Achennayudu: వైసీపీ నేతలకు ఏటీఎం మిషన్లుగా రైతు భరోసా కేంద్రాలు

ABN , First Publish Date - 2022-08-17T18:09:49+05:30 IST

రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతలకు ఏటీఎం మిషన్లుగా మారాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.

Achennayudu: వైసీపీ నేతలకు ఏటీఎం మిషన్లుగా రైతు భరోసా కేంద్రాలు

అమరావతి: రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతల (YCP Leaders)కు ఏటీఎం మిషన్లుగా మారాయని టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu achennaidu) విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ... ఆర్బీకేలు రైతుల నుండి సరిగా ధాన్యం కొనరని...  కొద్దో గొప్పో కొన్నా, రైతుకి వెంటనే వాటి డబ్బు చెల్లించరని మండిపడ్డారు. ఎరువులు అధిక ధరలకు అమ్ముతారని.. రైతులకు ఎరువులపై స్వల్పకాలిక రుణం కూడా ఉండదని తెలిపారు. ఎప్పుడు చూసినా ఎరువుల కొరతే అని అన్నారు. అధికారులు, వైసీపీ నాయకులు కుమ్ముక్కై నకిలీ రైతులను నమోదు చేసి ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రబీలోనే వందల కోట్ల సొమ్ము కాజేశారని ఆరోపించారు. మొత్తం కొనుగోళ్లపై లెక్కలు తీస్తే ఎన్ని వేల కోట్లుకాజేశారో తేలుతుందన్నారు. ధరల స్థిరీకరణకు రూ.3000 కోట్లు, విపత్తులకు రూ.6000 కోట్లు కేటాయిస్తామని చెప్పారని... వేటికీ దిక్కు లేదని ఆయన అన్నారు.


ఈ పరిపాలనను మించిన విపత్తు మరొకటి లేదని విమర్శించారు. ధాన్యం బస్తాపై 200 వరకూ కమీషన్ గుంజుతున్నారని తెలిపారు. ‘‘అసలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువుల మొత్తం ఎంత? ఎంత మొత్తంలో ఎరువులు ఆర్బీకే ల వద్ద ఉన్నాయి? ఎంత మొత్తం ఆర్బీకే ల ద్వారా ఇచ్చారు? అలానే.. ధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పండించిన పంట ఎంత? అందులో ఆర్బీకే ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం ఎంత? దానిలో రైతులకు పెట్టిన బకాయిలు ఎంత? అనే విషయాలపై ఈ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-08-17T18:09:49+05:30 IST