టీడీపీ నేత కొండ్రెడ్డి అరెస్టు

ABN , First Publish Date - 2022-07-01T04:52:33+05:30 IST

మదనపల్లెలో జూలై 6వ తేదీ జరిగే మినీ మహానాడును భగ్నం చేసేందుకే తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తన తండ్రిపై తప్పుడు కేసు పెట్టించి జైలుకు పంపాడని కొండ్రెడ్డి తనయుడు లక్ష్మీకర్‌రెడ్డి ఆరోపించాడు.

టీడీపీ నేత కొండ్రెడ్డి అరెస్టు
టీడీపీ నేత కొండ్రెడ్డి (ఫైల్‌ఫొటో)

ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి తప్పుడు కేసు పెట్టించారు

ఆ భూమికీ మాకూ..ఎలాంటి సంబంధం లేదు

కొండ్రెడ్డి తనయుడు లక్ష్మీకర్‌రెడ్డి ఆరోపణ


మదనపల్లె క్రైం, జూన్‌ 30: మదనపల్లెలో జూలై 6వ తేదీ జరిగే మినీ మహానాడును భగ్నం చేసేందుకే తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తన తండ్రిపై తప్పుడు కేసు పెట్టించి జైలుకు పంపాడని కొండ్రెడ్డి తనయుడు లక్ష్మీకర్‌రెడ్డి ఆరోపించాడు. తంబళ్లపల్లెకు చెందిన టీడీపీ నేత మద్దిరెడ్డిగారి కొండ్రెడ్డిని గురువారం మదనపల్లె వన్‌టౌన్‌ పోలీసులు చీటింగ్‌ కేసులో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇతడితో పాటు రంగయ్య అనే వ్యక్తిని కూడా జైలుకు పంపారు. దీనిపై స్పందించిన లక్ష్మీకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో మొన్న జరిగిన మీడియా సమావేశంలో మినీ మహానాడుకు తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి 500 వాహనాలతో నాయకులు, కార్యకర్తలతో కలసి హాజరవుతామని తన తండ్రి చెప్పాడన్నారు. ఈ జనసమీకరణను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశామన్నారు. దీనిని ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి దృష్టిలో ఉంచుకుని మినీ మహానాడును భగ్నం చేసేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. కొండ్రెడ్డిని ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైలుకు పంపితే తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి ఒక్క వాహనం కూడా వెళ్లదనే కుట్రతో ఈ పనిచేశాడన్నారు. మదనపల్లెలోని బసినికొండలో ఉన్న ఐదు సెంట్ల భూమికీ మాకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. కేసులో సాక్షిగా ఉన్న రంగయ్య చంద్రగిరికి చెందిన నాగరాజకు విక్రయించాడన్నారు. ఇందులో తన తండ్రి సాక్షి సంతకం పెట్టాడన్నారు. దీనిని పో లీసులు తారుమారు చేశారన్నారు. ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి మాటలు విని తన తండ్రే ఆ భూమిని నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి నాగరాజకు విక్రయించాడని సాక్షులను తయారు చేసి అన్యాయంగా కేసులో ఇరికించా రని ఆవేదన వ్యక్తం చేశాడు. మదనపల్లె వన్‌టౌన్‌ పోలీసులు బుధవారం తంబళ్లపల్లెకు వచ్చి, సీఐ పిలుస్తున్నాడని కారులో తీసుకొచ్చారన్నారు. దాంతో తాము కూడా వేరే వాహనాల్లో స్టేషన్‌ వద్దకు చేరుకున్నామన్నా రు. విచారణ పేరుతో లోపలికి తీసుకెళ్లి గంటల తరబడి అక్కడే ఉంచుకున్నారన్నారు. తీరా రాత్రి 10 గంటల సమయంలో చీటింగ్‌ కేసు నమోదైందని చెప్పారని, గురువారం ఉదయం కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనంతటికీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డే ప్రధాన కారకుడని ఆరోపించారు. తన తండ్రికి ఏదైనా ప్రాణహాని జరిగితే అందుకు ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.  కాగా బసినికొండలో ఫోర్జరీ సంతకాలతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి భూమిని విక్రయించాడని ఫిర్యాదు రావడంతో కొండ్రెడ్డిని అరెస్టు చేశామని వన్‌టౌన్‌ సీఐ ఈదురుబాషా చెప్పారు. కొండ్రెడ్డితో పాటు అనంతపురం జిల్లా కోనకొండ్లకు చెందిన రంగయ్యను కూడా అరెస్టు చేశామని, వీరిద్దరినీ గురువారం రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2022-07-01T04:52:33+05:30 IST