సమావేశంలో మాట్లాడుతున్న బాబ్జి
తాడేపల్లిగూడెం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) :రవాణా రంగాన్ని కుదేలు చేసే గ్రీన్‌టాక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించు కోవాలని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. పదిహేనేళ్లు దాటిన వాహనాల కు గతంలో రూ. 200 ఉన్న గ్రీన్ టాక్స్‌ను ఇప్పుడు రూ. 20 వేలకు పెంచడం దారుణమన్నారు. లారీ విడి భాగాలు, టైర్లు, డీజల్ ధరలు పెరిగిపోయిన తరుణంలో గ్రీన్ టాక్స్‌ను సైతం పెంచడం తగదన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడుగు వెంకటేశ్వరరావు (పెద్ద) మాట్లాడుతూ లారీలకు పన్నులు చెల్లించే తరుణంలో వేలాది రూపాయలు గ్రీన్‌టాక్స్ కట్టాలని డిమాండ్ నోటీసులు పంపడం రవాణా రంగానికి మోయలేని భారంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకుని గ్రీన్ టాక్స్ ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.