జగన్‌ నా వెంట్రుక కూడా పీకలేడు: Lokesh

ABN , First Publish Date - 2022-05-23T17:39:20+05:30 IST

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్‌ నా వెంట్రుక కూడా పీకలేడు: Lokesh

అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు’’ అని అన్నారు.  ఎన్నో కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డానని తనపై అసత్య ఆరోపణలు చేసి ఏమీ పీకలేక కోవిడ్ నిబంధనల ఉల్లంఘనల కేసులో కోర్టుకు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పటి వరకు తనపై 14 కేసులు పెట్టి ఏం పీకారని ప్రశ్నించారు. కావాలంటే మరో 10కేసులు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే కోర్టుకు వచ్చానని, జగన్ లా వాయిదాలు తీసుకోవట్లేదని టీడీపీ నేత తెలిపారు.


ప్రజలు రాళ్లతో కొట్టించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటున్నారన్నారు. 2016 నుంచి తపపై చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమని... తన అవినీతి కేసులపై చర్చకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. తెలుగుదేశం నేతలతో పాటు దళిత ప్రజలపై వైసీపీ దాడులకు తెగపడుతోందన్నారు. తాజాగా సొంత కార్యకర్తల పైనే దాడులకు తెగపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఆనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. సొంత పార్టీ కార్యకర్తను కొట్టి చంపేసినా ఆ కుటుంబాన్ని కాపాడలేని పరిస్థితిల్లో జగన్ ఉన్నారన్నారు. 72 గంటల్లో ఎమ్మెల్సీ అనంతబాబు... సజ్జల సహా వైసీపీ ముఖ్య నేతలను కలిశారని ఆయన తెలిపారు.


ఎమ్మెల్సీకి భద్రత కల్పించేది పోలీసులే అని అన్నారు. ‘‘ఎమ్మెల్సీ అనంతబాబు తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉన్నాడా. నేను కోర్టుకు వస్తే,  500మంది పోలీసులు వచ్చారు. నా చుట్టూ తిరిగే పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబుని పట్టుకోండి. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.2కోట్లు, పొలం ఇస్తానని ప్రలోభ పెట్టారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. . పోలవరం పూర్తి చేస్తానంటూ సవాళ్లు చేసిన ఓ మంత్రి నాకు సంబంధం లేదంటున్నారన్నారు. జలవనరులపై అవగాహన లేని మరో వ్యక్తి ఇప్ప్పుడు మంత్రి అయ్యారని తెలిపారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన వైసీపీ పొలిట్ బ్యూరో సమావేశంలా ఉందని వ్యాఖ్యానించారు. ఆదానీని కలిసేందుకు దావోస్ దాకా వెళ్ళారా అని నిలదీశారు. జగన్ రెడ్డి దేశం వదిలి వెళ్ళాక పెట్రోల్ ధరలు తగ్గాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన ఒక్క పరిశ్రమ అయినా చెప్పగలరా అంటూ లోకేష్ ప్రశ్నించారు. 

Updated Date - 2022-05-23T17:39:20+05:30 IST