ఇసుక తుఫాన్‌లో కొట్టుకుపోవటం ఖాయం

ABN , First Publish Date - 2020-12-03T18:16:36+05:30 IST

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి కృత్రిమ కొరత సృష్టించిన జగన్‌ ప్రభుత్వం అదే ఇసుక తుఫాన్‌లో కోట్టుకుపోవటం ఖాయమని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు

ఇసుక తుఫాన్‌లో కొట్టుకుపోవటం ఖాయం

జగన్‌ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత జీవీ ఆంజనేయులు


గుంటూరు (ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి కృత్రిమ కొరత సృష్టించిన జగన్‌ ప్రభుత్వం అదే ఇసుక తుఫాన్‌లో కోట్టుకుపోవటం ఖాయమని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. బుధవారం ఆయన అన్‌లైన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇసుక దొరకనివ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్య వల్ల రాష్ట్రంలో 30 లక్షల భవననిర్మాణ కార్మికుల కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పనుల్లేక భవననిర్మాణ కార్మికలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. 18 నెలలుగా జరిగిన ఇసుక దోపిడీ, జే ట్యాక్స్‌కు స్వస్థిపలికి రాష్ట్రంలో దోపిడీకి అడ్డుకట్ట వేయాలని జీవీ ఆంజనేయులు కోరారు.


ఇసుక పాలసీపై ప్రభుత్వ అవగాహనారాహిత్యం: మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి

రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ ఇసుక కొరత, ఇసుక పాలసీపై సరైన అవగాహన లేదని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక ధరల పెంపు, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా అందించామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్య వలన 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని, టీడీపీ అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి కృత్రిమ కొరతను సృష్టించారన్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇసుక విధానం ఆ పార్టీ నాయకుల జేబులు నింపటానికి తప్ప రాష్ట్ర ప్రజలకు ఏ రకంగాను ఉపయోగం లేదన్నారు. సొంత మనుషులకు ఇసుక కాంట్రాక్ట్‌ కట్టబెట్టేందుకే ఈ విధానాలను అవలంబిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మనస్సు మార్చుకొని ఉచిత ఇసుక విధానం అమలు చేయాలన్నారు.

Updated Date - 2020-12-03T18:16:36+05:30 IST