ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు
రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది
విశాఖలో నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు
విశాఖపట్నం, మార్చి 1: రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. చిత్తూరు పర్యటనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ సోమవారం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు.
జగన్ పాలనను చూస్తుంటే ఓ హిట్లర్, ముస్సోలినీ, ముషారఫ్‌లను చూస్తున్నట్టు ఉందన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అడ్డుకోవడం దారుణమని, చంద్రబాబును చూసి జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎంతోమంతి నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని గుర్తుంచుకోవాలని సూచించారు. ఆందోళనలో పార్టీ నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, దువ్వారపు రామారావు, అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్, కలిశెట్టి అప్పారావు, పుచ్చా విజయకుమార్, వానపల్లి రవికుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.