బుగ్గన వాస్తవాలు మాని...పిట్టకథలు చెబుతున్నారు: Yanamala

ABN , First Publish Date - 2022-06-25T20:13:17+05:30 IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవాలు చెప్పడం మాని పిట్టకథలు చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బుగ్గన వాస్తవాలు మాని...పిట్టకథలు చెబుతున్నారు: Yanamala

అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవాలు చెప్పడం మాని పిట్టకథలు చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడతూ... కాగ్, కేంద్ర ఆర్ధిక శాఖ అడిగిన ప్రశ్నాపత్రానికి సమాధానం చెప్పలేక అబద్దాలను వల్లెవేస్తున్నారన్నారు. కోవిడ్‌తో రాష్ట్రానికి ఆదాయం తగ్గిందనే బుగ్గన మాట పచ్చి అబద్దమన్నారు. 2018-19లో పన్నులపై ఆదాయం రూ.56 వేల కోట్లు ఉంటే 2021-22 రూ.73 వేల కోట్లు వచ్చిందని తెలిపారు. కేంద్ర గ్రాంట్లు 18-19 లో రూ.19 వేల కోట్లు ఉంటే 2021-22 లో రూ.43 వేల కోట్లకు చేరాయని చెప్పుకొచ్చారు. తక్కువ మొత్తాలపై శాతం కట్టి వైసీసీ చేసిన అప్పులు తక్కువని చెబుతున్నారని, ఈ రకమైన పరిగణన బహుశా ఆర్థికవేత్తలు ఎవరూ చూసి ఉండరన్నారు. వైసీపీ ప్రభుత్వంత రాబోయే తరాలపైన నిప్పుల కుంపటి లాంటి అప్పులను మూటకట్టి పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాగ్‌‌పై, వ్యవస్థలపై తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. సాక్ష్యాత్తు కాగ్‌ సంస్థ వైసీపీ ఆర్ధిక నిర్వహణపై విశ్వాసం లేదని చేసిన ఖర్చులను సర్టిఫై చేయమని విస్పష్టంగా చెప్పిందన్నారు. బహుశా భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. కాగ్‌, కేంద్ర ఆర్థికశాఖ, హైకోర్టులు, సుప్రీంకోర్టులు, సీబీఐ ఇంతవరకూ వైసీపీ ప్రభుత్వ తీరు సమర్థనీయమని ఎక్కడా ఎప్పుడూ సర్టిఫికెట్‌ ఇవ్వలేదని తెలిపారు. ప్రజలు తమ పాలనపై ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకుని మాట్లాడితే సమంజసంగా ఉంటుందని హితవుపలికారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్వాలిఫైడ్‌ ఓపినీయన్‌ పేరుతో వైసీపీ ప్రభుత్వంపై కాగ్‌ చేసిన వ్యాఖ్యలు బుగ్గన గుర్తుకు తెచ్చుకోవాలని యనమల రామకృష్ణుడు అన్నారు. 

Updated Date - 2022-06-25T20:13:17+05:30 IST