బీసీకి అండగా టీడీపీ: సోమిశెట్టి

ABN , First Publish Date - 2021-06-24T05:46:32+05:30 IST

బనగానపల్లె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

బీసీకి అండగా టీడీపీ: సోమిశెట్టి
బీసీకి సంఘీభావం ప్రకటిస్తున్న సోమిశెట్టి, గౌరు వెంకటరెడ్డి, కోట్ల సుజాతమ్మ తదితరులు

బనగానపల్లె, జూన్‌ 23: బనగానపల్లె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు  ఇటీవల  సబ్‌ జైలు నుంచి విడుదలైన బీసీని జిల్లాలోని పలువురు టీడీపీ నాయకులు కలసి సంఘీభావం ప్రకటించారు. సోమిశెట్టి నేతృత్వంలో పలువురు పార్టీ నాయ కులు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి బీసీని,  ఆయన సతీమణి ఇందిరమ్మను  పరామర్శించారు. బనగానపల్లె టీడీపీ కార్యాలయం ఆవరణలో బీసీకి జిల్లా టీడీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. సోమిశెట్టితో పాటు కోట్ల సుజాతమ్మ, కర్నూలు పార్లమెంటరీ పార్టీ  టీడీపీ ఇన్‌చార్జి ప్రభాకర్‌చౌదరి, నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, డోన్‌ నాయకుడు కేఈ ప్రతాప్‌, నంద్యాల ఇన్‌చార్జి  భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ జడ్పీటీసీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌గౌడ్‌, ధర్మారం సుబ్బారెడ్డి, తదితర దేశం నాయకులు బీసీని పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు టీడీపీ భయపడే ప్రసక్తేలేదని  పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి టీడీపీ  నాయకులను టార్గెట్‌ చేసుకొని అక్రమ కేసులు పెడుతోందన్నారు. ఏపీ అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు  మొదలుకొని, బీసీ జనార్దన్‌రెడ్డి వరకు రాష్ట్రంలో ఎంతో మందిని క్రమ కేసుల్లో ఇరికించి  భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. అయితే వారి తాటాకు చప్పుళ్లుకు దేశం నాయకులు భయపడే పరిస్థితి లేదన్నారు. తమది ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అన్నారు. వైసీపీ దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తూ వస్తున్నారన్నారు. రూ.కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకునేలా ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, చల్లా మద్దిలేటి, కోడి నాగరాజుయాదవ్‌, పేరుసోముల సురేశ్‌రెడ్డి,  నందవరం ఆలయ మాజీ చైర్మన్‌ పీవీ కుమార్‌రెడ్డి, కోటపాడు శివరామిరెడ్డి, కానాల శేషారెడ్డి,  వివిధ గ్రామాల  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తనకు సంఘీభావం ప్రకటించిన టీడీపీ నాయకులకు బీసీ కృతజ్ఞతలు తెలిపారు. 


బనగానపల్లెలో కొనసాగుతున్న పికెట్‌: పట్టణంలో పోలీస్‌ పికెట్‌ బుధవారం కూడా కొనసాగింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు కూడళ్లలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఇండ్లు, అవుకు మెట్ట, పెట్రోల్‌బంకు కూడలి తదితర ప్రాంతాల్లో సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు కృష్ణమూర్తి, శంకర్‌నాయక్‌ బందోబస్తును పర్యవేక్షించారు.   




Updated Date - 2021-06-24T05:46:32+05:30 IST