క్షమాపణ చెప్పిన టీడీపీ నేత.. Last chance ఇచ్చిన చంద్రబాబు.. మూడు నెలలే గడువు.. ఏం జరుగునో..!

ABN , First Publish Date - 2021-12-24T12:34:55+05:30 IST

క్షమాపణ చెప్పిన టీడీపీ నేత.. Last chance ఇచ్చిన చంద్రబాబు.. మూడు నెలలే గడువు.. ఏం జరుగునో..!

క్షమాపణ చెప్పిన టీడీపీ నేత.. Last chance ఇచ్చిన చంద్రబాబు.. మూడు నెలలే గడువు.. ఏం జరుగునో..!

  • శంకర్‌కే మరో అవకాశం
  • మూడు నెలల్లో చక్కబడాలి... లేదంటే తంబళ్లపల్లెకు 
  • ప్రత్యామ్నాయ నేతను చూస్తానన్న చంద్రబాబు

చిత్తూరు జిల్లా/తిరుపతి : తంబళ్ళపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌కు అధినేత చంద్రబాబు మరో అవకాశమిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఉదయం తంబళ్ళపల్లె నియోజకవర్గం నుంచీ వెళ్ళిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పొలిట్‌ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, అనగాని సత్యప్రసాద్‌, రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డి సమావేశమయ్యారు. నియోజకవర్గ కోర్‌ కమిటీ సభ్యులు 31మందితో విడివిడిగా మాట్లాడారు. ఆ సందర్భంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్‌ఛార్జిగా  ఎవరైతే బాగుంటుందని ప్రశ్నించారు. ఆ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు ఏవీ లక్ష్మీదేవమ్మ, ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలతో పాటు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి పేర్లు కూడా పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రస్తావించారు.వారి నుంచీ సేకరించిన అభిప్రాయాలను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారు.


అనంతరం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.ఆ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల తర్వాత శంకర్‌  పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకపోవడాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన శంకర్‌ తన తల్లి అనారోగ్యంతో మృతి చెందడం, కరోనా, లాక్‌డౌన్‌ వంటి కారణాలతో నియోజకవర్గానికి తరచుగా రాలేకపోయానని, కార్యకర్తలకు అందుబాటులో వుండలేకపోయానని వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ఆ సందర్భంగా కొందరు కార్యకర్తలు తాము ఇబ్బందుల్లో వుండి ఫోన్‌ చేసినా స్పందించలేదని ఆరోపించినట్టు తెలిసింది. ఆ సందర్భంగా శంకర్‌ శ్రేణులకు క్షమాపణలు చెప్పడంతో పాటు ఇన్‌ఛార్జిగా తననే కొనసాగించాలని కోరినట్టు సమాచారం. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఇన్‌ఛార్జిగా శంకర్‌ కొనసాగుతారని, అయితే ఆయనకిది చివరి అవకాశమని స్పష్టం చేశారు.


మూడు నెలల గడువు ఇస్తున్నానని, ఆలోపు పనితీరు మార్చుకోవాలని ఆదేశించారు. పార్టీలో వర్గాల్లేకుండా అందరినీ కలుపుకుని వెళ్ళాలని సూచించారు. మూడు నెలల తర్వాత మళ్ళీ సమీక్షిస్తానని, అప్పటికి పరిస్థితిలో మార్పు లేకపోతే ప్రత్యామ్నాయం చూస్తామని తేల్చి చెప్పారు. అనంతరం ఆరు మండలాలకు చెందిన సుమారు 27 మంది మండల స్థాయి నాయకుల పనితీరును సమీక్షించారు. అందరి వివరాలూ తన వద్ద వున్నాయని, ఎవరి పనితీరేమిటో తనకు తెలుసునంటూ కష్టపడి పనిచేసేవారికి తప్పక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. బి.కొత్తకోట మాజీ జడ్పీటీసీ పర్వీన్‌తాజ్‌కు తగిన గుర్తింపు ఇచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్‌ఛార్జి పదవి ఆశించిన ఆమెను శుక్రవారం ఉదయం తనను కలవాలని సూచించారు.

Updated Date - 2021-12-24T12:34:55+05:30 IST