టీడీపీ కొవ్వొత్తుల ర్యాలీ భగ్నం

ABN , First Publish Date - 2022-05-23T07:28:11+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ హత్యను, అనుమానాస్పద మృతిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ టీడీపీ చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు.

టీడీపీ కొవ్వొత్తుల ర్యాలీ భగ్నం
మాజీ డిప్యూటీ మేయర్‌ గంపన్నను అరెస్టు చేస్తున్న పోలీసులు

 నాయకుల అరెస్టు 

అనంతపురం  అర్బన, మే 22: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ హత్యను, అనుమానాస్పద మృతిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ టీడీపీ చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం దాకా టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మాజీ డిప్యూటీ  మేయర్‌ గంపన్న, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళీ, జిల్లా ఉపాధ్యక్షుడు డిష్‌ నాగరాజు, అధికార ప్రతినిధి నారాయణస్వామి యాదవ్‌, నగర అధ్యక్షుడు మారుతీకుమార్‌ గౌడ్‌, బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు గోపాల్‌ గౌడ్‌, ఇతర నాయకులు నగర పాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ర్యాలీని ప్రారంభించేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ డిప్యూటీ  మేయర్‌ గంపన్నతోపాటు ఇతర నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి, టూటౌనకు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుతోపాటు మాజీ మేయర్‌ స్వరూప,  టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ యాదవ్‌ తదితరులు టూటౌన పోలీసు స్టేషనకు చేరుకొని నాయకులు, కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం అరెస్టు చేసిన నాయకులు, కార్యకర్తలను విడుదల చేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు విజయశ్రీరెడ్డి, గొర్రెలు, మేకల కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ శివబాల, నాయకులు బొమ్మినేని శివ, పోతుల లక్ష్మినరసింహులు, సరిపూటి శ్రీకాంత, నాగరాజునాయుడు, నారాయణస్వామి, దళవాయి వెంకటరాముడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 



సత్యాన్ని సమాధి చే సే కుట్ర..!

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యను అనుమానాస్పద మృతిగా పోలీసులు చిత్రీకరించి సత్యాన్ని సమాధి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. శనివారం స్థానిక టూటౌన పోలీసు స్టేషన వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో దళితులు, మహిళలు, బీసీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేయడం హేయమన్నారు. తన నాయకులు, కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తే పోలీసుల వద్దసరైన సమాధానం లేదన్నారు. ఏమైనా అంటే 30 పోలీసు యాక్టు అమలులో ఉందంటూ బుకాయిస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో ఏడాది పొడవునా 30 పోలీసు యాక్టు అమలులో ఉండటం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ప్రజాసమస్యలపై చేసే పోరాటాలను పోలీసులతో అణిచివే యడం సరికాదన్నారు.  సుబ్రహ్మణ్యం హత్యకు కారణమైన ఎమ్మెల్సీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. జగనను రాజకీయంగా సమాధి చేసి, వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 



Updated Date - 2022-05-23T07:28:11+05:30 IST