ఏపీ CID అదుపులో మాజీ మంత్రి నారాయణ

ABN , First Publish Date - 2022-05-10T17:24:16+05:30 IST

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణను (Narayana) ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఏపీ CID అదుపులో మాజీ మంత్రి నారాయణ

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణను (Narayana) ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఏపీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన సీఐడీ అధికారులు (CID Officers) కొండాపూర్‌లోని నివాసంలో నారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. నారాయణను ఆయన సొంతకారులోనే ఏపీకి తరలిస్తున్నారు. ఆయన బెంజ్ కారు నంబర్-8888లోనే ఏపీకి తీసుకెళ్తున్నారు. నారాయణ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు. మరోవైపు టోల్‌గేట్ దగ్గరికి పెద్ద ఎత్తున నారాయణ విద్యాసంస్థల సిబ్బంది చేరుకుంటున్నారు.


ఇందుకేనా..!?

కాగా.. ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనప్పట్నుంచీ లీకుల బెడద ఎక్కువైన సంగతి తెలిసిందే. అయితే ఈ లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల పాత్ర కూడా ఉందని గత కొన్ని రోజలుగా పెద్ద ఎత్తున ఆరోపణలు, వార్తలు వస్తున్నాయి. ఆయన నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలోనే నారాయణను అదుపులోకి తీసుకున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు.. రాజధాని అసైన్డ్‌ భూముల కేసులో విషయంలోనూ గతంలో నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో నెల్లూరులోని నారాయణ నివాసంలోనూ సీఐడీ సోదాలు చేసింది. అయితే ఇప్పుడు ఆయన్ను ఎందుకు, ఏ విషయంలో అదుపులోకి తీసుకున్నారు..? సీఐడీ అధికారులు ఎందుకు ఏపీ నుంచి హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది..? అనే విషయాలపై ఇంతవరకూ ఏ మాత్రం సమాచారం లేదు. అంతేకాదు.. అధికారులు సైతం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారే తప్ప ఏ సమాచారం మీడియాకు కూడా ఇవ్వలేదు.

Read more