జగన్‌ లూటీ వల్లే రాష్ట్రం కుప్పకూలుతోంది

ABN , First Publish Date - 2022-04-20T08:08:39+05:30 IST

‘రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడానికి సంక్షేమ పథకాలు కారణం కాదు. ఎన్టీఆర్‌ హయాం నుంచి సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి లూటీ వల్లే రాష్ట్రం కుప్పకూలుతోంది’ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు

జగన్‌ లూటీ వల్లే రాష్ట్రం కుప్పకూలుతోంది

  • ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి పథకాలు కారణం కాదు
  • ప్రభుత్వ ఆదాయం దెబ్బతిని.. జగన్‌ ఆదాయం పెరిగింది
  • రాష్ట్రంలో ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు
  • ఇంతటి ప్రజా వ్యతిరేకత తొలిసారి చూస్తున్నా
  • జగన్‌లో నిస్పృహ ఏర్పడి బూతులు వస్తున్నాయి
  • ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ ఉండదని ఆయనకు తెలుసు: బాబు
  • ఒంగోలులో టీడీపీ మహానాడు.. మే 27 నుంచి 29 వరకూ
  • ఆ తర్వాత చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటనలు


రఘురామరాజుపై కోపంతో ఒక సామాజిక వర్గం, పవన్‌ కల్యాణ్‌పై కోపంతో మరో సామాజిక వర్గం, టీడీపీపై కోపంతో ఇంకో సామాజిక వర్గంపై దాడి చేస్తున్నారు. వైశ్యులకు మంత్రి పదవి లేకుండా రాష్ట్రంలో ఇంతవరకూ ఏ మంత్రివర్గమూ లేదు. 


చంద్రబాబు


అమరావతి, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడానికి సంక్షేమ పథకాలు కారణం కాదు. ఎన్టీఆర్‌ హయాం నుంచి సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి లూటీ వల్లే రాష్ట్రం కుప్పకూలుతోంది’ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంగళవారం  ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి ఆదాయం రావాల్సిన మార్గాలను జగన్‌ రెడ్డి మూసేసి.. వాటిని తన సొంత ఆదాయ మార్గాలుగా మార్చుకొన్నారని, అందువల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ‘ఏనాటి నుంచో ఉన్న మద్యం బ్రాండ్లను జగన్‌ రెడ్డి ఎత్తేసి తమకు కమీషన్లు ఇచ్చే జే బ్రాండ్లను తెచ్చారు. ఇసుక మొత్తాన్ని తమకు కావాల్సిన వారికి ఇచ్చుకొన్నారు. పరిశ్రమల నుంచి జే ట్యాక్స్‌ వసూలు చేసి అవి రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్ధితి తెచ్చారు. ఈ లూఠీలకు తోడు చేతగాని పాలన రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది. ఈ మూడేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టలేకపోయారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. ఒక్క రోడ్డూ బాగు చేసే పరిస్థితి లేదు. రాష్ట్రం పరిస్ధితి తలుచుకొంటే రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.


రాష్ట్రంలోని ఒక్క వర్గం కూడా వైసీపీ పాలనపై సంతృప్తితో లేదని, మూడేళ్లలో ప్రజల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాన్ని తాను ఇంతవరకూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘బాదుడే బాదుడు పేరుతో మా పార్టీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్తుంటే వారిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందో తెలుస్తోంది. సామాన్యులు మామూలుగా తిట్టడం లేదు. కరెంటులో మిగుల్లో ఉన్న రాష్ట్రాన్ని కోతల్లోకి తెచ్చారు. చార్జీలు హద్దూపద్దూ లేకుండా బాదుతున్నారు. ఇప్పటికి ఆరుసార్లు పెంచాడు. పాలన చేతగాకపోగా కొన్ని వర్గాలపై గుడ్డి ద్వేషంతో వ్యవహరిస్తున్నారు. వైశ్యులకు మంత్రి పదవి లేకుండా రాష్ట్రంలో ఇంతవరకూ ఏ మంత్రివర్గం లేదు. జగన్‌ రెడ్డి బలహీనతను మంత్రివర్గ విస్తరణ ఎత్తిచూపింది.  చివరకు భవనం వెంకట్రాం కూడా ఇంత బలహీనంగా కనిపించలేదు. నన్ను బూతులు తిట్టిన వారికి, లోకేశ్‌ను తిట్టిన వారికి, నా ఇంటిపై దాడికి వచ్చిన వారికి మంత్రి పదవులు లభించాయి. మంత్రి పదవులు రావడానికి ఇది అర్హత కావడం దురదృష్టకరం’ అని ఆయన అన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత జగన్‌కు కూడా కనిపిస్తోందని, దీనితో అతను నిస్పృహకు గురవుతున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నిస్పృహతోనే జగన్‌ నోటి నుంచి బూతులు వస్తున్నాయని... నంద్యాలలో పీకుడు మాటలు దాని ఫలితమేనని అన్నారు. పిచ్చి నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు’ అని ఆయన పేర్కొన్నారు. 




నేడు చంద్రబాబు పుట్టిన రోజు

బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 73వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం పార్టీ శ్రేణులు, నాయకులను చంద్రబాబు కలుస్తారు. సాయంత్రం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గొల్లగూడెం గ్రామానికి వెళతారు. చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు గ్రామానికి చేరుకుని అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాలలు వేస్తారని చెప్పారు. ఆతర్వాత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి గ్రామంలో పర్యటించి, సచివాలయం ఎదురుగా ఉన్న రచ్చబండ వద్ద జన్మదిన వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. అనంతరం దళితులు, బలహీనవర్గాలతో కలసి సహపంక్తి భోజనం చేసి, విజయవాడ చేరుకుంటారని తెలిపారు.


చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కటౌట్‌తో ఊరేగింపు నిర్వహించారు. కాగా, తెలుగుదేశం పార్టీ మహానాడు ఒంగోలు జరగనుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు మంగళవారం ఇక్కడ ఈ విషయం తెలిపారు. మే 27 నుంచి 29వ తేదీ వరకూ ఇవి జరగనున్నాయి. ఒంగోలులో మహానాడు నిర్వహించడం ఆ పార్టీకి ఇదే మొదటిసారి. మహానాడు తర్వాత తన రాష్ట్రవ్యాప్త పర్యటనలు ప్రారంభం అవుతాయని చంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2022-04-20T08:08:39+05:30 IST