గజదొంగలే ఆశ్చర్యపోయేలా!

Published: Fri, 01 Apr 2022 03:06:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గజదొంగలే  ఆశ్చర్యపోయేలా!

జగన్‌రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారు

కరెంటు చార్జీలు తగ్గిస్తానని మాట తప్పారు

మూడేళ్లలో 42,172 కోట్ల భారం మోపారు

వ్యక్తిగత ఎజెండాతో విద్యుత్‌ రంగం సర్వనాశనం: చంద్రబాబు 


అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): గజదొంగలు కూడా ఆశ్చర్యపోయేలా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తానని చెప్పి మాటతప్పి అసాధారణంగా మూడేళ్లలోనే రూ.42,172 కోట్ల విద్యుత్‌ భారాల్ని ప్రజలపై వేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్‌ రంగాన్ని వ్యక్తిగత ఎజెండాతో సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. కరోనా కారణంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, ఆస్తి పన్ను, చెత్తపన్ను, ఇసుక, సిమెంటు, మద్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆర్థికంగా కుంగిపోయారని.. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌ చార్జీలను మరోసారి పెంచడం దారుణమన్నారు. ‘పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారాలు విధించి సంపన్నవర్గాల ప్రయోజనాల కోసం జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. 400యూనిట్ల పైన విద్యుత్‌ వినియోగించే సంపన్న వర్గాలపై 6శాతమే చార్జీలు పెంచి, 125యూనిట్లలోపు వాడే పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలపై 57శాతం పెంచడమే దీనికి నిదర్శనం. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం చార్జీలు పెంచేది లేదని సగర్వంగా ప్రకటించింది. 10వేల మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచుకోవడం ద్వారా మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారింది. కరెంటు కోతలు ఎత్తివేసి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసింది. వ్యవసాయ మోటార్లకు 9గంటల పాటు కోతల్లేకుండా కరెంటు ఇచ్చింది. ఐదేళ్లలో 3.26 లక్షల అదనపు వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం.


కానీ జగన్‌ మూడేళ్లలో ఇచ్చింది 1.17 లక్షల కనెక్షన్లు మాత్రమే అని తెలిపారు. 2019లో అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని బహిరంగంగానే ప్రకటించామన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక సౌర, పవన విద్యుత్‌ రంగాన్నిదెబ్బతీశారని, పీపీఏలు రద్దుచేశారని ఆక్షేపించారు. జగన్‌ ఏడుసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచడంతో ఇళ్లల్లో స్విచ్‌ వేయాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. 2014లో 22.5 ఎంయూల లోటుతో ప్రారంభమైనా 2019 నాటికి మిగులు విద్యుత్‌ సాధించామని..  జగన్‌రెడ్డి అసమర్థత, చేతకానితనంతో మిగులు విద్యుత్‌ రాష్ట్రాన్ని లోటులో పడేశారని దుయ్యబట్టారు. అప్రకటిత కోతలతో రాష్ట్రంలో చీకట్లు కమ్మేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. 


పేద, మధ్యతరగతి ప్రజలు అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే.. విద్యుత్‌ చార్జీలు పెంచుతూ, పన్నులు వేస్తూ జగన్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు. 

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. రాష్ట్రంలో ఉన్న విద్యుత్‌ రేట్లు చూసి పరిశ్రమలు ముందుకొచ్చే పరిస్థితి లేదు. పరిశ్రమలు లేకపోతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుంది.

నాడు మేం దూరదృష్టితో విద్యుత్‌ రంగాన్ని అభివృద్ధి చేస్తే.. నేడు జగన్‌ పక్షపాత ధోరణితో వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశారు.

చంద్రబాబు



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.