పోలీసులను బానిసల్లా వాడుతున్నారు!

ABN , First Publish Date - 2022-06-11T06:58:10+05:30 IST

వైసీపీ ప్రభుత్వం పోలీసులను బానిసల్లా వాడుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చట్టం, న్యాయం, రాజ్యాంగాలను పక్కన పడేసి..

పోలీసులను బానిసల్లా వాడుతున్నారు!

మా వాళ్లను చంపితే పరామర్శించే

హక్కు మా పార్టీ నేతలకు లేదా?

గృహనిర్బంధానికి మీకున్న హక్కేంటి?

వైసీపీ ఎమ్మెల్సీ.. డ్రైవర్‌ను చంపితే

డీజీపీ ఏం చేస్తున్నారు?

ఆయన ఐపీఎస్‌ ఎలా పాసయ్యారు? 

ఈ హత్య పక్కదారికి కోనసీమలో చిచ్చు 

రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నా సీబీఐకి పట్టదా?

ఇక ప్రతి అక్రమ కేసునూ ప్రశ్నిస్తాం

ప్రైవేటు కేసులు వేస్తాం.. చంద్రబాబు హెచ్చరిక


రాష్ట్రంలో పోలీసులు గతంలో తీవ్రవాదం, ఫ్యాక్షనిజం, మత కల్లోలాలు, రౌడీయిజంపై బలంగా పోరాడి వాటిని అదుపుచేసి ప్రజల ప్రశంసలు పొందారు. ఇప్పుడు నేరగాళ్లతో చేతులు కలిపి ప్రజల్లో చులకన అయ్యారు.

సీబీఐ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒక నేరగాడు ముఖ్యమంత్రి అయి మరిన్ని నేరాలు చేస్తున్నా అది ఉదాశీనంగా ఎలా ఉంటోంది?

వేధింపులకు భయపడి మేం ఇంట్లో కూర్చుంటే జగన్‌రెడ్డి 175 సీట్లు గెలుచుకుంటారా?

జగన్‌కు వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలు. రాష్ట్రానికి పట్టిన అరిష్టాన్ని ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు శాశ్వతంగా వదిలించుకుంటారు.

చంద్రబాబు


అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం పోలీసులను బానిసల్లా వాడుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చట్టం, న్యాయం, రాజ్యాంగాలను పక్కన పడేసి.. వైసీపీ నేతలు ఏం చెబితే అది చేయడం.. ఏ కేసు పెట్టమం టే అది పెట్టడం.. ఎవరిని పట్టుకు రమ్మంటే వారిని పట్టుకురావడమే పోలీసు శాఖ పనిగా మారిందని దుయ్యబట్టారు. ‘16 కేసుల్లో ప్రథమ నిందితుడిగా ఉన్న ఒక నేరగాడు.. పీఠం మీద కూర్చుని ఆదేశిస్తే మిగిలిన పార్టీల వారి హక్కులను పోలీసు అధికారులు హరిస్తారా? దీనిని మేం తలవంచుకుని భరించాలా? సహనానికి కూడా హద్దుంటుంది. తిరగబడే రోజు వస్తే తుపాకులు, తూటాలు అడ్డుకోలేవని గుర్తించండి’ అని హెచ్చరించారు. శుక్రవారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్యలతో కలిసి చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.


