
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టమోట, మిర్చి ధరల పతనంతో నష్టపోతున్న అన్నదాతను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటలు సాగుచేసే రైతన్నకు కనీస గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలోకి కూరుకుపోతుంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో టమోట, పచ్చి మిర్చి ధరలు దారుణంగా పతనమయ్యాయన్నారు. రైతులను ఆదుకోవడంలో జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. టమోట కిలో రూపాయి నుంచి రూ.5 వరకు మాత్రమే దక్కుతోందన్నారు. కూలి, రవాణ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని తెలిపారు. టమోట పంటను రోడ్లపైనే రైతులు పారబోస్తుంటే జగన్ రెడ్డి కళ్లకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పచ్చిమిర్చి ధర కేజీ రూ.3 కు పడిపోయిందని... క్వింటా మిర్చి 3 వేల వరకు తగ్గిందని తెలిపారు. పత్తి కొనుగోలులోనూ రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. పొలంలోనే పంటలను రైతులు తగులబెడుతుంటే ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి కన్నబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏమైందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే మిర్చి, టమోట, పత్తి పంటలకు గిట్టుబాట ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని... లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.