Andhra news: ఎన్నికలు ఏవైనా అదే అరాచకం...అవే అక్రమాలు: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-07-20T15:11:26+05:30 IST

ఎన్నికలు ఏవైనా వైసీపీ అదే అరాచకం, అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.

Andhra news: ఎన్నికలు ఏవైనా అదే అరాచకం...అవే అక్రమాలు: అచ్చెన్నాయుడు

అమరావతి: ఎన్నికలు ఏవైనా వైసీపీ అదే అరాచకం, అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ(TDP) రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Achennaidu) విమర్శలు గుప్పించారు. తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే దమ్ములేకనే  వైసీపీ(YCP) అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు. టీడీపీ నేతలను గృహ నిర్భంధం చేసి ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి ఇక ఎన్నికలెందుకని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పట్టపగలే  ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. పోలీసులున్నది అధికార పక్షానికి కొమ్ముకాయడానికా ? లేక ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఏ కారణంతో టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారని... వైసీపీ నేతలను ఎందుకు అరెస్టులు చేయలేదని అడిగారు. జగన్ రెడ్డి ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. దొంగ ఐడీ కార్డులు ముద్రించి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లను అడ్డుకుంటామనే టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారన్నారు. మూడేళ్లుగా దోచుకున్న డబ్బును అక్రమంగా గెలిచేందుకు వెదజల్లుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారం బలంతో, ఈ ఎన్నికల్లో గెలిచినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జగన్ రెడ్డికి ఓటమి తప్పదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-20T15:11:26+05:30 IST