ఏపీలో ఉన్న ఆంక్షలు కశ్మీర్ సరిహద్దుల్లో కూడా లేవు: Yanamala

ABN , First Publish Date - 2022-04-25T17:26:31+05:30 IST

జగన్ రెడ్డి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాస్తూ.. బుల్డోజర్ వ్యవస్థను రాష్ట్రంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు.

ఏపీలో ఉన్న ఆంక్షలు కశ్మీర్ సరిహద్దుల్లో కూడా లేవు: Yanamala

అమరావతి: జగన్ రెడ్డి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాస్తూ.. బుల్డోజర్ వ్యవస్థను రాష్ట్రంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. సీపీఎస్ రద్దు చేయాలంటూ నిరసన తెలియజేస్తున్న ఉఫాధ్యాయుల్ని అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చమంటున్నారు తప్ప జగన్ రెడ్డి లోటస్ పాండ్‌లో వాటా అడగటం లేదు కదా? అని ప్రశ్నించారు.  ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ప్రజల హక్కు అని,  ఆ హక్కుని కూడా హరించేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల ధర్నాకు ప్రభుత్వం ఆంక్షలు విధించి దారి పొడవునా ముళ్ల కంచెలు విధించటం, ఒక్కో ఉపాధ్యాయునికి ముగ్గురు పోలీసుల్ని కాపలా పెట్టడం ఆక్షేపనీయమని ఆయన అన్నారు.


జగన్ రెడ్డి పాలనలో ఏపీలో ఉన్న ఆంక్షలు కశ్మీర్ సరిహద్దుల్లో కూడా లేవన్నారు. ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందు నిలబెట్టారని, మరుగుదొడ్లు కడిగించారని, బయోమెట్రిక్ పేరుతో వేధించారని తెలిపారు. ఇన్ని రకాలుగా ఉపాద్యాయుల సేవల్ని వాడుకుంటూ.. హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం జగన్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. హక్కుల కోసం ఉద్యమిస్తున్న వారిని అరెస్టు చేయడమంటే ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కడమే అని అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-25T17:26:31+05:30 IST