ఆ నేత మరణంతో టీడీపీ తమ్ముళ్లలో స్తబ్దత..గెలుపు గుర్రాన్ని ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని పార్టీ పెద్దలు కసరత్తు

ABN , First Publish Date - 2022-02-10T17:36:38+05:30 IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బాగా పట్టుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మారిన రాజకీయ సమీకరణాల

ఆ నేత మరణంతో టీడీపీ తమ్ముళ్లలో స్తబ్దత..గెలుపు గుర్రాన్ని ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని పార్టీ పెద్దలు కసరత్తు

అది తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గం. అక్కడ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నేత మరణంతో తమ్ముళ్లలో స్తబ్దత నెలకొంది. దీంతో నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. స్థానిక నేతలందరినీ ఏకతాటి పైకి తెచ్చి నియోజకవర్గ పెద్ద దిక్కును ఎంపిక చేయడానికి సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


పల్నాడు రాజకీయాలలో ఎదురులేని నేత కోడెల

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బాగా పట్టుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ తన సొంత ఊరు సత్తెనపల్లిలోకి వెళ్లడంతో నరసరావుపేటను వీడి సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. ఏపీ అసెంబ్లీ తొలి స్పీకర్‌గా పని చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో అభివృద్ధి కాముకుడుగా కోడెల శివప్రసాద్ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. దీంతో పల్నాడు రాజకీయాలలో కోడెల ఎదురులేని నేతగా ఎదిగారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ప్రభంజనంలో కోడెల శివప్రసాద్ ఓటమి చెందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వేధింపులతో మానసికంగా కుంగిపోయి కోడెల ఆత్మహత్య చేసుకోవడం టీడీపీలో తీవ్ర విషాదాన్ని నింపింది.


కోడెల శివరాంకు ఇన్‌ఛార్జ్‌ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారంటా..?

కోడెల మరణం తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పదవిని పలువురు ఆశించారు. ఆయన తనయుడు కోడెల శివరాం తనకు ఇన్‌ఛార్జ్‌ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతూ ఉన్నారు. ఈయనతో పాటు గత ఎన్నికలలో సీటు ఆశించి భంగపడ్డ  తెలుగు యువత నేత మల్లి కూడా పార్టీ ఇన్‌ఛార్జ్‌ పదవిని కాంక్షిస్తున్నారు. వీరిద్దరితో పాటు గతంలో సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పని చేసిన వై.వి.ఆంజనేయులు కూడా  తిరిగి సత్తెనపల్లిపై కన్నేశారు. ఇన్‌ఛార్జ్‌ పదవిని ఆశిస్తూ అప్పుడప్పుడు సత్తెనపల్లి వెళ్లి వస్తున్నారు. అయితే వై.వి.ఆంజనేయులు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత టీడీపీలో పత్తా లేకుండా పోయాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి ఎవరికైనా స్థానికుడుకే ఇన్‌ఛార్జ్‌ ఇవ్వాలని వాదన నియోజకవర్గంలో బలంగా వచ్చింది. స్థానికేతరుడైన వై.వి.ఆంజనేయులుకు ఇది ఇబ్బందికరంగా మారింది. అలాగే ఇటీవల చుట్టుముట్టిన కొన్ని వివాదాలు కూడా ఆయనకు మైనస్‌గా మారాయి.


పార్టీ ఇన్‌ఛార్జ్‌ పదవి ఆశిస్తున్న మాజీ ఎంపీపీ నాగోతు శౌరయ్య

ఇక స్థానిక నినాదంతో నకరికల్లు మాజీ ఎంపీపీ నాగోతు శౌరయ్య కూడా పార్టీ ఇన్‌ఛార్జ్‌ పదవి ఆశిస్తున్నారు. ఇదిలాఉండగా, అధికారం కోల్పోయి రెండున్నరేళ్లు అవడంతో పార్టీకి పట్టున్న సత్తెనపల్లి నియోజకవర్గంపై టీడీపీ అధిష్టానం ఇటీవల ప్రత్యేక దృష్టి సారించింది. ఇన్‌ఛార్జ్‌ పదవిని ఆశించే నేతలతో పాటు స్థానిక నేతల అభిప్రాయాలను సేకరించే కార్యక్రమం ముమ్మరం చేసింది. నాయకులు అందరూ కలసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని అధినేత చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.


చంద్రబాబు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన క్రమంలో.. తనతో ఇప్పటివరకు దూరంగా ఉన్న సీనియర్ నేతలతో కోడెల శివరాం స్వయంగా కలుస్తున్నారు. కలిసి పనిచేద్దామని వారిని ఆయన అభ్యర్థించడం, కొంత మంది నేతలు సానుకూలత వ్యక్తం చేయడం పార్టీలో చర్చగా మారింది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కోడెల సానుభూతి పవనాలను పార్టీ వాడుకోవాలని పలువురు పార్టీ సీనియర్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 


2024 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా

పల్నాడు రాజకీయాలలో చక్రం తిప్పిన కోడెల శివప్రసాద్ చరిష్మాను ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ పార్టీకి ఉపయోగించుకునేందుకు ఆయన వారసుడైన కోడెల శివరాంనే  పెద్ద దిక్కును చేస్తారో లేక మరెవరికైనా కట్టబెడతారో చూడాలి. మొత్తంమీద, 2024 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా గెలుపు గుర్రాన్ని ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని పార్టీ పెద్దలు కసరత్తు ముమ్మరం చేశారు.

Updated Date - 2022-02-10T17:36:38+05:30 IST