చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నాం: నారాయణరెడ్డి

ABN , First Publish Date - 2021-10-17T21:11:25+05:30 IST

ఈనెల 20న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నామని మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ప్రకటించారు.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నాం: నారాయణరెడ్డి

కడప: ఈనెల 20న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నామని మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ప్రకటించారు. తాను, తన కుమారుడు భూపేశ్‌రెడ్డి టీడీపీ కండువాలు కప్పుకోబోతున్నామని చెప్పారు. జమ్మలమడుగులో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తెస్తామని నారాయణరెడ్డి ప్రకటించారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా దేవగుడి భూపేశ్‌రెడ్డిని ఖరారు చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో దేవగుడి వర్గం, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య సుదీర్ఘకాలంగా ఫ్యాక్షన్‌ నెలకొంది. రామసుబ్బారెడ్డి వర్గం టీడీపీలో ఉండగా దేవగుడి వర్గం మొదట కాంగ్రెస్‌లో.. తర్వాత వైసీపీలో ఉంది. దేవగుడి వర్గం తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలో చేరి మంత్రి అయ్యారు.


రామసుబ్బారెడ్డిని టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీని చేసి విప్‌ పదవి ఇచ్చింది. గత ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా, ఆదినారాయణరెడ్డి ఎంపీగా పోటీ చేశారు. కాని ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోగా... రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ప్రధాన వర్గాలు రెండూ బయటకు వెళ్లిపోవడంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. కాని రెండేళ్లలో ఈ నియోజకవర్గంలో కొత్త పరిణామాలు చోటు చేసుకొన్నాయి. దేవగుడి వర్గంలో చీలిక వచ్చింది. ఆ వర్గంలో ప్రధాన నేత అయిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీ వైపు మొగ్గు చూపారు. జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకొన్న తర్వాత ఆయన కుమారుడు భూపేశ్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.

Updated Date - 2021-10-17T21:11:25+05:30 IST