ముఖం చెల్లకే కరోనా సాకు

ABN , First Publish Date - 2021-04-12T08:56:46+05:30 IST

టీడీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కరోనా సాకుతో తిరుపతికి రాకుండా పారిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

ముఖం చెల్లకే కరోనా సాకు

ఇక్కడ తిరుగుతున్న మీ మంత్రులకు రాలేదు.. మీకు మాత్రం వస్తుందా?

జవాబివ్వలేకనే జగన్‌ తిరుపతి రాలేదు.. దమ్ముంటే సవాళ్లు స్వీకరించాలి

హోదా, విశాఖ ఉక్కు, దాడులు, వివేకాను చంపిందెవరో వచ్చి చెప్పాలి

రెండేళ్లలో ప్రజలకు ఏమిచ్చారు?.. అమ్మఒడి 14 వేలు.. నాన్న బుడ్డి 30 వేలు

ట్రాక్టరు ఇసుక రూ.5 వేలు.. ఈ ముఖ్యమంత్రి బీసీల ద్వేషి

తిరుపతి పార్లమెంటు పరిధిలో 25 వేలకు పైగా ఇళ్లు నిర్మించాం

వాటిని పేదలకివ్వని జగన్‌రెడ్డికి ఓట్లు అడిగే అర్హత ఉందా?

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను రద్దు చేశారు.. రాపూరు సభలో బాబు ఫైర్‌ 


కరోనా పెరుగుతున్న కారణంగా తిరుపతికి రాలేకపోతున్నానని జగన్‌ లేఖలు రాశారు. అదే నిజమైతే మీ మంత్రులు, నాయకులు ప్రచారాలకు దూరంగా ఇళ్లలో కూర్చోవాలి కదా..!

  చంద్రబాబు


నెల్లూరు/రాపూరు, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కరోనా సాకుతో తిరుపతికి రాకుండా పారిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయనకు దమ్ముంటే ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, ధరల పెరుగుదల, అధికార పార్టీ దౌర్జన్యాలు, వివేకానంరెడ్డిని హతమార్చిందెవరో తిరుపతి సభకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ మంత్రులు వందలాది మందిని వెంటేసుకుని ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేస్తున్నారు, వారికి కరోనా కనిపించలేదు కానీ.. జగన్‌రెడ్డికి మాత్రం ఉందా అని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి వెంకటగిరి నియోజకవర్గం రాపూరులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.


‘విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయకుండా ఎందుకు అడ్డుకోలేకపోయారు? ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఎందుకు తగ్గించలేకపోతున్నారు? వీటన్నింటికి సమాధానం చెప్పాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. వీటికి సమాధానాలు లేక, తిరుపతి ప్రజలకు ముఖం చూపించలేకే జగన్‌రెడ్డి తిరుపతి ప్రచారానికి రాకుండా పారిపోయారు. మీ మంత్రులు వందలాదిమందిని వెంటేసుకొని ఇల్లిల్లూ తిరుగుతున్నారు.. కరపత్రాలు పంచుతున్నారు, వారికి లేని కరోనా భయం నీకొక్కడికే వచ్చిందా? వారివల్ల రాని కరోనా నీ ఒక్కడి వల్లే వస్తుందా..! చేసిన మోసాలకు ముఖం చూపించలేకే కరోనా సాకు’ అని ఎద్దేవాచేశారు. ఇంకా ఏమన్నారంటే..


రెట్టింపు లాక్కున్నారు..

రెండేళ్ల అధికారంలో ఏమిచ్చారని ప్రజలు వైసీపీకి ఓట్లు వేయాలి. అమ్మఒడి రూ. 14 వేలు. నాన్న బుడ్డి రూ.30 వేలు. మద్యం ధరల పెంపుతో రెట్టింపు లాక్కున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధమని కరోనా సమయంలో కూడా మందు షాపులు తెరవడమే గాక.. అక్కడ క్యూలైన్లు మెయిన్‌టెన్‌ చేయడానికి టీచర్లను నియమించిన జగన్‌రెడ్డి అసలు మనిషేనా? మా హయాంలో ఇసుక ఉచితంగా ఇచ్చాం. ఇప్పుడు ట్రాక్టర్‌  రూ.5 వేలైంది. అది కూడా దొరకడం లేదు. 48 లక్షల మంది భవన కార్మికులు పొట్ట చేతపట్టుకుని అల్లాడుతున్నారు.  మహాత్ముడు జ్యోతిరావు ఫూలే జన్మదినం సందర్భంగా అడుగుతున్నా.. జగన్‌రెడ్డీ.. నువ్వు బీసీలకు అన్యాయం చేయలేదా? 33ు ఉన్న బీసీ రిజర్వేషన్లను జగన్‌రెడ్డి 21 శాతానికి కుదించి ఆ వర్గాల పట్ల తనకున్న దేష్వాన్ని ప్రదర్శించాడు. దీనివల్ల స్థానిక సంస్థల్లో వేలాది పదవులకు బీసీలు దూరమయ్యారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కూడా రద్దు చేసిన ఘనతా ఆయనదే.


