
అమరావతి: రాష్ట్రంలో 20 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయకుండా 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేయడం హేయమని టీడీపీ నేత డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని మాట ఇచ్చిన జగన్ రెడ్డి మూడేళ్లుగా మాట తప్పారు, మడమ తిప్పారని విమర్శించారు. ఉపాధ్యాయుల చేత మొన్న మద్యం అమ్మించారని, నిన్న రోడ్డు ఎక్కించారని, నేడు పోస్టులు రద్దు చేసి పొట్టుకొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ బదిలీలను ప్రశ్నించినందుకు లాఠీ చార్జ్ చేయించారన్నారు. నాడు నేడు పనుల ఒత్తిడికి ఉపాధ్యాయులను బలిగొన్నారని అన్నారు.
కరోనా సమయంలో లక్షలాది మంది ప్రైవేట్ టీచర్లను రోడ్డున పడేశారని మండిపడ్డారు. 3,4,5 పాఠశాలల విలీనం పేరుతో మరిన్ని పోస్టులను రద్దు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. అమ్మ ఒడిని నాన్న బుడ్డిగా మార్చారని, ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పీజీ విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ను రద్దు చేసి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని డోలా బాల వీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి