
జగన పాలనను ఎండగట్టేందుకే చంద్రబాబు రాక
టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు
అనంతపురం, మే 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన సాగిస్తున్న దుర్మార్గపు పాలనను ఎండగట్టేందుకే తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై జరిగే ఈ పోరాటానికి ప్రజలందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. వీవీఆర్ కళ్యాణ మండపంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ ఉమ్మడి జిల్లా ఇనచార్జి బీటీ నాయుడుతో కలిసి కాలవ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గురువారం రాత్రికి అనంతపురం చేరుకుంటారని తెలిపారు. ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం వరకూ పార్టీ ఉమ్మడి జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం చెన్నేకొత్తపల్లి, పెనుకొండ మీదుగా సోమందేపల్లికి చేరుకుని, బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ముఖ్యమంత్రి జగన పాలనలో మూడేళ్లుగా ప్ర జలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కాలవ అన్నారు. అన్నదాతలకు డ్రిప్పు, వ్యవసాయ పరికరాలు అందించడం లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని, ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు. జగన మూడేళ్ల పాలనంతా అసత్యాలతోనే గడిచిపోయిందని విమర్శించారు. ఈ అసత్య పాలనలో జరుగుతున్న దుర్మార్గాలను ఎండగట్టేందుకే తమ నాయకుడు జిల్లా పర్యటనకు వస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, జగన ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను తూర్పారబట్టేందుకు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఎంచుకున్నారని అన్నారు. అన్నివర్గాల ప్రజలు తమ నాయకుడికి మద్దతుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
జగనకు రాజపక్స గతే..
అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగనకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సకు పట్టిన గతే పడుతుందని బీటీ నాయుడు అన్నారు. ప్రజలు తిరగబడితే.. శ్రీలంక అధ్యక్షుడు బంకర్లలో తలదాచుకున్నారని, తాడేపల్లి ప్యాలె్సను ముట్టడిస్తే తలదాచుకోవడానికి జగనకు బంకర్లు కూడా లేవని అన్నారు. ఏ వస్తువు ధర చూసినా ఆకాశాన్ని అంటుతోందని అన్నారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన జగనను ప్రజలు గద్దెదింపేందుకు సిద్ధమయ్యారని అన్నారు. మూడేళ్ల పాలనపై విసిగివేసారిన ప్రజలు, గడపగడపకు వెళ్లే మంత్రులు, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారని అన్నారు. తమ నాయకుడు చంద్రబాబునాయుడు పాల్గొనే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అనంతరం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.