ఏపీకి నేనే చివరి సీఎం అన్నట్లుగా ఆస్తులన్నీ YS Jagan అమ్ముతున్నారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-02-11T19:00:05+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.

ఏపీకి నేనే చివరి సీఎం అన్నట్లుగా ఆస్తులన్నీ YS Jagan అమ్ముతున్నారు: చంద్రబాబు

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. జగన్‌కు సొంత లాభం తప్ప.. ప్రజాక్షేమం పట్టదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారిపోయాయని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ సర్కార్‌ను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ద్రోహుల ఆట కట్టించాలంటే.. ప్రజాచైతన్యం రావాలని బాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు. రెండున్నరేళ్లలో జగన్‌రెడ్డి రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు భారం మోపారన్నారు. జగన్ చేసే అప్పులు ఎవరూ కట్టరని.. రేపు ప్రజలే కట్టాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెడుతున్నారని మండిపడ్డారు.


ఏపీకి నేనే చివరి సీఎం అన్నట్లు.. రాష్ట్రంలో ఉన్న ఆస్తులను వైఎస్ జగన్  అమ్ముతున్నారని దుయ్యబట్టారు. చివరికి చెత్త పైనా పన్ను వేసే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. దేశంలో నిత్యావసరాలు, గ్యాస్, లిక్కర్ ధరలు ఏపీలోనే ఎక్కువ అని తెలిపారు. సహజ వనరుల దోపిడీకి పాల్పడుతూ ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నారని అన్నారు. నీతి నిజాయితీగా రాష్ట్రంలో రూపాయి కూడా ఎవరూ సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వైసీపీ నేతలు కోటీశ్వరులవుతుంటే పేదలు నిరుపేదలుగా మారుతున్నారన్నారు. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మృతులకు దేశమంతా ఎంతోకొంత పరిహారం ఇచ్చినా జగన్‌రెడ్డి మాత్రం రూపాయి సాయం కూడా ఇవ్వలేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-02-11T19:00:05+05:30 IST