మూడేళ్లుగా.. బాదుడు, గుద్దుడే!

ABN , First Publish Date - 2022-05-21T08:37:38+05:30 IST

మూడేళ్లుగా సీఎం జగన్‌ పాలనంతా బాదుడు, గుద్దుడేనని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. గత ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి, అందరికీ ముద్దులు పెట్టి.. ఇప్పుడేమో గుద్దులు, బాదుడుతో ఆటాడుకుంటున్నాడని ధ్వజమెత్తారు.

మూడేళ్లుగా.. బాదుడు, గుద్దుడే!

సీఎంపై చంద్రబాబు ధ్వజం

రాజశేఖర్‌రెడ్డి కొడుకు పోటుగాడనుకున్నారు.. ఏదో చేస్తాడని గెలిపించారు

ఇప్పుడు అందరికీ నామాలు.. దద్దమ్మ సీఎం గంజాయి అరికట్టలేకపోయాడు

ఇక్కడి నుంచే దక్షిణాదికి డ్రగ్స్‌.. పెచ్చరిల్లిన అత్యాచారాలు.. ఆడ బిడ్డలకు రక్షణ లేదు

సహజ సంపదను వైసీపీ నేతలు దోచేస్తున్నారు.. దొంగ డాక్యుమెంట్లతో భూకబ్జాలు

టీడీపీ రాగానే విచారణ చేయిస్తాం.. బాధితులకు భూములు అప్పగిస్తాం

చంద్రబాబు ఉద్ఘాటన.. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటన


జగనన్న వదిలిన బాణం షర్మిల ఎప్పుడు ఎక్కడుంది? ఆ అమ్మాయికి ఏ గతి పట్టించాడో అందరి కీ తెలుసు. ఇలా అందరినీ వాడుకుని వదిలేసేసిన అవకాశవాది జగన్‌. నమ్మించి ఓట్లు వేయించుకుని, ప్రజలను కూడా అలాగే మోసం చేస్తున్నాడు.


సొంత బాబాయి వివేకా మరణానికి కారణం గొడ్డలి పోటా.. గుండెపోటా? గొడ్డలి పోటుదారులు జగన్‌ వద్దే ఉన్నారు. నీతినిజాయితీ ఉంటే వారిని సీబీఐకి అప్పగించాలి.  


నేను బాదుడే బాదుడు ప్రారంభిస్తే.. వారు గడపగడపకు మన ప్రభుత్వం ప్రకటించారు. ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతకు భయపడి బస్సుయాత్ర పెడుతున్నారు. ముఖ్యమంత్రి సభకు వచ్చిన జనం పారిపోతుంటే పోలీసులు ఆపుతున్నారు. మన సభకు వచ్చిన జనాన్ని పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు.

చంద్రబాబు


అనంతపురం మే 20(ఆంధ్రజ్యోతి): మూడేళ్లుగా సీఎం జగన్‌ పాలనంతా బాదుడు, గుద్దుడేనని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. గత ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి, అందరికీ ముద్దులు పెట్టి.. ఇప్పుడేమో గుద్దులు, బాదుడుతో ఆటాడుకుంటున్నాడని ధ్వజమెత్తారు. శుక్రవారం అనంతపురంలోని ఓ ఫంక్షన్‌ హాల్లో టీడీపీ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. అనంతరం రాత్రికి శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో, ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. మధ్యలో రాప్తాడు, చెన్నేకొత్తపల్లిలలో రోడ్‌షోలు నిర్వహించారు. వైఎస్‌ కొడుకు పెద్ద పోటుగాడని, ఏదో చేస్తాడని ప్రజలు గెలిపించారని.. ఇప్పుడేమో అన్ని రకాల ధర లూ పెంచేసి, అందరికీ నామాలు పెడుతున్నాడని దు య్యబట్టారు. ఏపీ బ్రాండ్‌ను వైసీపీ పాలకులు పోగొట్టారని ఆరోపించారు. పెట్టుబడిదారులను బెదిరించి, లొంగదీసుకుంటున్నారని.. అరాచక పాలన సాగిస్తున్న వైసీపీకి ఉరివేయాలని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ బిజినెస్‌ ఎక్కువైందని.. దక్షిణ భారత రాష్ట్రాలకు మన రాష్ట్రం నుంచే గం జాయి సరఫరా అయ్యే పరిస్థితికి వైసీపీ తీసుకొచ్చిందని అన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు పెచ్చరిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘సత్యసాయి జిల్లాలో బీటెక్‌ విద్యార్థినిపై అత్యాచారం చేసి, హత్య చేస్తే ఎస్పీ, సీఐ కప్పిపుచ్చారు. రెండో సారి పోస్టుమార్టం చేశాక ఆ అమ్మాయి అత్యాచారానికి గురైనట్లు తేలింది.


