పరిహారం కోసం ఉద్యమం

Jun 15 2021 @ 03:05AM

కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలి

దశలవారీగా ఆందోళనలకు టీడీపీ నిర్ణయం

చంద్రబాబు ఆధ్వర్యంలో ముఖ్యనేతల భేటీ 


అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం... ఉపాధి కోల్పోయిన వారికి సాయం కోసం ఉద్యమం చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. దీని కోసం దశలవారీగా ఉద్యమించనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. ‘చంద్రన్న బీమా పఽథకాన్ని వైసీపీ ప్రభుత్వం కొనసాగించి ంటే కరోనా మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం అందేది. కానీ ఆ పథకాన్ని తీసివేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల పరిహారాన్ని ఇవ్వాలి. కరోనా బాధిత కుటుంబాలను... కరోనా వల్ల వృత్తులు, పనులు, వ్యాపారాలు, ఆదాయాలు కోల్పోయిన వారిని ఆదుకోవడానికి ఇతర రాష్ట్రాలు వివిధ రకాల ప్యాకేజీలు అమలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ ఏ ప్యాకేజీ ఇవ్వలేదు. ఆదాయం కోల్పోయిన పేదలకు పది వేలు ఇవ్వాలి.


రైతుల వద్ద ఉన్న పంటలు కొనుగోలు చేసి వారికి మద్దతు ధర చెల్లించాలి’ అని టీడీపీ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 16న అన్ని మండలాల్లో తహసీల్దార్లకు, 18న ఆర్డీవోలకు, 20న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. 22వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో డిమాండ్ల సాధన దీక్షలు చేస్తారు. కాగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విపరీతంగా ఆస్తి పన్ను, యూజర్‌ ఛార్జీలు పెంచడంపై ఈ సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పెంపును నిరసిస్తూ ఈ నెల 15, 16 తేదీల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలిపింది. సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌, కృష్ణా జిల్లా అదనపు ఎస్పీ సత్తిబాబు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా వారిపై రాజద్రోహం కేసులు ఎందుకు పెట్టలేదని టీడీపీ నేతలు సమావేశంలో ప్రశ్నించారు. ‘బ్రిటీష్‌ వారిని పొగిడి సునీల్‌ మన దేశాన్ని కించపర్చారు. 


అమెరికాలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ను కూల్చిన ఉగ్రవాదిని ఆదర్శంగా సత్తిబాబు స్తుతించారు’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. వారిద్దరిపై రాజద్రోహం కేసు ఎందుకు పెట్టలేదో డీజీపీ సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను తక్షణం కొనుగోలు చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. మాన్సాస్‌ ట్రస్ట్‌, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 72ను హైకోర్టు కొట్టివేయడం ధర్మానికి, న్యాయానికి విజయమని పేర్కొన్నారు. న్యాయ పోరాటం చేసిన అశోక్‌ గజపతిరాజును అభినందించారు. విశాఖ టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు ఆస్తులపై దాడులు చేయడంతో పాటు ఆయనపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.