డీజీపీని నిందిస్తే ఊరుకోం

ABN , First Publish Date - 2021-03-06T09:31:57+05:30 IST

రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై కుల, ప్రాంత ముద్రలు వేస్తూ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్య తీసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబును రాష్ట్ర పోలీసు

డీజీపీని నిందిస్తే ఊరుకోం

బాబుకు పోలీస్‌ అధికారుల సంఘం హెచ్చరిక

ప్రాపకం కోసమే దిగజారుడు ప్రకటనలు: టీడీపీ ఫైర్‌


అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై కుల, ప్రాంత ముద్రలు వేస్తూ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా  చర్య తీసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబును రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది. సుదీర్ఘ కాలంగా అడహక్‌ కమిటీగా కొనసాగుతున్న పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మస్తాన్‌ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సుదీర్ఘ రాజకీయ జీవితం, ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక రాష్ట్ర డీజీపీని ఇలా అనడం గర్హనీయం. మీ ప్రభుత్వంలో సవాంగ్‌ పనిచేసినప్పుడు కులం, మతం, ప్రాంతం గుర్తుకు రాలేదా చంద్రబాబూ?’’ అని సంఘం నేతలు నిలదీశారు.


కాగా.. ఈ ప్రకటనపై తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘తాడేపల్లి ప్యాలె్‌సలో తయారుచేసిన ప్రకటనలను తమ లెటర్‌ ప్యాడ్లపై రాసుకొని విడుదల చేయడానికి పోలీస్‌ అధికారుల సంఘం సిగ్గుపడాలి. అధికార పార్టీకి ఊడిగం చేస్తున్న కొందరు సంఘం నేతలు తాడేపల్లి పెద్దల ప్రాపకం కోసం దిగజారుడు ప్రకటనలు ఇస్తున్నారు. వాటిని మానుకుంటే మంచిది’’ అని హెచ్చరించారు.

Updated Date - 2021-03-06T09:31:57+05:30 IST