ఎర్రగొండపాలెంపై టీడీపీ దృష్టి

ABN , First Publish Date - 2021-01-04T05:38:18+05:30 IST

పార్టీ నిర్మాణ వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తున్న టీడీపీ తాజాగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంపై దృష్టి సారించింది. అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు వారం రోజుల నుంచి ప్రత్యేక కసరత్తు చేపట్టారు. రెండుమూడ్రోజుల్లో ఆ నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జి నియామకాన్ని పూర్తి చేయనున్నారు.

ఎర్రగొండపాలెంపై  టీడీపీ దృష్టి
టీడీపీ ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలాజీతో సమావేశమైన ఎర్రగొండపాలెం టీడీపీ నేతలు

మూడ్రోజుల్లో ఇన్‌చార్జి నియామకం

ఎరిక్షన్‌బాబు పేరు దాదాపు ఖరారు 

సైకిల్‌ వైపు మళ్లీ డేవిడ్‌రాజు అడుగులు

అచ్చెన్నాయుడు ప్రత్యేక పరిశీలన


ఆంధ్రజ్యోతి, ఒంగోలు 

పార్టీ నిర్మాణ  వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తున్న టీడీపీ తాజాగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంపై దృష్టి సారించింది. అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు వారం రోజుల నుంచి ప్రత్యేక కసరత్తు చేపట్టారు. రెండుమూడ్రోజుల్లో ఆ నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జి నియామకాన్ని పూర్తి చేయనున్నారు. ఆ పదవికి సీనియర్‌ నాయకుడు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎరిక్షన్‌బాబును ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలిసింది. అయితే మధ్యలో ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,  వైసీపీ నేత పాలపర్తి డేవిడ్‌రాజు తిరిగి టీడీపీ వైపు దృష్టి సారించడం చర్చనీయాంశమైంది.  


యువతకు ప్రోత్సాహం 

జిల్లాలో సీనియర్‌ నాయకులు కరణం బలరాం, శిద్దా రాఘవరావులు టీడీపీని వీడిన తర్వాత వారి అభిమానులు ఎక్కువ మంది వైసీపీ వైపు పరుగులు తీయకుండా నిలువరించే ప్రయత్నం అధిష్ఠానం చేసింది. చీరాల ఎమ్మెల్యేగా ఉన్న బలరాం పార్టీ మారటంతో వెంటనే అక్కడ యడం బాలాజీని ఇన్‌చార్జిగా ప్రకటించి ప్రోత్సహించటం ప్రారంభించింది. రాష్ట్ర కమిటీ, ఇతరత్రా రాష్ట్రస్థాయి బాధ్యతల్లో జిల్లాలోని యువ నాయకత్వానికి ప్రోత్సహిస్తూ పదవులను కట్టబెట్టింది. అనంతరం ఇన్‌చార్జిలు లేని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే దర్శి నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్‌గా పమిడి రమేష్‌కి అవకాశమిచ్చారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయిన అయిన మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు అనారోగ్య సమస్యలతో కొంత కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఆయన్ను పరిగణలోకి తీసుకుంటూనే యువ నాయకులను ప్రోత్సహిస్తున్నారు. ఇంటూరి రాజేష్‌ అనే యువ నాయకుడిని యాక్టివ్‌గా ఉండమని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ సూచించినట్లు తెలిసింది.  ఒంగోలులో వివిధ కారణాలతో జనార్దన్‌ స్థానికంగా ఉండకపోయినా నిత్యం రాష్ట్ర పార్టీ నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులతో మాట్లాడటం, ప్రత్యేకించి పార్టీ ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలాజీతో సంప్రదిస్తూ నిరంతర కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. బాపట్ల లోక్‌సభ అధ్యక్షుడిగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును నియమించిన అధినేత చంద్రబాబు అనంతరం ఆయన పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.


