టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్ర భగ్నం

ABN , First Publish Date - 2021-01-22T08:46:26+05:30 IST

తెలుగుదేశం పార్టీ తిరుపతిలో చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్రను పోలీసులు భగ్నం చేశారు.

టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్ర భగ్నం

  • హోటల్‌ గదిలోనే అచ్చెన్న నిర్బంధం.. కార్యకర్తలపై లాఠీచార్జి
  • బుద్దా వెంకన్న సహా పలువురు నేతలు అరెస్టు
  • అనుమతి ఇచ్చి... రద్దు చేసిన పోలీసులు

తిరుపతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ తిరుపతిలో చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్రను పోలీసులు భగ్నం చేశారు. తొలుత అనుమతి ఇచ్చిన పోలీసులు తీరా యాత్ర ప్రారంభమయ్యే సమయానికి నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆఖరి క్షణంలో అడ్డుకున్నారు. ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా అలిపిరి నుంచి ఎన్టీఆర్‌ కూడలి వరకూ ర్యాలీ నిర్వహించడానికి పోలీసులు బుధవారం లిఖితపూర్వక అనుమతి ఇచ్చారు. ర్యాలీ అనంతరం సభను రామచంద్ర పుష్కరిణి లేదా మున్సిపల్‌ కార్యాలయం కూడలి వద్ద జరుపుకోవాలని సూచించారు. స్వల్ప సమయం పాటు ఎన్టీఆర్‌ కూడలిలో సభ జరుపుకోవడానికి మౌఖిక అనుమతి ఇచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు.


గురువారం ఉదయం పెద్దఎత్తున పార్టీ శ్రేణులు అలిపిరి కూడలి వద్దకు చేరుకున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీలు దొరబాబు, బుద్ధా వెంకన్న, గౌనివారి శ్రీనివాసులు, మాజీ మంత్రి పరసా రత్నం, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు తదితరులు ర్యాలీని ప్రారంభించారు. వీరంతా పాదయాత్రగా వెళ్తుండగా పెద్దసంఖ్యలో యువకులు మోటర్‌ బైక్‌లతో ర్యాలీలో కలిశారు. బైక్‌ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. నిబంధనలు ఉల్లంఘించారనే నెపంతో యాత్రనూ అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన నల్లారి కిశోర్‌, దేవనారాయణరెడ్డి, సంజయ్‌ తదితర నేతలు అక్కడే ధర్నాకు దిగారు. కాగా, మహతి ఆడిటోరియం వద్ద నిరసనకు దిగిన బుద్ధా వెంకన్న, ఆర్‌సీ మునికృష్ణను అరెస్టు చేసి వాహనంలో చంద్రగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మార్గమధ్యంలో ఎన్టీఆర్‌ కూడలి వద్ద వాహనాన్ని అడ్డుకున్న ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, విజయలక్ష్మిని అరెస్టు చేసి ముత్యాలరెడ్డిపల్లె స్టేషన్‌కు తరలించారు. బహిరంగసభ కోసం ఏర్పాటు చేసిన మైకులు, స్పీకర్లను కూడా పోలీసులు తొలగిస్తుండగా అడ్డుకున్న నరసింహయాదవ్‌, మద్దిపట్ల సూర్యప్రకాశ్‌ తదితరులను అరెస్టు చేశారు. 


అచ్చెన్నాయుడుసహా పలువురి నిర్బంధం

ధర్మ పరిరక్షణ యాత్రలో పాల్గొనేందుకు బయల్దేరిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. తిరుచానూరులోని ఓ హోటల్‌లో బస చేసిన ఆయన గది నుంచి వెలుపలికి రాకుండా పెద్దఎత్తున మొహరించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌, మాజీ మంత్రులు అమరనాథరెడ్డి, నక్కా ఆనంద్‌బాబు తదితరులున్నారు. భూకంపం వచ్చినా తాను యాత్ర ఆపేది లేదని అచ్చెన్న భీష్మించుకోగా పోలీసులను నెట్టుకుని వెలుపలికి వచ్చేస్తారన్న అనుమానంతో వ్యూహాత్మకంగా గది తలుపుల వద్ద మహిళా పోలీసులను నియమించారు. దీనికి ప్రతివ్యూహంగా టీడీపీ నేతలు అక్కడికి తెలుగు మహిళలను రప్పించారు. తమను గదిలోకి అనుమతించాలంటూ పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. అలిపిరి, ఎన్టీఆర్‌ కూడళ్ల వద్ద నుంచీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హోటల్‌ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం వరకూ కార్యకర్తలను హోటల్‌ ఆవరణలోకి అనుమతించకుండా పోలీసులు గేటు వద్ద మోహరించారు.


అనుమతి ఇచ్చిన సందర్భంగా విధించిన నిబంధనలను ఉల్లంఘించినందున ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు చేస్తున్నామంటూ పోలీసు అధికారులు అచ్చెన్నాయుడికి ఉత్తర్వుల ప్రతి అందజేశారు. తాను గది నుంచి బయటికే రానప్పుడు నిబంధనలు ఎలా ఉల్లంఘించానో చెప్పాలంటూ అచ్చెన్న వారిని నిలదీశారు. చివరికి అచ్చెన్నాయుడు సహా అక్కడున్న నేతలను హౌస్‌ అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు వారికి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసులు జారీ చేశారు. తిరుపతి యాత్రను అడ్డుకున్నంత మాత్రాన టీడీపీ శ్రేణులు వెనక్కు తగ్గవని, శుక్రవారం నుంచీ మరింత పట్టుదలగా ఇంటింటికీ ధర్మ పరిరక్షణ యాత్ర ఉద్దేశాలను తమ కార్యకర్తలు చేరవేస్తారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్ర సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పలుసార్లు అచ్చెన్నాయుడికి ఫోన్‌ చేసి ఆరా తీశారు.

Updated Date - 2021-01-22T08:46:26+05:30 IST