ఒక డీజీపీ పోయి మరో డీజీపీ వచ్చినా రాష్ట్రంలో దిగజారిన పరిస్థితుల్లో మార్పు రాలేదని, బాధతో ఆవేదనతో ఈ మాటలు చెప్పాల్సి వస్తోందన్నారు. ‘మాచర్ల నియోజకవర్గంలో ఐదుగురు టీడీపీ నేతలను చంపారు. మా వాళ్లను చంపితే పరామర్శించే హక్కు మా పార్టీ నేతలకు లేదా? ఇళ్లలో మా పార్టీ నేతలను అక్రమంగా నిర్బంధించడానికి పోలీసు అధికారులకు ఉన్న హక్కేంటి? వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్‌ను కిరాతకంగా చంపడమే కాకుండా కుటుంబ సభ్యులను బెదిరిస్తుంటే డీజీపీ తన సీట్లో కూర్చుని ఏం చేస్తున్నారు? ఆయన ఐపీఎస్‌ ఎలా పాసయ్యారు? జగన్‌రెడ్డి ఐదేళ్లు ఉండి పోతాడు. మీ డ్యూటీ మీరు చేయరా? ఈ హత్యను పక్కదారి పట్టించడానికి కోనసీమలో చిచ్చు పెట్టారు. ఇష్టానుసారం కేసులు పెట్టి ప్రజలను భయబ్రాంతులను చేస్తున్నారు. మీరు ఎంత వేధించినా వాటిని భరిస్తూ ఉం డాలా?  సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్న శ్రీనివాసులరెడ్డి, గంగిరెడ్డి, గంగాధరరెడ్డి వరుసగా చనిపోతే పోలీసు శాఖ ఏం చేస్తోంది? ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరిని చంపుతామని రోజూ బెదిరిస్తున్నారు. సీబీఐ అధికారుల డ్రైవర్‌పై బాంబులు వేస్తామని బెదిరించారు.


ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు పెడితే ఆయ న హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవలసి వచ్చింది. నేరగాళ్లు రాజకీయాన్ని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నా సీబీఐకి పట్టదా’ అని నిలదీశారు. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం ఉందని, ఇప్పుడే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


వేధింపులకేనా సీఐడీ?

రాష్ట్రంలో సీబీసీఐడీ ఉన్నది ఇతర పార్టీలను వేధించడానికేనా? ప్రతిపక్షాల వారికి నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం తప్ప ఈ విభాగం మరో పని చేయడం లేదు. అధికార పార్టీ సేవలో మునిగి తేలుతున్నారు. మఫ్టీలో వచ్చి కిడ్నాపులు చేస్తున్నారు. ఒక ఎంపీని సీఐడీ కార్యాలయంలో కొట్టి చంపాలని చూశారు. 41ఏ కింద నోటీసు ఇచ్చి విచారించే కేసు అయితే మహిళను ఆమె ఇంటి వద్దే విచారించాలి. మా పార్టీ నేత గౌతు శిరీషను ఏ కేసు కోసం పిలిపించారు? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలి. ఎందుకు చేయలేదు? సీఐడీ అధికారులెవరూ తమ పేరు, హోదా తెలిపే బ్యాడ్జీ పెట్టుకోలేదు. వారు అధికారులా లేక వైసీపీ గూండాలా? మీ పార్టీలో పైవాళ్ల పేర్లు చెప్పాలని ఒత్తిడి తేవడం ఏమిటి? సీఐడీ అధికారులకు ఎందుకంత ఉత్సాహం? వైసీపీ వాళ్లు అనేక నకిలీ పోస్టులు పెట్టారు. చివరకు నా లెటర్‌ పాడ్‌పై కూడా నకిలీ ప్రకటన సృష్టించారు. మేం ఫిర్యాదులు చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? దెబ్బలు తిన్న టీడీపీ కార్యకర్తలపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టి కొట్టిన వైసీపీ వారిపై బెయిలబుల్‌ కేసులు పెడుతున్నారు. టీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే కిక్కురుమనని పోలీసు అధికారులు వైసీపీ వాళ్లు ఇస్తే మాత్రం వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ వివక్ష...అణిచివేతను ఇక భరించేది లేదు. ఇకపై ప్రతి కేసునూ ప్రశ్నిస్తాం. ప్రతి తప్పునూ ఎత్తిచూపుతాం. మార్పు రాకపోతే ప్రైవేటు కేసులు వేస్తాం. పోరాడే ప్రతి వ్యక్తికి అండగా నిలబడతాం.


