారు
నగర టీడీపీ కార్యాలయంలో సమావేశమైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, ప్రధాన కార్యదర్శి, నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాసరావు, బుద్ద నాగజగదీశ్‌, దువ్వారపు, బండారు, తదితరులు

నగర కార్యాలయానికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రధాన కార్యదర్శి నిమ్మల 

ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జిలు, సీనియర్‌ నేతలతో చర్చలు

భీమిలి, పెందుర్తి, పశ్చిమ, తూర్పులోని అన్ని వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి

49వ వార్డులో బలమైన ఇండిపెండెంట్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం

టీడీపీ కార్యాలయానికి సీపీఐ, సీపీఎం నేతలు

అచ్చెన్నాయుడుతో సమావేశం

వామపక్షాలకు చెరో వార్డు... మరొకటి అడుగుతున్న సీపీఎం

నేడు ‘దేశం’ జాబితా విడుదల


విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల సోమవారానికి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకు ఆదివారం జాబితా విడుదల చేయాల్సి ఉంది. దీంతో ఆశావహులు, వార్డు నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి వచ్చారు. అభ్యర్థుల ఖరారుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చి, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, బుద్ద నాగజగదీశ్‌, ఇన్‌చార్జిలు బండారు సత్యనారాయణమూర్తి, చిక్కాల విజయ్‌, విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సమావేశమై చర్చించారు. మొత్తం అన్ని వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసిన తరువాతే జాబితాను విడుదల చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. ఇప్పటి వరకు 85 శాతం వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిసింది. భీమిలి, పెందుర్తి, విశాఖ పశ్చిమ, విశాఖ తూర్పు పరిధిలోని అన్ని వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్టు చెబుతున్నారు. గాజువాక అసెంబ్లీ పరిధిలో వామపక్షాలకు రెండు వార్డుల కేటాయింపుపై ఇంకా స్పష్టత రాలేదు. ఉక్కు నగరం ప్రాంతానికి సంబంధించి 78వ వార్డును సీపీఎంకు కేటాయించాలని ప్రతిపాదించారు. అయితే టీఎన్‌టీయూసీ నాయకులు కోగంటి లెనిన్‌ సతీమణి, విళ్లా రామ్మోహన్‌ కుమార్‌ కుమారుడు నామినేషన్‌ దాఖలు చేశారు. టీఎన్‌టీయూసీకి ఒక వార్డు కేటాయించాలని పార్టీలో ఉన్నతస్థాయిలో ఆలోచన చేస్తున్నారు. దీనిపై సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీపీఐకి సీట్ల కేటాయింపుపై ఆ పార్టీ నేతలు జేవీ సత్యనారాయణమూర్తి, పైడిరాజు ఆదివారం టీడీపీ కార్యాలయానికి వచ్చి అచ్చెన్నాయుడుతో సమావేశమయ్యారు. గాజువాక ప్రాంతంలోని 72వ వార్డును ఏజె స్టాలిన్‌కు కేటాయించినట్టు పల్లా శ్రీనివాసరావు సూత్రప్రాయంగా  వెల్లడించారు. అయితే విశాఖ తూర్పులో 13వ వార్డు కూడా తమకు ఇవ్వాలని సీపీఐ నేతలు కోరినట్టు తెలిసింది. 

ఇదిలావుండగా విశాఖ ఉత్తరంలో రెండు వార్డుల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎదురైన ఇబ్బందులపై చర్చించారు. 14వ వార్డు నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన బాక్సర్‌ రాజు వైసీపీలో చేరడంతో అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై స్థానిక కేడర్‌ అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ వార్డు నుంచి మేకా సత్యకిరణ్‌, వసంతరావు, హరిత టీడీపీ తరపున నామినేషన్‌ దాఖలుచేశారు. వీరిలో ఎవర్ని ఖరారు చేస్తారన్నది సోమవారం తెలుస్తుంది. 49వ వార్డులో నామినేషన్‌ దాఖలుచేసిన మాజీ కార్పొరేటర్‌ పైల ముత్యాలనాయుడుకి ఓ ప్రధాన పార్టీ నుంచి బెదిరింపులు రావడంతో బరినుంచి తప్పుకోవాలని భావించారు. దీంతో ఇక్కడ ఇండిపెండెంట్‌లలో బలమైన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 49వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా యడ్ల సురేశ్‌, బొడ్డు ఎర్రునాయుడు నామినేషన్లు దాఖలు చేశారు. సురేశ్‌ తండ్రి యడ్ల మరియదాసు, మరికొందరు స్థానికులు ఆదివారం అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులను కలిసి సురేశ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. విశాఖ దక్షిణంలో 36వ వార్డు నుంచి టీడీపీ తరపున నామినేషన్‌ దాఖలుచేసిన ఇమంది సత్యవతి భర్త, పార్టీ నేత రంగారావు కూడా తమ అనుచరులతో వచ్చి నేతలను కలిశారు. ఇదే ప్రాంతంలో 31వ వార్డు నుంచి పోటీచేస్తున్న వానపల్లి రవికుమార్‌, 35వ వార్డు అభ్యర్థి బుచ్చా రామిరెడ్డి, రెబెల్‌ అభ్యర్థి పిల్లి రమణ, తదితరులు కూడా పార్టీ నాయకులను కలిశారు. 


వైసీపీ మలి జాబితా విడుదల

20 వార్డులకు అభ్యర్థులు ఖరారు

విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ తరపున కార్పొరేటర్‌ పదవులకు పోటీచేసే అభ్యర్థుల తుదిజాబితాను ఆ పార్టీ ఆదివారం విడుదల చేసింది. పెందుర్తి నియోజకవర్గం పరిఽధిలోని ఏడు వార్డులు, దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 13 వార్డులు మినహా మిగిలిన 78 వార్డులకు శుక్రవారమే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. పెండింగ్‌లో ఉంచిన వార్డులకు ఆదివారం అభ్యర్థులను ప్రకటించడంతో ఏ వార్డులో ఎవరు పోటీ చేస్తున్నారో  స్పష్టత వచ్చింది. 

పెందుర్తి నియోజకవర్గం

వార్డు పేరు

77 బట్టు సూర్యకుమారి

88 గండ్రెడ్డి కనకమహాలక్ష్మినాయుడు

93 దాసరి అప్పలరాజు

94 ఆదిరెడ్డి మురళీకృష్ణ

95 ముమ్మన దేముడు

96 శరగడం చిన్నఅప్పలనాయుడు

97 గంట్ల వెంకట లీలావతి


దక్షిణ నియోజకవర్గం

27 నీలాపు సర్వేశ్వరరెడ్డి

29 ఉరుకూటి నారాయణరావు

30 పోలిపల్లి జ్యోతి

31 బత్తిన నవీన్‌

32 మూలే రామిరెడ్డి

33 పసిరిపల్లి లక్ష్మి

34 తోట పద్మావతి

35 అలుపున కనకరెడ్డి

36 మసిపోగు మేరీజోన్స్‌

37 చెన్నా జానకిరామ్‌

38 బుద్దలపాటి సత్యరూపవాణి

39 కొల్లి సింహాచలం

41 యండ్రపు ఫాతిమారాణి




Updated Date - 2021-03-01T06:03:56+05:30 IST