అంతులేని దోపిడీ!

ABN , First Publish Date - 2022-01-12T07:54:25+05:30 IST

రాష్ట్రం మొత్తం గనుల దోపిడీ ఆకాశాన్నంటిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గ్రానైట్‌, బాక్సైట్‌, లేటరైట్‌.. అదీ ఇదీ అని లేకుండా దొరికినకాడికి దోచుకుపోతున్నారని దుయ్యబట్టారు. మంగళవారమిక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో...

అంతులేని దోపిడీ!

  • గ్రానైట్‌, బాక్సైట్‌, లేటరైట్‌ అన్నీ స్వాహా
  • కుప్పంలోనే 250 అక్రమ క్వారీలు
  • సిగ్గువదిలి రెచ్చిపోతున్నారు.. 7 లక్షల కోట్లకు చేరిన అప్పులు
  • జగన్‌కు పోయేదేమీ లేదు.. రాష్ట్రమే మునిగిపోతుంది
  • సినిమా టికెట్లు సరే.. సిమెంటూ తగ్గించండి
  • సినిమా వాళ్లంతా టీడీపీయేనా?.. నాకు వ్యతిరేకంగా 
  • సినిమాలు తీయలేదా?.. టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్‌


అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం మొత్తం గనుల దోపిడీ ఆకాశాన్నంటిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గ్రానైట్‌, బాక్సైట్‌, లేటరైట్‌.. అదీ ఇదీ అని లేకుండా దొరికినకాడికి దోచుకుపోతున్నారని దుయ్యబట్టారు. మంగళవారమిక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కుప్పంలో ఏకంగా 250 అక్రమ గ్రానైట్‌ క్వారీలు నడుస్తున్నాయని అన్నారు. ‘అధికార పార్టీ అండతో విచ్చలవిడిగా సంపాదించి అహంకారం తలకెక్కి చిన్న చిన్న రౌడీలు కూడా ఏకంగా నాపైనే బాంబులు వేస్తామని మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎవరైనా అక్రమ క్వారీయింగ్‌ను ఆపాలని అడిగితే వారి ఇళ్లకు కరెంటు కత్తిరిస్తామని.. మరీ మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అక్రమ క్వారీయింగ్‌ లేనే లేదని ఒక మంత్రి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.


ఇదే సర్టిఫికెట్‌ ఇవ్వడానికి మరో మంత్రి విశాఖ నుంచి తిరుపతి వచ్చాడు. పోదాం రా.. ఉందో లేదో చూద్దాం. తప్పుడు పనులు చేసేవారు గతంలో సిగ్గుపడేవారు. ఇప్పుడు సిగ్గు వదిలి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. స్మగ్లర్లు పాలకులై పోలీసులు వారికి రక్షణగా నిలవడంతో అక్రమ రవాణా ఇంకా పెచ్చుమీరిపోయింది. దీనిని ప్రశ్నించారని మా వాళ్లపై యుద్ధం చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు. ఎంత అవినీతి చేసి ఎంత అక్రమంగా సంపాదించినా.. ఆదాయపు పన్ను కట్టారు కాబట్టి అంతా సక్రమమేనని ఐటీ శాఖ ధ్రువీకరణలు ఇచ్చేటట్లయితే దేశంలో ఇక అవినీతి చట్టాలు ఎత్తివేయడం మంచిదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి చెందిన మీ డియా సంస్థకు ఐటీ శాఖ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందంటూ వచ్చిన వార్తలను ప్రస్తావించినప్పుడు ఆయనీ వ్యాఖ్య చేశారు. ప్రజల కోసం సినిమా టికెట్లు ధరలు తగ్గించామని చెబుతున్నారని, అదే నిజమైతే ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన కంపెనీ తయారు చేసే సిమెంటు రేట్లు ఎలా పెరిగాయని చంద్రబాబు ప్రశ్నించా రు. ‘ఆ సిమెంటును కొనేవాళ్లు ప్రజలు కాదా? కంపెనీలన్నీ కలిసి కార్టెల్‌(ముఠా) కట్టి ఇష్టానుసారం పెంచుకుంటున్నారు. ఈ మధ్య కూడా ముఖ్యమంత్రి కంపెనీ బస్తాకు రూ.30-40 పెంచింది. మేం ఉన్నప్పుడు సిమెంటు కంపెనీలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే గట్టిగా హెచ్చరించి ఆపు చేసేవాళ్లం. ఇప్పుడు వాళ్లను ఆపేవాళ్లు లేకుండా పోయారు’ అని అన్నారు.


బ్రాండ్‌ ఇమేజ్‌ నాశనం..

వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, రాష్ట్రం బ్రాండ్‌ ఇమేజ్‌ ఘోరంగా పడిపోయి ఇతర రాష్ట్రాల వారు ఎగతాళి చేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్లలో ముఖ్యమంత్రులందరూ కలిసి రూ.3 లక్షల కోట్ల అప్పులు తెస్తే ఈ ముఖ్యమంత్రి రెండున్నరేళ్లలోనే దానిని ఏకంగా రూ.7 లక్షలకు చేర్చారని, వాయిదాలు.. అసలు కలిపి ఇంత అప్పు రాష్ట్రం ఎలా తీర్చగలదని ప్రశ్నించారు. జగన్‌రెడ్డికి పోయిందేమీ లేదని.. దోచుకున్నంత దోచుకుని పోతాడని, చివరకు రాష్ట్రం మునిగి పోతుందని వ్యాఖ్యానించారు. రైతులు, కార్మికులు, పేద వర్గాల ప్రజలు, కాంట్రాక్టర్లు, ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగులు సహా ఏ వర్గం కూడా ఆనందంగా పండగ జరుపుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కరోనా విషయంలో కొంతకాలంపాటు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, కుప్పంలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్నందుకు టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడి చేసి కొట్టారని బాబు ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంగళవారం డీజీపీ సవాంగ్‌కు లేఖ రాశారు. ’’


సినిమా వాళ్లంతా టీడీపీయా?

చిరంజీవి 2009లో పార్టీ పెట్టలేదా?

నేను సీఎంగా ఉండగానే నాకు వ్యతిరేకంగా సినిమాలు తీయలేదా: బాబు

సినిమా వాళ్లతో తగాదా వస్తే వాళ్లంతా టీడీపీ అంటూ పనికిమాలిన నిందలు వేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘సినిమా వాళ్లంతా మా పార్టీ వాళ్లా? 2009లో చిరంజీవి పార్టీ పెట్టి మాపై పోరాడలేదా? ఆయన అప్పుడూ, ఇప్పుడూ నాకు మంచి మిత్రుడే. కానీ పార్టీ పెట్టాడు.. పోరాటం చేశాడు. నేను ముఖ్యమంత్రిగా ఉండగానే నాకు వ్యతిరేకంగా సినిమా తీశారు. అంతా మా వాళ్లయితే నాపై సినిమాలు ఎలా వస్తాయి? ప్రతి వాడినీ చెయ్యి మెలిపెట్టి తమ మాట వినాలని వేధించడం నీచం’ అని మండిపడ్డారు. 

Updated Date - 2022-01-12T07:54:25+05:30 IST