ఎర్రగొండపాలెంపై దృష్టి

ఈ నేపథ్యంలో పార్టీ ఇన్‌చార్జి కూడా లేని ఎర్రగొండపాలెం నియోజకవర్గంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ లోక్‌సభ అధ్యక్షుడు బాలాజీని ఆ నియోజకవర్గంలో అధికంగా పర్యటించే విధంగా చేసి ప్రజల నాడిని అంచనా వేశారు. అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి సురేష్‌ను టార్గెట్‌ చేసుకొని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆ నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడప్రజల స్పందన చూసిన తర్వాత అత్యవసరంగా ఇన్‌చార్జిని నియమించాలన్న ఆలోచనకు అధిష్టానం వచ్చినట్లు తెలిసింది. ఆ వెంటనే దళిత వర్గంలో ప్రత్యేకించి మాదిగ సామాజికవర్గం  రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఏకైక నాయకుడు గూడూరి ఎరిక్షన్‌బాబు పేరును పరిశీలనలోకి తీసుకుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆయన లిడ్‌క్యాప్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇటీవల పార్టీ ఆయన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించింది. పార్టీ అధికారం కోల్పోయిన తొలినాళ్లలోనే ఆయన్ను వై.పాలెం ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించాలని కోరింది. సంతనూతలపాడుపై ఆసక్తితో ఉన్న ఆయన అందుకు అంగీకరించలేదు. అయితే ఇటీవల అధిష్ఠానం ఆయనతో సంప్రదింపులు జరపగా పార్టీ కావాలంటే పులివెందుల నుంచి అయినా పోటీచేసేందుకు సిద్ధమని చెప్పినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం తర్జనభర్జనల అనంతరం ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జిగా ఎరిక్షన్‌బాబుని నియమించాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది.


తెరమీదకు డేవిడ్‌రాజు 

ఈ దశలో జిల్లాలో సీనియర్‌ రాజకీయ నాయకుడు, వై.పాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు తిరిగి టీడీపీ వైపు దృష్టి సారించినట్లు సమాచారం. టీడీపీలో ఉండి ఎంపీపీగా, జడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా పనిచేసిన ఆయనకు పార్టీ శ్రేణుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే 2014 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అనంతర పరిణామాల్లో తిరిగి టీడీపీలో చేరిన ఆయన, గత ఎన్నికల సమయంలో టీడీపీ టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో వైసీపీలోకి వెళ్లారు. అక్కడ ఎన్నికల అనంతరం ఆయనకు సరైన ఆదరణ లభించలేదు. తాజాగా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జిగా డేవిడ్‌రాజుని నియమిస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కొందరు ఆపార్టీ రాష్ట్ర నాయకులకు సూచించారు. ఆదివారం నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్‌ నాయకులు ఒంగోలు వచ్చి పార్టీ లోక్‌సభ అధ్యక్షుడు బాలాజీని కలిసి వై. పాలెంకు శాశ్వత పార్టీ ఇన్‌చార్జిని నియమించాలని కోరారు. ఆ సందర్భంగా వచ్చిన నాయకులలో కొందరు డేవిడ్‌రాజు పేరుని సూచించినట్లు కూడా తెలిసింది. ఇంకోవైపు ఈ సమావేశం అనంతరం వారిలో పలువురు ఒంగోలులోని డేవిడ్‌రాజు గృహానికి వెళ్లి ఆయన్ను కలిశారు. వారితోపాటు ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాలకు చెందిన కొందరు టీడీపీ నేతలు కూడా డేవిడ్‌రాజుతో భేటీ అయ్యారు. అయితే పార్టీ అధిష్టానానికి డేవిడ్‌రాజు విషయంలో వ్యతిరేకంగా లేకపోయిప్పటికీ పార్టీ తాజా నిర్ణయాలకనుగుణ ంగా ఎర్రగొడపాలెం ఇన్‌చార్జిగా ఎరిక్షన్‌బాబు వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. 




Updated Date - 2021-01-04T05:38:18+05:30 IST