‘జగన్...మీ మూర్ఖపు నిర్ణయాలతో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తేవొద్దు’

ABN , First Publish Date - 2021-04-23T15:57:29+05:30 IST

‘‘జగన్ రెడ్డి మీ మూర్ఖపు నిర్ణయాలతో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తేవొద్దు’’ అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు.

‘జగన్...మీ మూర్ఖపు నిర్ణయాలతో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తేవొద్దు’

అమరావతి: ‘‘జగన్ రెడ్డి మీ మూర్ఖపు నిర్ణయాలతో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తేవొద్దు’’ అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దేశంలోని మెజార్టీ రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే.. జగన్ రెడ్డి ప్రభుత్వం మొండిగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సరికాదని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని...సరిపడా వ్యాక్షిన్ లేదని, హాస్పిటల్స్ లో రోగులకు ఆక్సిజన్, మందులు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. గత సంవత్సరం కరోనా వల్ల సిలబస్ కుదించారని,  ఆ కుదించిన సిలబస్ కూడా విద్యార్థులకు బోధించలేకపోయారని చెప్పారు. ఓ వైపు కరోనా తీవ్రత, మరో వైపు పూర్తికాని సిలబస్‌తో పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు  తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి  విద్యార్థుల ప్రాణాలతో  చెలగాటమాడుతారా? అని ప్రశ్నించారు.


కరోనా ఉధృతి వల్ల ఐ.సి.ఎ.స్సి, సి.బి.ఎ.స్సి, జె.ఈ.ఈ మెయిన్స్ వంటి పరీక్షలు వాయిదా వేశారని తెలిపారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు రద్దు చేశారన్నారు. జగన్ రెడ్డి కరోనాకి భయపడి తాడేపల్లి ప్యాలెస్ గేటు కూడా దాటడం లేదని.. మరి  విద్యార్థులు స్కూల్, కాలేజీలకు వచ్చి పరీక్షలు ఎలా రాస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారని, పలువురు చనిపోయారని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు పెడితే లక్షల మంది విద్యార్థులు కరోనా బారినపడే ప్రమాదం పొంచి ఉందన్నారు. మరి విద్యార్థుల ప్రాణాలకు ముఖ్యమంత్రి భాద్యత వహిస్తారా? లేక విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తారా? అని అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. 


Updated Date - 2021-04-23T15:57:29+05:30 IST