దుకాణాల తొలగింపుపై టీడీపీ నేతల ఆందోళన

ABN , First Publish Date - 2022-10-04T05:22:13+05:30 IST

పట్టణంలోని స్వయంభూ విఘ్నేశ్వరాలయం సమీపంలోని దేవదాయ శాఖ పరిధిలోని హార్డింజి అతిథిగృహం వద్ద ఉన్న దుకాణాల తొలగింపుపై సోమవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.

దుకాణాల తొలగింపుపై టీడీపీ నేతల ఆందోళన
బాధితులతో కలిసి ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు



నోటీసులు ఇవ్వకుండా దుకాణాల కూల్చడంపై నిరసన 

చోడవరం, అక్టోబరు 3: పట్టణంలోని స్వయంభూ విఘ్నేశ్వరాలయం సమీపంలోని దేవదాయ శాఖ పరిధిలోని హార్డింజి అతిథిగృహం వద్ద ఉన్న దుకాణాల తొలగింపుపై సోమవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఇక్కడ చాలాకాలంగా పది మంది వరకూ దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ దుకాణాల సముదాయం నిర్మించేందుకు వీటిని తొలగించేందుకు దేవదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ దుకాణాల తొలగింపునకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ మాజీ ఎమ్మెల్యే రాజు, గోవాడ షుగర్స్‌ మాజీ చైర్మన్‌తోపాటు పలువురు టీడీపీ నాయకులు బాధితులతో కలిసి దేవదాయ శాఖ అధికారులను నిలదీశారు. ఎంతోకాలంగా ఉంటున్న వారికి, ప్రత్యామ్నాయాలపై భరోసా ఇవ్వకుండా తొలగించడం పట్ల మాజీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. దుకాణాల తొలగింపునకు సంబంధించి దేవదాయ శాఖ ఈవో సత్యనారాయణ వివరణ సంతృప్తిగా లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు కొత్తగా నిర్మించే దుకాణాలలో అవకాశం కల్పిస్తామని లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. అలాగే బాధితుల పక్షాన మాజీ ఎమ్మెల్యే మిలట్రీనాయుడు కూడా ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు వారందరికీ దుకాణాలు పెట్టుకునేందుకు కచ్చితమైన హామీ ఇవ్వని పక్షంలో ఈ చర్యలను ముందుకు సాగనివ్వమని ఆయన స్పష్టం చేశారు.  దీనికి ఈవో బాఽధితులకు న్యాయం చేసి ముందుకు వెళతామని హామీ ఇవ్వడంతో నేతలు ఆందోళన విరమించారు.  టీడీపీ నేతల ఆందోళన సందర్భంగా దేవదాయ శాఖ కార్యాలయం  వద్ద కొంత ఉద్రిక్తత నెలకొనడంతో అనకాపల్లి డీఎస్‌పీ సునీల్‌కుమార్‌, సీఐ సునీల్‌కుమార్‌, సీఐ ఽశ్రీనివాసరావు ఘటనా స్థలానికి ,చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఆందోళనలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు కనిశెట్టి మత్య్సరాజు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మజ్జి గౌరీశంకర్‌, టీడీపీ మండల అధ్యక్షులు బొడ్డేడ నాగగంగాధర్‌, ముడుసు గోవింద్‌, ఎలకా మల్లిబాబు, దేవరపల్లి వెంకట అప్పారావు, సంతోష్‌, ఆర్‌టీవో చిన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-04T05:22:13+05:30 IST