121 పైసల అవినీతిని కూడానిరూపించలేరు

Sep 15 2021 @ 03:58AM

సర్కారే స్కాం చేసింది: పట్టాభి 

దేశానికే ఆదర్శంగా నిలిచిన ప్రాజెక్టుపై బురదజల్లుతున్నారు

ఫైబర్‌ నెట్‌ సర్వీసు పేరుతో వైసీపీ సర్కారే స్కాం చేసింది

త్వరలోనే బయటపెడతాం.. టీడీపీ నేత పట్టాభి హెచ్చరిక


అమరావతి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టులో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని జగన్‌ రెడ్డి సొంత మీడియాలో గత నెలలో అనేక కథనాలు రాశారు. కార్పొరేషన్‌ చైర్మన్‌ గౌతంరెడ్డి నిన్న  రూ.121 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. నెల తిరిగేసరికి 2 వేల కోట్లు వంద కోట్లయ్యాయి. తలకిందులు గా తపస్సు చేసినా అందులో 121 పైసల అవినీతిని కూడా ప్రభుత్వం నిరూపించలేదు’ అని టీడీపీ స్పష్టం చేసింది. ఒక తప్పుడు వ్యక్తిని ముందు పెట్టుకుని ఈ ప్రాజెక్టుపై ఆరోపణల కఽథలు అల్లారని.. ఆ వ్యక్తి తప్పుడు వ్యవహారాలను ఇదే ప్రభు త్వం అధికారికంగా అంగీకరించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం పేర్కొన్నారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘టీడీపీ హయాంలో ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు ను పొందిన టెరా సాఫ్ట్‌ కంపెనీకి దానిని పొందే అర్హత లేదని, సిగ్నం అనే కంపెనీ నుంచి నకిలీ అనుభవ పత్రం తెచ్చి సమర్పించి ఈ పనిని పొందిందన్నది వైసీపీ ప్రభుత్వ ప్రధాన ఆరోప ణ. అయితే, ఈ సర్కారు అదే సిగ్నం కంపెనీకి చెందిన గౌరీశంకర్‌ అనే వ్యక్తిని తెచ్చి కార్పొరేషన్‌కు ఏకంగా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించారు.


అతడిని ముందు పెట్టి అతడు చేసిన ఆరోపణలను ప్రాతిపదికగా తీసుకుని ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుపై బురదజల్లుతోంది. గౌరీశంకర్‌ అనే వ్యక్తికి కనీస విద్యార్హతలు లేవని.. తప్పుడు ధ్రువపత్రాలతో ఆ పోస్టులో చేరాడని వార్తలు వచ్చాయి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు.. గౌరీశంకర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది’ అని పేర్కొన్నారు. గౌతంరెడ్డి కేవలం రాజకీయకక్షతో ఆరోపణలు చేశారని, ఒక్కటి కూడా నిజం లేదని పట్టాభి అన్నారు. ‘‘టెరా సాఫ్ట్‌ కంపెనీకి ప్రయోజనం కల్పించడానికే టెండర్‌ గడువు పొడిగించారన్నది ఆరోపణ. దేశంలో ఈ తరహాలో మొదటి ప్రాజెక్టు కావడం వల్ల దీనికి సమయం పట్టింది. బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న టెరా సాఫ్ట్‌ కంపెనీని ఆ జాబితా నుంచి ఆఖరు నిమిషంలో తొలగించి ప్రయోజనం కల్పించారన్నది మరో ఆరోపణ. పౌర సరఫరాల శాఖకు ఈ-పోస్‌ యంత్రాలను ఆ కంపెనీ సరఫరా చేసింది. సాంకేతిక సమస్యలు రావడంతో దానిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. తాము వాటన్నింటినీ పరిష్కరించడంతో బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తొలగించాలని ఆ కంపెనీ 2015 మే 22న ప్రభుత్వాన్ని కోరింది. తొలగించవచ్చని కమిషనర్‌ జూలై 15న సిఫారసు చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పుడు ప్రభుత్వానికి నెలకు రూ.పది కోట్ల ఆదాయం వస్తోంది. దీనిని అడ్డం పెట్టుకుని సర్వీసు పేరుతో వైసీపీ ప్రభుత్వమే కుంభకోణానికి పాల్పడింది. దానిని త్వరలోనే బయటపెడతాం’’ అని పట్టాభి హెచ్చరించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.