వైసీపీ నేతల అక్రమాలపై పోరాడండి: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-31T22:39:18+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యేల, నేతల అక్రమాలపై గట్టిగా పోరాడాలని పార్టీ నేతలకు టీడీపీ అధినేత

వైసీపీ నేతల అక్రమాలపై పోరాడండి: చంద్రబాబు

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యేల, నేతల అక్రమాలపై గట్టిగా పోరాడాలని పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం  అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో సమర్థ నేతలను వదులుకునేది లేదన్నారు. అలాగే పనిచెయ్యని వారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. వైసీసీ ఎమ్మెల్యేల అక్రమాలు, నియోజకవర్గ సమస్యలపై స్థానికంగా పోరాటాలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. జగన్ పాలనలో ప్రజలు పేదలయ్యారని, వైసీపీ వాళ్లు ధనికులయ్యారని ఆయన ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి డైయిరీలో లీటర్ పాలకు కేవలం రూ.18 మాత్రమే చెల్లించే పరిస్థితి  ఉందన్నారు. కానీ టీడీపీ నిలదీయడంతో ఫిబ్రవరి నుంచి ధర పెంచి ఇస్తున్నారని ఆయన తెలిపారు. క్యాసినో వ్యవహారంలో బూతుల మంత్రి కొడాలి నాని తీరును ఎండగట్టడంలో పార్టీ నేతలు బాగా పని చేశారని ఆయన వారిని మెచ్చుకున్నారు. మండల, నియోజవర్గ స్థాయిలో వైసీపీ నేతల వసూళ్లు, భూ కబ్జాలపై పెద్దఎత్తున ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియాపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ విద్యుత్ చార్జీల పెంపు, రకరకాల పన్నులతో ప్రజలను పీల్చుకుతినేందుకు సిద్ధం అయ్యారని ఆయన ఆరోపించారు. 


జిల్లాల పునర్విభజన విషయంలో ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి నాటికి తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం జరిగి 40 ఏళ్లు పూర్తి అవుతోందన్నారు. ఈ సందర్భంగా ఘనంగా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మహానాడుతో పాటు, ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణ ఉంటుందన్నారు. ఎన్టీఆర్ పేరుతో టీడీపీ తీసుకువచ్చిన 14 పథకాలను జగన్ ప్రభుత్వం తొలగించి, పేర్లు తీసి వేసిందన్నారు. ఇప్పుడు జిల్లాకు పేరు పెట్టి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. 


Updated Date - 2022-01-31T22:39:18+05:30 IST