వైసీపీకి ఎందుకేయాలి ఓటు..?

వైసీపీ మంత్రులంతా కట్టకట్టుకుని నవరత్నాల కరపత్రాలు పట్టుకుని ఇల్లిల్లూ తిరుగుతున్నారు. అసలు వీరికి ఎందుకు ఓటువేయాలో ప్రజలు ఆలోచించాలి. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోనే 25 వేలకు పైగా ఇళ్లు నిర్మించాం. వాటిని కూడా పేదలకు ఇవ్వడానికి మనస్కరించని జగన్‌రెడ్డికి ఓటడిగే అర్హత ఉందా? లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించడానికి తెలుగుగంగ, కండలేరు ప్రాజెక్టులు టీడీపీ హయాంలో నిర్మించాం. మీరీ రెండేళ్లలో ఏం చేశారు? ఒక్క కాలువ తవ్వారా, తట్ట మట్టి వేశారా..? తిరుపతిని ఎలకా్ట్రనిక్‌ హబ్‌గా చేయాలని ప్రయత్నించాం. పలు కంపెనీలను స్థాపించాం. వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాం. మీ రెండేళ్ల కాలంలో ఒక్క పరిశ్రమైనా ఈ ప్రాంతానికి వచ్చిందా, ఒక్క ఉద్యోగం వచ్చిందా..? దుగరాజపట్నం ఓడరేవును ఈ ప్రభుత్వం అడ్డుకుంది.


తిరుపతి, నెల్లూరు, చెన్నై నగరాలను అనుసంధానం చేసే పనులు మొదలు పెట్టాం. ఈ ప్రభుత్వం దాని నెత్తిన చెత్త వేసింది. నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు భూసేకరణ చేశాం. ఈ ప్రభుత్వం రద్దు చేసింది. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైనుకు కేంద్ర మంత్రి హోదాలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కృషి చేశారు. ఈ ప్రభుత్వం దానిని గాలికి వదిలేసింది. పనబాక నాలుగు పర్యాయాలు ఎంపీగా, పదేళ్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆమె జీవితమంతా బడుగు బలహీన వర్గాల కోసం, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. మరో అభ్యర్థి (బీజేపీ) రాజకీయాలకు కొత్త. ఇంకో అభ్యర్థి (వైసీపీ)కి ఎందులో అనుభవం ఉందో మీకే (ప్రజలకు) తెలుసు. పనబాక  గెలిస్తే నేను సీఎంను కాకపోవచ్చు.. కానీ మీకు మంచి జరుగుతుంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి దేవుడిచ్చిన సువర్ణావకాశం ఉప ఎన్నిక. సద్వినియోగం చేసుకోండి.


బాబాయి వివేకానందరెడ్డిని దారుణంగా హత్యచేసిన హంతకులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? సొంత చెల్లెలు, చిన్నాన్న కూతురి ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పరు?

ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఒక్కటే దిక్కంటూ ఊరూరా యువతను రెచ్చగొట్టారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా సాధిస్తానన్నాడు. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు?

నేతి బీరకాయలో నెయ్యెంతో.. బీసీలపై జగన్‌కు ఉన్న ప్రేమా అంతే!

 టీడీపీ అధినేత చంద్రబాబు


నేడు తిరుపతిలో బాబు ప్రచారం

తిరుపతి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు సోమవారం తిరుపతిలో ప్రచారం నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం వెంకటగిరి నుంచి బయల్దేరి 4.30 గంటలకల్లా తిరుపతి రైల్వేస్టేషన్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రాత్రి 7.30 వరకూ రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం కృష్ణాపురం ఠాణా కూడలిలో బహిరంగసభలో ప్రసంగిస్తారు. రాత్రి 8.30కు ప్రచారం ముగించుకుని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ క్యాంపు కార్యాలయం చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశమై తిరుపతి సెగ్మెంట్‌లో ప్రచారం తీరుతెన్నులను సమీక్షిస్తారు. మంగళవారం గూడూరు వెళ్తారు.

Updated Date - 2021-04-12T08:56:46+05:30 IST