గుంటూరులో ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదవే ముగ్గురు విద్యార్థులు గంజాయి, మద్యానికి అలవాటు పడి.. తొమ్మిదేళ్ల బాలికను ట్రా ప్‌ చేసి, హోటల్‌కు పిలిపించుకుని అత్యాచారం చేశారు. వైసీపీ పాలనలో ఆడ బిడ్డలకు రక్షణ లేకుండా పోయిం ది’ అని అన్నారు. సోమందేపల్లి ప్రజా పోరాటానికి నాంది కావాలని పిలుపిచ్చారు. అక్రమ మైనింగ్‌తో వైసీపీ నాయకులు సహజ సంపదను దోచుకుంటున్నా రు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి భూకబ్జాలకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాటిపై విచారణ చేయించి, బాధితులకు తిరిగి అప్పగించి తీరతాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యాన్ని బాగా వాడుకున్న తర్వాత.. ప్రభుత్వం చేసేది తప్పని చెప్పినందుకు పనిలేని సీట్లో కూర్చోబెట్టారు. ‘సవాంగ్‌ అన్నా అంతా మీరే చూసుకోవాలి’ అని పోలీసు వ్యవస్థను రాజకీయంగా వాడుకుని, ఆయన్ను బంగాళాఖాతంలో కలిపేశాడు. మనం ప్రశ్నించాకే ఆయనకు సర్వీస్‌ కమిషన్‌లో అవకాశమిచ్చారు. కోడి కత్తి కేసు నాటకం కాదా?  స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇవ్వలేనంత పింఛన్‌ను మేం ఇచ్చాం. రూ.2 వేలు చేశాం. కానీ జగన్‌ మూడేళ్లలో రూ.500 పెంచి ఉన్న ఫించన్లను తొలగించారు. పీఆర్‌సీ అడిగే ఉద్యోగులను ప్రస్తుతం వేతనం సక్రమంగా ఇస్తే చాలనే పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులను చూపించే పత్రికలు, చానళ్లను జగన్‌ విరోధులుగా భావిస్తున్నాడు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే నన్ను బద్ధ శత్రువుగా చూస్తున్నాడు. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. మీకు దమ్ముం టే మూడేళ్ల పాలనలో అనంతపురానికి ఏం చేశారో చెప్పండి. 


విమర్శలు చేసి ప్రారంభోత్సవాలు..

కర్నూలులో సోలర్‌ ప్రాజెక్టుపై విమర్శలు చేసిన జగన్‌ మళ్లీ ఆ ప్రాజెక్టునే ప్రారంభించడం సిగ్గుచేటు. రాజశేఖర్‌రెడ్డి ప్రజలంటే భయపడేవారు. జగన్‌ అలాంటి వ్యక్తి కాదు. అసెంబ్లీలో నా భార్యపై విమర్శలు చేయడంతోపాటు అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఆడవారిని గౌరవించని సభను కౌరవ సభగా భావించి, మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచి గౌరవ అసెంబ్లీగా మార్చిన తర్వాతనే అసెంబ్లీలో  అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేసి వచ్చా ను అని చంద్రబాబు అన్నారు. కాగా, అనంతపురం నుంచి సోమందేపల్లికి వెళ్లే క్రమంలో రాప్తాడు, చెన్నేకొత్తపల్లిలో జరిగిన రోడ్‌షోలకు జనం పోటెత్తారు. మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో భారీ గజమాలతో చంద్రబాబును ఘనంగా సత్కరించారు.  


త్వరలో అభ్యర్థుల జాబితా..

త్వరలోనే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తా. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే సమర్థులకు అవకాశం ఇస్తా. టెక్నాలజీ యుగంలో దొంగ ఓట్లు ఎక్కించి, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ల జాబితాను పరిశీలించి, వైసీపీ కుట్రలను భగ్నం చేయాలి.  2024, అంతకు ముందు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.


బోస్టన్‌లో ఘనంగా టీడీపీ మహానాడు

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని బోస్టన్‌లో పసుపు పండుగ టీడీపీ మహానాడు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరుగుతున్న ఈ మహానాడులో పాల్గొనేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బోస్టన్‌కు తరలివచ్చారు. ఈ ఏడాది ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు కూడా నిర్వహిస్తుండటంతో మహానాడును కనీవినీ ఎరుగని రీతిలో జరపడానికి ఎన్నారై టీడీపీ యూఎ్‌సఏ సమన్వయకర్త జయరాం కోమటి స్వయంగా బోస్టన్‌లో విడిది చేశారు. మహానాడు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేశారు. కార్యక్రమాన్ని ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ లైవ్‌లలో ప్రసారం చేసే ఏర్పాట్లు చేశారు. బోస్టన్‌ మహానాడుకి టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ రాజు, గౌతు శిరీష, ప్రభాకర్‌ చౌదరి, కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. 

Updated Date - 2022-05-21T08:37:38+05:30 IST