సమావేశంలో మాట్లాడుతున్న ముద్దరబోయిన
నూజివీడు టౌన్, జూలై 1: జగన్రెడ్డి నయవంచనలకు ఆర్టీసీ బలవు తోందని నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్దర బోయిన వెంకటేశ్వరరావు ఆరోపించారు. ధరలు పెంచమని చెప్పి గద్దెనెక్కిన జగన్రెడ్డి ఆర్టీసీ ఛార్జీలను మూడోసారి పెంచారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నానన్న జగన్ ఉద్యోగులను మాత్రం విలీనం చేస్తున్నట్లు ప్రకటించి, వారికి న్యాయపరంగా రావాల్సిన కనీస ప్రయోజనాలను రాకుండా చేశారన్నారు. ఛార్జీలను పెంచినప్పుడు రూ.675 కోట్లు ప్రజలపై భారం మోపగా, రెండోసారి రెండు విడతలుగా రూ.1500 కోట్లు భారం మోపి, మొత్తం రూ.2,175 కోట్లు సామాన్యులపై భారం మోపారన్నారు. నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాల్సింది పోయి, ఆర్టీసీ ఆదాయంలో కొంత ప్రభుత్వం తీసుకునేందుకు ప్రయత్నించటం ఆర్టీసీని కనుమరుగు చేయటమేనన్నారు. ఆర్టీసీ కార్మికులను పీటీడీ సిబ్బందిగా మార్చి ప్రైవేట్ రిఫరల్ ఆసుపత్రులలో వైద్యానికి దూరం చేశారన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు ముసునూరు రాజా, ఏలూరు పార్లమెంట్ తెలుగురైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ చార్జీల పెంపు దారుణం
చాట్రాయి: డీజిల్ సెస్ పేరుతో ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచటం దారుణమని పలువురు టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి, జిల్లా తెలుగురైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, నాయకుడు పుచ్చకాయల నోబుల్రెడ్డి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరిడి చిట్టిబాబు, పలగాని దుర్గారావు మాట్లాడుతూ ఇప్పటికే చార్జీల భారం మోస్తున్న ప్రయాణికులపై భారం తగదన్నారు. జగన్ బాదుడుకి అంతులేకుండా పోయిందన్నారు.