హక్కుల పత్రాలు ప్రతి ఇంటికీ పంపిస్తాం..

పోలీసులు పెడుతున్న కేసుల్లో ప్రజలకు కూడా అనేక హక్కులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తమ తీర్పుల్లో స్పష్టంగా పేర్కొన్న ఈ హక్కులను రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పంపిస్తాం. విచారణ చేసే పోలీసు అధికారి తన వివరాలు చెప్పాలి. విచారణకు సంబంధించిన అన్ని విషయాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలి. అరెస్టు చేసేటట్లయితే అరెస్టు మెమో తయారు చేసి ఇవ్వాలి. మాజీ మంత్రి నారాయణ, ఆయన భార్య పోతుంటే కిడ్నాపర్ల మాదిరిగా రోడ్డు మీద పట్టుకుని తీసుకెళ్లడం కాదు.. అరెస్టు మెమో ఇచ్చి తీసుకుని వెళ్లాలి. ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వాలి. అరెస్టు వివరాలు కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. అరెస్టయిన వ్యక్తికి న్యాయవాది సహాయం పొందే హక్కు ఉంది. పోలీసులు నిరాకరించడానికి వీల్లేదు. కొన్నిచోట్ల 41ఏ కింద అరెస్టు చేస్తే రిమాండ్‌కు పంపారు. అందులో కొందరు న్యాయమూర్తులు కూడా సస్పెండ్‌ అయ్యారు. ఈ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.


భార్య కాపురం చేయకపోయినా మేమే కారణమా?

భార్య కాపురం చేయకపోయినా టీడీపీనే కారణమన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. రైతులు పంట విరామం ప్రకటిస్తే దానికి టీడీపీ కారణమా? పూడిపోయిన కాల్వల్లో పూడిక తీశారా? మద్దతు ధర కల్పించారా? మొత్తం ఇరిగేషన్‌ను నాశనం చేశారు. ఒక్క ధాన్యం రైతులే కాదు.. ఆక్వా రైతులు, ఉద్యాన పంటల రైతులు కూడా ఈ ప్రభుత్వ హయాంలో పంట విరామం ప్రకటించే ఆలోచన చేస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో రెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిలైతే దానికి ఆత్మ విమర్శ చేసుకోకుండా మమ్మల్ని తిడితే ఏం ఉపయోగం? ఏ-2 (విజయసాయిఎడ్డి) ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నీకు ఊడిగం చేయడానికి మేం లేం. టీచర్లను బ్రాందీ షాపుల వద్ద డ్యూటీ వేసిన రోజే వాళ్లు చచ్చిపోయారు. టీడీపీ ఆన్‌లైన్‌ బోధన పెడితే వీళ్లు పీకేశారు.


అది ఉంటే కరోనా కాలంలో పనికివచ్చేది. పిల్లలకు భరోసా ఇవ్వడానికి లోకేశ్‌ జూమ్‌ మీటింగ్‌ పెడితే సిగ్గు లేకుండా వైసీపీ నేతలు అందులో దూరారు. దానికి ఏ-2 సమర్థింపా? ఇలాగే బరి తెగిస్తే ప్రజలు శ్రీలంకలో మాదిరిగా ఇళ్లపై దాడి చేసి కొట్టే రోజు వస్తుంది. ఒంగోలు మహానాడుకు బస్సులు ఇవ్వకుండా ఆపుచేస్తే ప్రజలు కట్టలు తెంచుకుని వచ్చారు. అతి చేస్తే ఇలాగే జరుగుతుందని గుర్తించాలి. ప్రభుత్వ పఽథకాలపై ఏవో పోస్టులు ఫార్వర్డ్‌ చేశారని టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. జనవరిలో అమ్మ ఒడి ఎందుకు ఇవ్వలేకపోయారో.. 300 యూనిట్ల నిబంధన ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలి.

Updated Date - 2022-06-11T06:58:10+05:30 IST