శ్రీకాళహస్తిలో టీడీపీ నేతపై దాడి

ABN , First Publish Date - 2021-04-17T05:59:44+05:30 IST

శ్రీకాళహస్తి మండల పరిధిలో ఓ టీడీపీ నేతపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయగా, మరో ఇద్దరిని బెదిరించారు.

శ్రీకాళహస్తిలో టీడీపీ నేతపై దాడి
దాడిపై ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రకాష్‌ నాయుడు

మరో ఇద్దరికి బెదిరింపులు 


శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 16: శ్రీకాళహస్తి మండల పరిధిలో ఓ టీడీపీ నేతపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయగా, మరో ఇద్దరిని బెదిరించారు. శ్రీకాళహస్తి పట్టణం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ప్రకాష్‌ నాయుడు టీడీపీలో క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్నారు. శనివారం జరిగే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు సంబంధించి పట్టణంలోని 109, 110, 111 పోలింగ్‌ కేంద్రాల ఏజెంట్‌గా పార్టీ తరపున వ్యవహరిస్తున్నారు. కాగా, శుక్రవారం ఆయన ఇంటి నుంచి ద్విచక్రవాహనంలో పట్టణం వైపు బయలుదేరి రైల్వేస్టేషన్‌ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు యువకులు ద్విచక్రవాహనంలో వెనుక నుంచి వచ్చి ఆయన్ను ఢీకొన్నారు. కిందపడిన ప్రకాష్‌పై దాడి చేయగా, ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినా పట్టించుకోలేదు. దీనిని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకోగా ఆ యువకులు పరారయ్యారు. కాగా, ద్విచక్రవాహనంపై వైసీపీ స్టిక్కర్‌ ఉందనీ, దాడికి పాల్పడిన యువకులు వైసీపీ కార్యకర్తలే అని ప్రకాష్‌ నాయుడు ఆరోపించారు. ఉప ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్‌గా ఉండరాదని బెదిరించడానికే తనపై దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఇలాంటి దాడులకు తాను భయపడనని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది. పట్టణంలో ని వెయ్యంపల్లెకు చెందిన మరో టీడీపీ ఏజెంట్‌పై శుక్రవారం రాత్రి పలువురు దాడికి విఫలయత్నం చేశారు. ఏజెంట్‌గా కూర్చుంటే తలపగలగొడతామని హెచ్చరించి వెళ్లారు. శ్రీకాళహస్తి మండలం పోలి గ్రామానికి చెందిన టీడీపీ నేత జనార్దన నాయుడు ఇంటికి రాత్రి 10 గంటల ప్రాంతంలో పోలీసులు వెళ్లి బెదిరించినట్లు తెలిసింది. పార్టీ తరపున ఏజెంట్లను నియమిస్తే ఇబ్బందులు తప్పవని ఆయన్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-04-17T05:59:44+05:30 IST